ఉద్యోగులు రోజుకూ ఒక గంట ఎక్కువగా పనిచేయండి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ప్రభుత్వ ఇమేజీని పెంచడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  రోజుకూ ఒక గంట ఎక్కువగా పనిచేయాలని… మార్పు తీసుకొచ్చే దిశగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.

Published on: Jun 26, 2026, 10:07:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Govt Employees Insurance : ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు గాను…. రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న 16 ప్రముఖ బ్యాంకులతో ప్రభుత్వం అధికారికంగా అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఉద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఉద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంటేనే ఒక నమ్మకమన్నారు. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడమంటే సంపూర్ణమైన భద్రత అనే భావనను తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఆ బాధ్యత ప్రభుత్వానిదే - సీఎం రేవంత్

“సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ.. ఏదైనా అందరికీ ప్రభుత్వమే యజమాని. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా భద్రత కలిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అడగకపోయినా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అని అన్నారు.

“ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడమంటే సంపూర్ణమైన భద్రత. సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా కల్పించేందుకు ఉపముఖ్యమంత్రి ప్రతిపాదించినప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ సాధ్యమని నిరూపించారు. ఏ సంస్థ కోసమైతే రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్న కార్మికుడు ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి రూపాయల సహాయం అందించడానికి అండగా నిలబడినప్పుడు ఆ కుటుంబం సమాజంలో తలెత్తుకుని నిలబడగలుగుతుంది. మన పట్ల సానుభూతి, సానుకూలత చూపించేవాళ్లు ఉండొచ్చు. కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్లు చాలా అరుదు. అందుకే యజమానియే ఆ బాధ్యత తీసుకోవాలి” అని సీఎం వ్యాఖ్యానించారు.

సింగరేణిలో సాధ్యమైనప్పుడు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడం ఎందుకు సాధ్యం కాదన్నారు. అందుకే అడక్కపోయినా ప్రభుత్వం బాధ్యతతో ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులను ఆహ్వానించి ఉద్యోగుల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు.

“పదేళ్లలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి అనేక సమస్యలను సృష్టించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత విడతల వారిగా జీతాలు ఇవ్వడం కుదరదని చెప్పి మొదటి తారీఖునే చెల్లిస్తున్నాం. 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలు పెంచడం వల్ల రిటైర్మెంట్లన్నీ 2024 నుంచి మొదలయ్యాయి. ప్రతి నెలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేరుకుపోయాయి. అయినా ఉద్యోగులను చిన్నచూపు చూడలే. అన్ని ప్రయత్నాలు చేస్తూ నెలకు రూ. 200 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మేరకు బెనిఫిట్స్ కోసం చెల్లించాం” అని గుర్తు చేశారు.

“వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని చెప్పాం. మొదటి విడతగా రూ. 1000 కోట్లు చెల్లించాం. చెప్పిన మాట ప్రకారం విడతల వారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులను విడుదల చేస్తున్నాం. పీఆర్సీ విషయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుదాం. రోజులో ఒక గంట అదనంగా పనిచేద్దాం. పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగులదే. ఆదాయాన్ని పెంచాలి. ఆ ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకే ఉపయోగిస్తాం” అని తెలిపారు.

ప్రభుత్వ ఇమేజీని పెంచడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో నిలబడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్న ఆయన… తద్వారా కూడా అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడిందని చెప్పుకొచ్చారు.

మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి ఎంతో అవసరం. గత పదేళ్లలో ఈ పనులు చేయాలని కొట్లాడినం. ఇప్పుడు మేం చేస్తామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సాధన కోసం సర్వం కోల్పోయిన వారిని గుర్తించి గౌరవించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం గడిచిన 30 నెలలు ప్రతిరోజూ 16 నుంచి 18 గంటల పనిచేశా. ఇప్పుడు ప్రణాళికలు ఒక్కొక్కటిగా కొలిక్కి వచ్చాయి. మెట్రో, మూసీ, భారత్ ఫ్యూచర్ సిటీ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ.. ఇలా సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం” అని సీఎం వివరించారు.

గంట ఎక్కువ పని చేయండి - సీఎం

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుతుంది. రోజుకు ఒక గంట ఎక్కువగా పనిచేయండి. మార్పు తీసుకొద్దాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. అందుకు మీ అందరి సహకారం కావాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More