...
...
Next Story

Telangana Smart Ration Card : స్మార్ట్ రేషన్ కార్డులు ముందుగా ఎవరికి వస్తాయి..? ఎవరి ఫొటో ఉంటుంది..?

Telangana Smart Ration Card : రాష్ట్రంలో కొత్తగా 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న కుటుంబాలకే ఈ కార్డులు ముందుగా అందనున్నాయి.

Published on: Aug 7, 2026, 14:47:18 IST
Advertisement

Telangana Smart Ration Cards : అర్హులైన పేదలందరికీ ప్రతిష్టాత్మకంగా కొత్త ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సరికొత్తగా రూపొందించిన సుమారు 1.05 కోట్ల లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఈనెల 15వ తేదీ నుంచి ఈ ప్రక్రియను సీఎం రేవంత్ అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆర్డీవో పర్యవేక్షణలో…. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అత్యంత పారదర్శకంగా….. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా నేరుగా లబ్ధిదారులకు కార్డులు చేరేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే కార్డు..!

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందడానికి ఈకేవైసీ ప్రక్రియ అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ పూర్తి చేసి ఉంటేనే వారికి కొత్త కార్డు అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోని వారికి కార్డుల పంపిణీలో ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

అలాంటి వారు వెంటనే తమ పరిధిలోని రేషన్ డీలర్లు లేదా సంబంధిత అధికారులను కలిసి ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచిస్తోంది. ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నవారికి మాత్రమే కొత్త ల్యామినేటెడ్ కార్డులు వేగంగా పంపిణీ కానున్నాయి.

మహిళ పేరు మీదనే స్మార్ట్ రేషన్ కార్డు….

ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు డీలర్ ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం డిస్ ప్లే అవుతుంది.

కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు…? గతంలో ఏయే నెలల్లో బియ్యం, గోధుమలు, చక్కెర ఎంత పరిమాణంలో తీసుకున్నారు..? అనే పూర్తి సమాచారం డిజిటల్‌గా కనిపిస్తుంది. కార్డుదారుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వేలిముద్ర వేసి అత్యంత సులభంగా రేషన్ సరుకులను పొందే వీలు కలుగుతుంది.

ఈ-కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి….?

రేషన్ లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లొచ్చు. అక్కడ ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేయడం ద్వారా లేదా ఐరిస్ స్కాన్ విధానం ద్వారా తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేసేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి వెళ్లే సమయంలో లబ్ధిదారులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, కార్డులో పేరు ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులోని వివరాలతో ఈ-పోస్ యంత్రంలోని డేటాను అనుసంధానించి ఈ-కేవైసీని నిర్ధారిస్తారు. కాబట్టి ఈనెల 31వ తేదీ ముగిసేలోపే రేషన్ కార్డుదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks