...
...
Next Story

Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ- వరాలిచ్చే దేవకన్యలు- అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?

Ramba Oorvasi Menaka Review And Rating In Telugu: అల్లరి నరేష్ హీరోగా నలుగురు హీరోయిన్లతో తెరకెక్కిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ కామెడీ మూవీ రంభ ఊర్వశి మేనక. చంద్ర మోహన్ చింతడ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి రంభ ఊర్వశి మేనక రివ్యూలో చూద్దాం.

Published on: Sep 4, 2026, 18:27:20 IST
Advertisement

Ramba Oorvasi Menaka Review And Rating In Telugu: నటులకు వరుస ప్లాపులు ఎదురైనప్పుడు లేదా విభిన్న ప్రయోగాలు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కానప్పుడు మళ్లీ తమ పాత సేఫ్ జోన్‌లోకి వెళ్లడం పరిశ్రమలో సహజమే.

సీరియస్ రోల్స్ తర్వాత

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ- వరాలిచ్చే దేవకన్యలు- అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?
రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ- వరాలిచ్చే దేవకన్యలు- అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?

'నాంది', 'ఉగ్రం' వంటి తీవ్రమైన సీరియస్ సినిమాల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ తనకు బలమైన అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి అడుగుపెట్టారు. 90ల నాటి బ్లాక్‌బస్టర్ 'యమలీల' ఫార్ములాను ఆధునిక కాలానికి తగినట్లు మార్చి రూపుదిద్దిన సోషియో ఫాంటసీ కామెడీ చిత్రమే 'రంభ ఊర్వశి మేనక'.

ఈ సినిమాకు చంద్ర మోహన్ చింతడ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అల్లరి నరేష్‌కు జోడీగా హీరోయిన్ సురభి యాక్ట్ చేసింది. మరో ముగ్గురు ముద్దుగుమ్మలు రాశి సింగ్, యాంకర్ విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఇవాళ (సెప్టెంబర్ 4) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి రంభ ఊర్వశి మేనక రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేష్) నటుడు కావాలని తపించే ఒక సాధారణ యువకుడు. తరతరాలుగా వారి కుటుంబం రంభ ఊర్వశి మేనక డ్రామా కంపెనీ నిర్వహిస్తుంటుంది. అలాగే, వారి దగ్గర ఒక ప్రాచీన గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంపై సరిగ్గా ముగ్గు వేస్తే స్వర్గం నుంచి రంభ ఊర్వశి మేనకలు దిగి వచ్చి కోరిన కోరికలన్ని నెరవేరుస్తారని నమ్మకం.

ఆ మ్యాజిక్ బుక్ పేరు చెప్పి ఊళ్లో బాగా అప్పులు చేస్తాడు. అవన్నీ మెడకు చుట్టుకుంటాయి. మరోవైపు తల్లి మంచాన పడి లక్షల్లో డబ్బు అవసరం ఏర్పడుతుంది. ఈ కష్టాలన్నీ గట్టెక్కడానికి ప్రాచీన గ్రంథంపై ముగ్గు వేస్తాడు సూరి. దాంతో ఆ గ్రంథం తెరుచుకుని పైనుంచి రంభ ఊర్వశి మేనకలు దిగి వస్తారు.

ట్విస్టులు

కథ పరంగా చూస్తే దేవకన్యలు భూలోకం వచ్చి కోరికలు తీర్చడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు రంభ ఊర్వశి మేనకలపై ఇలా ఫుల్ లెంత్ కథ ఎప్పుడు రాలేదు. ఇది పక్కన పెడితే సినిమా రెగ్యులర్ కామెడీ సినిమాలానే సాగిపోతుంది.

కానీ, చిత్రంలో దేవలోకానికి సంబంధించిన సన్నివేశాలను నేటి ట్రెండ్‌కు తగ్గట్టు సరదాగా డిజైన్ చేశారు. ఇంద్రుడిగా నటించిన వెన్నెల కిషోర్, నారదుడు మొబైల్ ఫోన్లలో మాట్లాడుకోవడం, హాలీవుడ్ సూపర్ హీరోల గురించి చర్చించుకోవడం నవ్వులు పూయిస్తాయి.

సుకుమార్‌లా కాదు

గ్రామంలో ఒక పోలీసు అధికారి కేసును అనవసరంగా క్లిష్టంగా చేస్తున్నప్పుడు "సుకుమార్ తరహాలో తీవ్రంగా ఆలోచించకుండా, అనిల్ రావిపూడి లాగా కాస్త సింపుల్‌గా ఆలోచించు" అని ఇంద్రుడు చమత్కరించడం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.

బిగ్ బాస్ జోకులు, భూమిపై అప్సరసలు పులావ్ కావాలని అడగడం, ఆసుపత్రి ఖర్చుల కోసం స్టేజ్ డ్యాన్స్ చేయడం వంటి సీన్లు అవుట్ అండ్ అవుట్ అల్లరి నరేష్ మార్క్ కామెడీని గుర్తుచేస్తాయి. ఫస్టాఫ్‌లో సూరి పరిచయం, డ్రీమ్, కుటుంబ నేపథ్యంతో పాత్రల పరిచయంలోకి వెళ్తారు.

ఆ తర్వాత సూరి కష్టాలు మెడపైకి రావడం, రంభ ఊర్వశి మేనకలు స్వర్గం నుంచి దిగి రావడంతో కథలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ముగ్గురు దేవకన్యలకు ఇంద్రుడు విధించిన షరతు, దానివల్ల సూరికి వచ్చే కొత్త కష్టాలు బాగున్నాయి. కొంతవరకు ఊహించినట్లే కథ సాగుతుంటుంది.

ఇద్దరు నరేష్‌ల పోటా పోటీ కామెడీ

అల్లరి నరేష్ తన పాత ఎనర్జీతో తన మార్క్ టైమింగ్‌తో బాగా నవ్వించాడు. అతనికిపోటీగా సీనియర్ నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన, తన టైమింగ్‌తో సన్నివేశాలను నిలబెట్టారు. ఇద్దరు నరేష్‌లు పోటాపోటీ పడి కామెడీ పండించారు.

శ్రీనివాస్ రెడ్డి వీకే నరేష్‌కు తోడుగా మంచి వినోదాన్ని పంచారు. ప్రథమార్ధంలో వచ్చే ఒక మోనోలాగ్, ద్వితీయార్థంలో పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశాలు బాగా పేలాయి. అయితే, పాతకాలపు మూస ధోరణిలో సాగే కామెడీ ట్రాక్‌లు నేటి ప్రేక్షకుల అభిరుచికి పూర్తిగా తగినట్లు లేవు.

హీరోయిన్ సురభితో ప్రేమకథ పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. దేవకన్యల్లా రాశి, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ చాలా గ్లామరస్ గా కనిపించారు. నటనతో కూడా పర్వాలేదనిపించారు. ముగింపులో వచ్చే సెంటిమెంట్ డ్రామా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సన్నివేశాల వేగానికి తగ్గట్టు ఉన్నా, థియేటర్ బయటకు వచ్చాక గుర్తుండే స్థాయిలో పాటలు లేవు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

పాతకాలపు సోషియో ఫాంటసీ ఫార్ములాను ఆధునిక మీమ్ కల్చర్‌తో కలిపి చెప్పే ప్రయత్నం చేశారు దర్శకనిర్మాతలు. అక్కడక్కడా గట్టిగా నవ్వించే సీన్లతో పాత మార్క్ కామెడీని ఇష్టపడేవారు రంభ ఊర్వశి మేనక సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe