...
...
Next Story

Study in Canada : ఒకప్పుడు ఎగబడ్డారు- ఇప్పుడు అసలు ఆప్షన్​లోనే లేదు! భారతీయులు కెనడాకు ఎందుకు వెళ్లట్లేదు?

Indian students in Canada : ఒకప్పుడు భారతీయ విద్యార్థుల ఫేవరెట్ స్టడీ డెస్టినేషన్‌గా ఉన్న కెనడా క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది! కఠినమైన వీసా రూల్స్, పెరిగిన జీవన వ్యయాల కారణంగా 2026లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 64 శాతం క్షీణించింది.

Published on: Jul 5, 2026, 06:43:20 IST
Advertisement

ఉన్నత చదువులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, సులువుగా పీఆర్ (శాశ్వత నివాసం) వచ్చే అవకాశం.. ఇవే గత కొన్నేళ్లుగా భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కెనడా వైపు పరుగులు పెట్టించాయి. అయితే 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది! ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్​సీసీ)తో పాటు స్టాటిస్టిక్స్ కెనడా విడుదల చేసిన తాజా గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ విద్యార్థుల రాక ఏకంగా 64 శాతం మేర క్షీణించింది. నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు భారంగా మారడంతో భారత్​తో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఇప్పుడు కెనడాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.

విద్యార్థుల సంఖ్యపై కెనడా సర్కార్ కోత

కెనడాకు నో చెబుతున్న భారతీయులు! కారణం?
కెనడాకు నో చెబుతున్న భారతీయులు! కారణం?

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గడానికి కెనడా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం గట్టి ఆంక్షలు విధించింది. '2026-2028 ఇమ్మిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్' ప్రకారం.. 2026లో కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు కేవలం 1,55,000 స్టడీ పర్మిట్లు మాత్రమే ఇవ్వాలని ఐఆర్​సీసీ నిర్ణయించింది.

ఇది మునుపటి లక్ష్యాలతో పోలిస్తే దాదాపు సగానికి సగం తక్కువ. దేశంలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించి, 2027 నాటికి దేశ మొత్తం జనాభాలో వారి శాతాన్ని 5% లోపుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో విపరీతంగా పెరిగిన ఇళ్ల కొరత, ప్రజా సేవలు, మౌలిక సదుపాయాలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పెరిగిన ఖర్చులు.. ముగిసిన ఫాస్ట్ ట్రాక్ వీసా!

కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు విద్యార్థులు ట్యూషన్ ఫీజుతో పాటు తమ జీవన వ్యయం కోసం కనీసం 20,635 కెనేడియన్ డాలర్లను (సుమారు రూ. 13.5 లక్షలకు పైగా) తమ ఖాతాలో ఉన్నట్లు గ్యారెంటీ ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికేట్ (జీఐసీ) రూపంలో చూపించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్లపై ఆధారపడే మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది.

ఫలితంగా ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లు ఇవే:

  • భారీగా పెరిగిన ఫైనాన్షియల్ ప్రూఫ్ నిబంధనలు.
  • వీసా డాక్యుమెంట్లపై మునుపెన్నడూ లేనంత నిశిత పరిశీలన.
  • వీసా ప్రాసెసింగ్ సమయం బాగా పెరగడం.
  • వీసా అప్రూవల్ వస్తుందో లేదో తెలియని అనిశ్చితి.
  • డిప్లొమా కాలేజీలపై పీజీడబ్ల్యూపీ దెబ్బ

ఈ కొత్త నిబంధనల ప్రభావం అన్ని విద్యాసంస్థలపై ఒకేలా లేదు. ముఖ్యంగా పబ్లిక్ కాలేజీలలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు అత్యధికంగా పడిపోయిందని స్టాటిస్టిక్స్ కెనడా డేటా చెబుతోంది. చదువు పూర్తయిన తర్వాత ఇచ్చే 'పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్' (పీడీడబ్ల్యూపీ) నిబంధనలను కఠినతరం చేయడమే దీనికి కారణం.

ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే కోర్సులకు వర్క్ పర్మిట్లు ఇవ్వకూడదని కెనడా నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో కార్మికుల కొరత ఉన్న రంగాలకు సంబంధించిన కోర్సులు చదివే విద్యార్థులకే పీఆర్, వర్క్ పర్మిట్లలో ప్రాధాన్యత లభిస్తోంది. ఆ రంగాలు ఇవే:

హెల్త్‌కేర్ (వైద్య రంగం)

స్కిల్డ్ ట్రేడ్స్ (నైపుణ్య వృత్తులు)

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ కోర్సులు)

అయితే పబ్లిక్ యూనివర్సిటీల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఉండటంతో విశ్వవిద్యాలయాలపై దీని ప్రభావం కొంత తక్కువగానే ఉంది.

ఉద్యోగాలు, ఇళ్ల కొరత: విద్యార్థుల చూపు ఎటువైపు?

ప్రభుత్వ నిబంధనలు ఒకవైపైతే, కెనడాలో ఇప్పటికే నివసిస్తున్న విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న క్షేత్రస్థాయి పరిస్థితులు కొత్తగా వెళ్లాలనుకునే వారిని భయపెడుతున్నాయి. ప్రధాన నగరాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరకడం గగనంగా మారిందని, ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న చిన్న రెస్టారెంట్లలో పార్ట్​ టైమ్ ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ కనిపిస్తున్న వీడియోలు వైరల్​ అవుతున్నాయి.

ఇక కష్టపడి చదివినా భవిష్యత్తులో పీఆర్ వస్తుందనే నమ్మకం లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం వృధా అని విద్యార్థులు భావిస్తున్నారు. ఫలితంగా భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెనడాను వదిలి జర్మనీ, ఐర్లాండ్, అమెరికా వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడ మెరుగైన అవకాశాలు, స్థిరపడేందుకు స్పష్టమైన మార్గాలు కనిపిస్తుండటంతో గమ్యస్థానాలను మార్చుకుంటున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe