Messi GOAT Tour : ఇవాళ హైదరాబాద్ కు మెస్సీ - ఉప్పల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు, మ్యాచ్ టైమింగ్స్ ఇలా
ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా పుట్ బాల్ స్టార్ మెస్సీ మ్యాచ్ జరగనుంది. లియోనెల్ మెస్సీ రాత్రి 7:00-7.30 గంటలకు స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తాడు. సాయంత్రం 5.30 గంటల నుంచి సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో పాల్గొంటాడు.ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. క్రీడా వినోదంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.

షెడ్యూల్ వివరాలు ఇలా….
ఈవెంట్ నిర్వాహకుడు అనుత్తమ్ రెడ్డి…. మెస్సీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. “లియోనెల్ మెస్సీ రాత్రి 7:00-7.30 గంటల మధ్యలో స్టేడియంలో ఉంటాడని భావిస్తున్నాం. సాయంత్రం 5.30 గంటల నుంచే సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందరికీ ఎంటర్ టైన్ మెంట్ పుష్కలంగా ఉంటుంది. మెస్సీ మాతో కలిసి సుమారు 1 గంట పాటు గ్రౌండ్ లో ఉంటాడు. చాలా ఈవెంట్స్ ఉంటాయి. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా… ఆయన చిన్నారులతో కలిసి మమేకమవుతారు” అని తెలిపారు.
సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రధానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్‌నుమాకు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు.
భారీగా ఏర్పాట్లు…
మరోవైపు రాచకొండ పోలీసులు ఈ ఈవెంట్ కోసం భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. టికెట్లు, గేట్ పాసులు ఉంటేనే అనుమతి ఇస్తా మని స్పష్టం చేశారు. పాసులు ఉన్న వారు మాత్రమే ఇక్కడికి రావాలని స్పష్టం చేశారు.
'హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ జరగబోతోంది. ఒక ఆట 15-20 నిమిషాలు ఆడతారు.. ఈ కార్యక్రమం కోసం… సరైన భద్రతా ఏర్పాట్లు చేసాము "అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.
ప్రేక్షకులు ప్రజా రవాణాను ఎంచుకోవాలని సీపీ కోరారు, “స్టేడియానికి. చేరుకోవడానికి ప్రజా రవాణాను ఉపయోగించమని మేము ఇప్పటికే ప్రజలను కోరాము టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు కాబట్టి… స్టేడియంలో టిక్కెట్లు అమ్మబడవు. పాసులు లేకపోతే స్టేడియానికి రావొద్దు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి” అని సీపీ వివరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు…
ఉప్పల్‌లో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు , దారి మళ్లింపులు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఈవెంట్ కోసం మొత్తం 10 ప్రధాన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. వీటిలో తొమ్మిది మ్యాచ్ చూడటానికి వచ్చే వారికి కేటాయించారు. స్టేడియం నుండి కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి.
మరోవైపు మ్యాచ్ జరగబోయే ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వెలుపల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీల పోస్టర్లు పెట్టారు.
ఇక ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు నాలుగు ప్రధాన భారతీయ నగరాలైన కోల్ కతా, హైదరాబాద్, ముంబై మరియు న్యూఢిల్లీలో జరిగే ఈవెంట్లలో పాల్గొంటారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ను సందర్శించడానికి మెస్సీ సిద్ధమయ్యాడు.
మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బయలుదేరే ముందు మెస్సీ అనేక సమావేశాలకు హాజరవుతారు. కోల్కతాలో పర్యటనలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో మెస్సీ భేటీ కానున్నారు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మెస్సీ 7v7 ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ మ్యాచ్ ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. మెస్సీ ఆటను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.














