...
...
Next Story

BRSని బతికించుకునేందుకు మీళ్లీ నీళ్ల సెంటి మెంట్‌ను వాడుకుంటున్నారు - కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్

సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులపై నాడు కేసీఆర్ చేసిన సంతకంతో తెలంగాణ గొంతుకోసినట్లు అయిందని ఆరోపించారు.

Published on: Jan 01, 2026 10:04 PM IST
Advertisement

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్‌గా మారిందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యయాన్ని రూ.30,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు పెంచారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ నీటి సమస్యలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఏపీ ప్రభుత్వానికి మౌనంగా సహకరిస్తున్నాననే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి మేడిగడ్డకు తరలించడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు కేసీఆర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను(డీపీఆర్) కూడా తయారు చేయలేదని ఆరోపించారు.

“రాజకీయ లబ్దికోసం మేము పక్క రాష్ట్రాన్ని తిట్టడం లేదు. జరిగిన అన్యాయంను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని లెక్కలు తీశారు. తెలంగాణకు 34 శాతం చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్‌, హరీష్ రావు సంతకం చేశారు. కేసీఆర్ సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వతంగా గొంతుకోశారు. ఏపీకి అడ్వాంకేటేజీగా మారింది. ఓపిక లేని మనిషి చేసిన తప్పు అది” అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్.. మళ్లీ నీళ్ల సెంటి మెంట్‌ను వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వారి గౌరవానికి ఎలాంటి భంగం కలిగించామని… సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాము పొరపాట్లు చేస్తే సరిదిద్దొచ్చని చెప్పారు. జానారెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో లేఖలు రాశారని.. కనీసం మీరు(కేసీఆర్) ఆ పనైనా చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.

సీఎం వ్యాఖ్యలపై హరీశ్ ఆగ్రహం:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.

“బేసిన్ల పై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైంది. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారిని కసబ్ తో పోల్చుతావా? నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం. కేసీఆర్ గారిని, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా..?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతది. కేసీఆర్ గారు 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారు..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

“సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున: పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామి మేరకు కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా? ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు? తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున: పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్. ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే” అని హరీశ్ రావు చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe