...
...
Next Story

Ramayana Loss Collection: రామాయణం పార్ట్ 1 సినిమాకు నష్టాలు.. 1790 కోట్ల కలెక్షన్లపై నిర్మాత నమిత్ మల్హోత్రా కామెంట్స్

Namit Malhotra About Ramayana Part 1 Loss Or Profit: రామాయణ: పార్ట్ 1 రూ.1,790 కోట్లు వసూలు చేసినప్పటికీ నష్టాలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్ట్-2 విడుదలకు సంబంధించిన ఆసక్తికర వివరాలను కూడా ఆయన వెల్లడించారు.

Published on: Nov 29, 2026, 06:00:51 IST
Advertisement

Namit Malhotra About Ramayana Part 1 Loss Or Profit: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

రామాయణం గ్రాస్ కలెక్షన్స్

రామాయణం పార్ట్ 1 సినిమాకు నష్టాలు.. 1790 కోట్ల కలెక్షన్లపై నిర్మాత నమిత్ మల్హోత్రా కామెంట్స్
రామాయణం పార్ట్ 1 సినిమాకు నష్టాలు.. 1790 కోట్ల కలెక్షన్లపై నిర్మాత నమిత్ మల్హోత్రా కామెంట్స్

ఇప్పటివరకు రామాయణం ప్రపంచవ్యాప్తంగా రూ.1,790 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే రెండు భాగాలకు కలిపి దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్ పెట్టారని, దీంతో మొదటి భాగం నిర్మాతలకు నష్టాలను మిగిల్చిందంటూ సోషల్ మీడియాతో పాటు ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా స్పందించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు.

బడ్జెట్, బాక్సాఫీస్ లెక్కలపై నిర్మాత స్పందన

భారీ పెట్టుబడి పెట్టినందువల్ల ‘రామాయణం’ నష్టాలను చవిచూసిందన్న వాదనలపై డీడీ న్యూస్ ఇంటర్వ్యూలో నమిత్ మల్హోత్రా పూర్తి స్పష్టత ఇచ్చారు. సినిమాకు ప్రేక్షకులు ఇప్పటికే వందకు వంద మార్కులు వేశారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

"ప్రేక్షకుల నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభిస్తోంది. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని, రెండో భాగాన్ని త్వరగా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. 2028 దీపావళికి పార్ట్-2ను తీసుకురావాలని ప్రణాళిక వేస్తున్నాం. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత భారీ స్థాయిలో ఉంటుంది. పార్ట్-1 మార్కెటింగ్ కోసం ఎక్కువ బడ్జెట్ అవసరమైంది, కానీ పార్ట్-2లో సినిమా నిర్మాణానికే ఎక్కువ ఖర్చు అవుతుంది" అని నమిత్ మల్హోత్రా వివరించారు.

రామాయణం సినిమా వ్యాపార లెక్కల గురించి అవగాహన లేకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని నమిత్ మల్హోత్రా మండిపడ్డారు. తన సంస్థ 'ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్‌లో నమోదై ఉందని, రూ.20-25 కోట్ల విలువతో మొదలైన తమ ప్రయాణంలో మూడు దశాబ్దాల అనుభవంతో పాటు 11,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని గుర్తుచేశారు.

అసలు సినిమా వ్యాపార లావాదేవీల గురించి చిత్రంలోని నటీనటులకు గానీ, దర్శకుడికి గానీ పూర్తి వివరాలు తెలియవని, అలాంటప్పుడు బయటి విమర్శకులకు ఎలా తెలుస్తాయని రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా సూటిగా ప్రశ్నించారు.

‘రామాయణ’ విశేషాలు, పార్ట్-2 అప్‌డేట్

కాగా నితేష్ తివారీ దర్శకత్వం వహించిన రామాయణం చిత్రానికి శ్రీధర్ రాఘవన్ సహ రచయితగా పనిచేశారు. రావణుడిగా కన్నడ స్టార్ యశ్, లక్ష్మణుడిగా రవి దూబే నటించగా, కాజల్ అగర్వాల్, లారా దత్తా, శోభన, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, అరుణ్ గోవిల్, ఆదినాథ్ కొఠారే ఇతర కీలక పాత్రల్లో మెరిశారు.

జటాయువు పాత్రకు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ డబ్బింగ్ అందించారు. విడుదలైన తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తిరుగులేని వసూళ్లను రాబట్టింది. తొలుత 2027లో విడుదల చేయాలనుకున్న రెండో భాగాన్ని, అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కోసం 2028 దీపావళికి వాయిదా వేశారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks