...
...
Next Story

Air pollution : దిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత- దశాబ్ధంలో తొలిసారి! ముంబైలో వరస్ట్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 322కి పడిపోవడంతో నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనగా, శీతాకాలంలో నిత్యం ప్రతికూల అంశాలతో వార్తల్లో నిలిచే దిల్లీ మాత్రం పదేళ్లలోనే అత్యంత స్వచ్ఛమైన గాలితో ఊపిరి పీల్చుకుంటోంది!

Published on: Oct 25, 2026, 05:35:04 IST
Advertisement

సముద్రపు చల్లటి గాలులతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే దేశ ఆర్థిక రాజధాని ముంబైని విష వాయువులు కమ్మేస్తున్నాయి! శనివారం ముంబై నగరంలో గాలి నాణ్యత తీవ్రంగా దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఏకంగా 322కి చేరి 'వెరీ పూర్' (అత్యంత ప్రమాదకర) కేటగిరీలోకి పడిపోయింది. స్వచ్ఛమైన ఊపిరి కూడా లభించని పరిస్థితి ఎదురవడంతో ముంబై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

దిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత! (RAJ K RAJ /HT PHOTO)
దిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత! (RAJ K RAJ /HT PHOTO)

మరోవైపు, ప్రతి ఏటా శీతాకాలం రాగానే తీవ్ర కాలుష్యంతో అల్లాడిపోయే దేశ రాజధాని దిల్లీ మాచ్కం ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 24న దిల్లీలో ఏక్యూఐ 176 (మోడరేట్)గా నమోదైంది. గత పదేళ్ల కాలంలో అక్టోబర్ 24వ తేదీన దిల్లీ ఇంత తక్కువ కాలుష్యంతో ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

ముంబైలో పెరిగిన ఆరోగ్య సమస్యలు.. కోర్టు సీరియస్

ముంబై నగరంలో దట్టమైన పొగమంచు, వ్యర్థాల పొగ అలుముకోవడంతో జనం విలవిలలాడుతున్నారు. స్థానికుల్లో తలనొప్పి, గొంతు మంట, కళ్ల కలకలు, శ్వాసకోశ ఇబ్బందులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని నిపుణులైన వైద్యులు అత్యవసర సూచనలు చేశారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన బాంబే హైకోర్టు కాలుష్య నియంత్రణపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. నగరంలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని స్పష్టం చేస్తూ కాలుష్య కారకాలపై ఉక్కుపాదం మోపాలని ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ), స్థానిక అధికారులను ఆదేశించింది. నిర్మాణ రంగం నుంచి వచ్చే విపరీతమైన దుమ్ము, చెత్తను బహిరంగంగా కాల్చడం, చుట్టుపక్కల జిల్లాల్లో పంట వ్యర్థాల దహనం, పండుగల బాణసంచా పొగ, మందగించిన గాలులు ముంబై వాతావరణాన్ని విషపూరితం చేశాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రతి ఏటా శీతాకాలం ఆరంభంలో దిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేది. అయితే ఈసారి దిల్లీ ప్రభుత్వం కాలుష్యంపై 'యుద్ధ ప్రాతిపదికన' చర్యలు చేపట్టింది!

రోడ్లను నిరంతరం యంత్రాల ద్వారా శుభ్రపరచడం, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం, కాలుష్య ముప్పు ఎక్కువగా ఉండే హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నీటిని నిరంతరం పిచికారీ చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కాలుష్య కారక ప్రాంతాలను త్వరితగతిన గుర్తించి చర్యలు తీసుకోవడం వల్ల దుమ్ము నిల్వలు అదుపులో ఉన్నాయని దిల్లీ పర్యావరణ శాఖ వెల్లడించింది. అయితే రాబోయే రోజుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దహనం పెరిగితే పరిస్థితి మారవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఢిల్లీ చూపిన బాటలో ముంబై వంటి తీరప్రాంత నగరాలు కూడా ఏడాది పొడవునా పక్కా కాలుష్య నియంత్రణ వ్యూహాలను అమలు చేయాలని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. నిర్మాణ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు, బహిరంగ చెత్త దహనంపై పూర్తి నిషేధం విధించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks