జ్ఞాపకశక్తి మందగిస్తోందా? మీ మెదడు పదునుగా, వేగంగా పనిచేయాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..
మన దైనందిన ఆహారం కేవలం శరీరానికి శక్తినివ్వడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, ఆలోచనా విధానాన్ని వేగవంతం చేసే 5 ప్రత్యేక ఆహారాలను ప్రముఖ వైద్యులు డాక్టర్ సౌరభ్ సేథీ సూచించారు.
ఉదయం లేవగానే చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? రోజంతా ఏదో తెలియనంత అలసట, మైండ్ బ్లాక్ అయినట్లు అనిపిస్తోందా? అయితే మీ ఆహార అలవాట్లను ఒక్కసారి గమనించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం తినే తిండి కేవలం కడుపు నింపడానికే కాదు, మన ఆలోచనా శక్తిని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.

క్షణాల్లో మెదడును కంప్యూటర్‌లా మార్చే ఆహారాలేవీ లేవు కానీ, సరైన పోషకాలున్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ తెలిపిన వివరాల ప్రకారం.. మెదడును వేగంగా, పదునుగా ఉంచేందుకు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 అద్భుతమైన ఆహార పదార్థాల వివరాలు ఇక్కడ చూద్దాము.
1. వాల్‌నట్స్ : మెదడు రూపురేఖల వెనుక దాగి ఉన్న శక్తి
చూడటానికి సరిగ్గా మానవ మెదడు ఆకారంలోనే ఉండే వాల్‌నట్స్, మెదడు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మెదడు న్యూరాన్లను ఆక్సిడేటివ్ ఒత్తిడి, వాపుల నుంచి కాపాడతాయి. రోజూ గుప్పెడు వాల్‌నట్స్ తింటే జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, క్రొత్త విషయాలను వేగంగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
2. గుడ్లు : న్యూరోట్రాన్స్‌మిటర్ల పెంపకానికి ఇంధనం
గుడ్లలో కేవలం ప్రొటీన్ మాత్రమే కాకుండా ‘కోలిన్’ అనే అత్యంత ముఖ్యమైన పోషకం ఉంటుంది. "మన జ్ఞాపకశక్తి, అభ్యాస ప్రక్రియ, కణాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగపడే 'ఎసిటైల్కోలిన్' అనే రసాయన ఉత్పత్తికి కోలిన్ ఎంతగానో దోహదపడుతుంది," అని డాక్టర్ సేథీ స్పష్టం చేశారు. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
3. ఫ్యాటీ ఫిష్ : మెదడు కణాల నిర్మాణానికి మూలాధారం
సాల్మన్, మాకెరెల్ వంటి ఫ్యాటీ ఫిష్‌లలో డీహెచ్‌ఏ, ఈపీఏ రూపంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు దండిగా ఉంటాయి. మన మెదడులోని సెల్ మెంబ్రేన్లు తయారవ్వడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. న్యూరాన్లు సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ఈ కొవ్వు ఆమ్లాలు ఎంతగానో సహాయపడతాయి. మాంసాహారం తినే వారికి ఇవి మెదడుకు మేలైన పవర్ బూస్టర్‌లా పనిచేస్తాయి.
4. గుమ్మడి గింజలు : మైండ్ ఫాగ్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో జింక్ నరాల సంకేతాలను బలోపేతం చేస్తే, మెగ్నీషియం మెదడు ప్రశాంతతకు, మానసిక పనితీరు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం (బ్రెయిన్ ఫాగ్) వంటి సమస్యలను దూరం చేస్తుంది.
5. బెర్రీలు : వృద్ధాప్య ఛాయలను అడ్డుకునే రక్షణ కవచం
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి పళ్లలో ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి మెదడులోని పాత కణాల స్థానంలో కొత్త అనుబంధాలు ఏర్పడటానికి సాయపడతాయి. తద్వారా తక్షణ ఏకాగ్రత పెరగడమే కాకుండా, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు (అల్జీమర్స్ వంటివి) సమస్యల ముప్పు తగ్గుతుంది.
ఈ ఐదు రకాల ఆహారాలను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆలోచనా సరళి మారడమే కాకుండా, రోజంతా మానసిక అలసట లేకుండా ఉత్సాహంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


