Kriti Sanon: హీరో అడిగితే శ్రద్ధ, హీరోయిన్ అడిగితే తలపోటు.. కృతి సనన్ కామెంట్స్.. అవమానించకండి ప్లీజ్ అంటూ!

Kriti Sanon On Facing Discrimination: సినిమా పరిశ్రమలో ఉన్న లింగ వివక్ష (Gender Bias)పై నేషనల్ అవార్డ్ విన్నర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెట్స్‌లో హీరోలకు, హీరోయిన్లకు ఇచ్చే మర్యాదల్లో చాలా తేడాలు ఉంటాయని, మహిళా నటీమణులను చాలా తేలికగా తీసుకుంటారని కృతి అన్నారు.

Published on: Jul 4, 2026, 13:44:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kriti Sanon On Facing Discrimination: సినిమా గ్లామర్ ప్రపంచం పైకి కనిపించే అంత అందంగా ఉండదు. ఇక్కడ రంగుల వెనుక ఎన్నో వివక్షలు, అసమానతలు దాగుంటాయి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా వెండితెరపై నటీమణులకు ప్రాధాన్యత పెరుగుతున్నా, తెర వెనుక మాత్రం ఇంకా పురుషాధిక్యత నడుస్తోందనేది పచ్చి నిజం అంటారు కొంతమంది హీరోయిన్లు.

హీరో అడిగితే శ్రద్ధ, హీరోయిన్ అడిగితే తలపోటు.. కృతి సనన్ కామెంట్స్.. అవమానించకండి ప్లీజ్ అంటూ!
హీరో అడిగితే శ్రద్ధ, హీరోయిన్ అడిగితే తలపోటు.. కృతి సనన్ కామెంట్స్.. అవమానించకండి ప్లీజ్ అంటూ!

యూట్యూబర్ లిల్లీ సింగ్ టాక్ షో

తాజాగా ఇదే విషయంపై కృతి సనన్ ఓపెన్ అయ్యారు. ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ టాక్ షోలో పాల్గొన్న కృతి సనన్ షూటింగ్ సెట్స్‌లో మహిళా నటీమణులు, హీరోయిన్లు ఎదుర్కొనే వివక్షను ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చారు.

కృతి సనన్ మోడలింగ్ రంగం నుంచి వచ్చి, ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తానొచ్చిన అన్ని రంగాల కంటే బాలీవుడ్‌లోనే భరించలేనంత ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నానని కృతి సనన్ చెప్పారు.

కెరీర్ ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలకే, హీరోల పక్కన కేవలం రొమాన్స్ సీన్లకే పరిమితం చేసేవారని గుర్తుచేసుకున్నారు కృతి. ఇప్పుడు కథల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత లభిస్తున్నా, సెట్స్‌లో చూపే వివక్ష రూపం మారిందే తప్ప పూర్తిగా పోలేదన్నారు.

ప్రశ్న అడిగితే తలపోటుగా చూస్తారు!

షూటింగ్ సమయంలో నటీనటులు తమ పాత్రల గురించి దర్శకులను, సాంకేతిక నిపుణులను ప్రశ్నలు అడగడం సహజం. కానీ, అక్కడే అసలు వివక్ష మొదలవుతుందని కృతి సనన్ పేర్కొన్నారు. ఒకే రకమైన ప్రశ్నకు హీరోలకు, హీరోయిన్లకు దక్కే సమాధానాల్లో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందని వివరించారు.

"ఒక హీరోయిన్ ప్రశ్నలు అడిగితే.. 'ఈమె ఏంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతోంది, ఇప్పుడే యాభై ప్రశ్నలు మొదలుపెడుతుంది' అన్నట్లు వెనకాల మాట్లాడుకుంటారు. అదే ఒక స్టార్ హీరో ప్రశ్నలు అడిగితే మాత్రం.. సినిమాపై అతనికి చాలా శ్రద్ధ ఉందని, ఇన్వాల్వ్ అవుతున్నాడని మెచ్చుకుంటారు. ఇది నా విషయంలో స్వయంగా జరిగింది. నేను ఏదైనా డౌట్ అడిగితే ఎక్కువగా ఓవర్ ఎనలైజ్ చేయకు అని అనేవారు. అదే ఒక హీరో అడిగితే వెంటనే సరే అలానే చేద్దాం అనేవారు" అని కృతి సనన్ తన ఆవేదనను పంచుకున్నారు.

చిన్న రూములు, చిన్న కార్లు..

సినిమా సెట్స్‌లో క్యారవాన్లు, రూములు, కార్ల కేటాయింపుల్లోనూ వ్యత్యాసాలు చూపిస్తారని కృతి సనన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హీరోలకు లగ్జరీ వసతులు కల్పించి, హీరోయిన్లకు తక్కువ స్థాయి వసతులు కల్పిస్తారని చెప్పారు. తనకు భౌతిక సుఖాలు ముఖ్యం కాదని, కానీ ఆ వ్యత్యాసం వల్ల కలిగే అవమానం బాధ కలిగిస్తుందన్నారు. తనకు చిన్న రూమ్ ఇచ్చినా ఇబ్బంది లేదని, కానీ తమను తక్కువ చేసి చూడవద్దని కృతి సనన్ కోరారు.

అసిస్టెంట్ డైరెక్టర్లకు భయం

కేవలం వసతుల పరంగానే కాకుండా, సెట్స్‌లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ల (ADs) ప్రవర్తనలోనూ ఈ తేడా కనిపిస్తుందని కృతి స్పష్టం చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు సెట్స్‌పైకి హీరోయిన్లను అందరికంటే ముందే పిలిచే అలవాటు ఉంటుందని చెప్పారు. వాళ్లు హీరోలను చూసి భయపడతారని, కానీ హీరోయిన్లను మాత్రం చాలా తేలికగా (Taken for granted) తీసుకుంటారని కృతి సనన్ పేర్కొన్నారు.

కాగా, కృతి సనన్ ఇటీవలే 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

కృతి సినిమాకు రూ. 137 కలెక్షన్స్

మిశ్రమ స్పందన తెచ్చుకున్న కాక్‌టెయిల్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 137 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం కృతి సనన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా కృతి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More