Telangana MLC Elections 2026 : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండు కీలక పట్టభద్రుల స్థానాలకు పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ అభ్యర్థుల ఎంపికకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది ఆమోదం తెలిపారు.
అభ్యర్థులు వీరే…
- మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం: ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు.
- నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం: విద్యార్థులు, యువత, నిరుద్యోగుల పోరాటాలకు కీలక కేంద్రమైన ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఢిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధితో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కవర్ చేసే ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లే గెలుపోటములను శాసించే అవకాశం ఉండటంత…., బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో ఓడిపోయిన కాంగ్రెస్… ఈసారి మాత్రం విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ స్థానాల్లో గెలవటం ద్వారా శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవటమే కాకుండా… ప్రతిపక్షాలకు బలమైన సందేశాన్ని పంపాలనుకుంటోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం…. ప్రచార ప్రణాళికలను కూడా త్వరలోనే సిద్ధం చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.