Prakash Raj RGV Nagababu: అతనికి రాజుగా పట్టాభిషేకం చేయలేదు- నాగబాబు, ప్రకాష్ రాజ్ వివాదంలో దూరిన రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma On Prakash Raj Vs Nagababu War: జనసేన నేత నాగబాబు, పాపులర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య నడుస్తున్న సోషల్ మీడియా యుద్ధంలోకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరారు. నాయకుడిని ప్రశ్నించే హక్కుపై ఆర్జీవీ చేసిన తాజా ట్వీట్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
Ram Gopal Varma On Prakash Raj Vs Nagababu War: ఏపీ రాజకీయాల్లో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా జరిగే యుద్ధాలకు కొదవలేదు. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మొదలైన సిద్ధాంతాల పోరు సరికొత్త మలుపు తిరిగింది. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న సవాళ్లు, ప్రతిసవాళ్లలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఎంట్రీ ఇచ్చారు.

మెగా బ్రదర్‌కు కౌంటర్
ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్య బాణాలు విసిరే ఆర్జీవీ, ఈసారి ప్రజాస్వామ్య సూత్రాలను తెరపైకి తెస్తూ మెగా బ్రదర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా టాలీవుడ్ పరిధిని దాటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వివాదానికి కారణమైన నాగబాబు ట్వీట్
కొద్దిరోజుల క్రితం నాగబాబు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి బీజం వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోను జత చేస్తూ.. "నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే బాగా తెలుసు. అనుమానాలను పక్కనపెట్టి, ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని గుడ్డిగా అనుసరించాలి" అనే అర్థం వచ్చేలా నాగబాబు వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో, సొంత పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు నాగబాబు ఈ పోస్ట్ పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ 'గుడ్డి భక్తి' సిద్ధాంతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
మేము గొర్రెలం కాదు: ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్
నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ వెంటనే స్పందించారు. సామాజిక అంశాలపై నిలదీసే ప్రకాష్ రాజ్, మెగా బ్రదర్ నాగబాబు పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఏ నాయకుడైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే" అని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలోనూ మెగా కుటుంబంతో పలుమార్లు విభేదించిన ప్రకాష్ రాజ్, ఈసారి నేరుగా ప్రజాస్వామ్య హక్కులను ప్రస్తావించడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకుంటున్నారు.
ఈ ఇద్దరి రచ్చ ముదురుతున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో రంగంలోకి దిగారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తూ నాగబాబుకు చురకలు అంటించారు.
పట్టాభిషేకం చేయలేదు.. ఆర్జీవీ పంచ్
"ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే నాయకుడికి ఓట్లేసి ఒక బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అంతేకాని అతనిని రాజుగా పట్టాభిషేకం చేయరు" అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. నాయకులను దేవుళ్లుగానో, రాజులుగానో భావించే సంస్కృతిపై ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గతంలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వరుస సినిమాలు, ట్వీట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ, కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు నాగబాబు-ప్రకాశ్ రాజ్ వివాదం కారణంగా మెగా క్యాంప్‌పై ఆర్జీవీ పరోక్షంగా విమర్శలు గుప్పించడం గమనార్హం. ఈ ముక్కోణపు సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


