HPV vaccination : ఏ వయస్సు వారికి హెచ్​పీవీ వాక్సిన్​ వేస్తారు? సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయా? ఎందుకు తీసుకోవాలి?

HPV vaccination in India : ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త 'హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్'ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎవరు ఈ వ్యాక్సిన్​ వేయించుకోవాలి? అసలు ఎందుకు వేయించుకోవాలి? సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయా? వంటివి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 3, 2026, 05:59:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్​పీవీ) అనేది 200 కంటే ఎక్కువ రకాల వైరస్‌ల సమూహం. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం కొనసాగడం వల్ల వచ్చే గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందే 'హెచ్‌పీవీ వ్యాక్సిన్'. ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మహిళల కోసం 'హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్'ను ప్రారంభించారు.

హెచ్​పీవీ వ్యాక్సిన్​ ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?
హెచ్​పీవీ వ్యాక్సిన్​ ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?

ఈ బృహత్తర పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీకాలు అందుబాటులో ఉంటాయి.

హెచ్​పీవీ వాక్సినేషన్​ డ్రైవ్​- గణంకాలు ఏం చెబుతున్నాయి?

అధికారిక డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6,60,000 కొత్త కేసులు నమోదు కాగా, సుమారు 3,50,000 మంది మరణించారు. భారత్‌లో ఇది మహిళల్లో వచ్చే రెండో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. గ్లోబోకాన్ 2022 గణాంకాల ప్రకారం, మన దేశంలో ఏటా 1,20,000 కంటే ఎక్కువ కొత్త కేసులు వెలుగు చూస్తుండగా, దాదాపు 80,000 మంది మరణిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రకారం, ఈ వ్యాక్సిన్లు అవి లక్ష్యంగా చేసుకున్న హై-రిస్క్ హెచ్‌పీవీ రకాలను నివారించడంలో దాదాపు 100% సమర్థవంతంగా పనిచేస్తాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు యోని, వల్వర్, కొన్ని రకాల గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ మొటిమలను నివారించడంలో కూడా ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుంది.

ఇండియాలో హెచ్​పీవీ వ్యాక్సినేషన్​
ఇండియాలో హెచ్​పీవీ వ్యాక్సినేషన్​

హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ - టీకా ప్రాముఖ్యత..

హెచ్‌పీవీ అనేది ఒక సాధారణ లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా చర్మం ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ ఎటువంటి చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది.

అందుకే టీకా వేయించుకోవడమే అత్యుత్తమ మార్గం.

భారత దేశంలో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇలా..

9 నుంచి 14 ఏళ్లు: 6 నెలల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాలి.

14 నుంచి 45 ఏళ్లు: 0, 2, 6 నెలల వ్యవధిలో మొత్తం 3 డోసులు తీసుకోవాలి.

27 నుంచి 45 ఏళ్ల వారు: ఇప్పటికే వైరస్‌కు గురై ఉంటే టీకా ప్రభావం తక్కువగా ఉండవచ్చు, కాబట్టి వీరు డాక్టర్ సలహా మేరకు టీకా తీసుకోవాలి.

9 నుంచి 45 ఏళ్ల వయస్సు గల స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఈ టీకా సురక్షితమైనది, ప్రభావవంతమైనది.

భారత్‌లో ప్రధాన వ్యాక్సిన్ బ్రాండ్లు:

సెర్వావాక్ : సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన దేశీయ వ్యాక్సిన్. విదేశీ వ్యాక్సిన్ల కంటే ఇది చాలా సరసమైన ధరకే లభిస్తుంది.

గార్డాసిల్: మెర్క్ కంపెనీకి చెందినవి. గార్డాసిల్ 9 అత్యధిక రక్షణను అందిస్తుంది.

సెర్వారిక్స్: జీఎస్‌కే వారి వ్యాక్సిన్, ఇది ప్రధానంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.

ప్రస్తుత జాతీయ కార్యక్రమం కింద గార్డాసిల్ అనే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్ 16, 18లతో పాటు టైప్ 6, 11 రకాల నుంచి రక్షణ ఇస్తుంది. 14 ఏళ్ల బాలికలకు లైంగికంగా చురుగ్గా మారకముందే ఈ టీకా ఇవ్వడం వల్ల 93-100% ప్రభావం చూపుతుంది. భారత డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదించిన ఈ వ్యాక్సిన్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంది.

హెచ్​పీవీ వాక్సినేషన్​ డ్రైవ్​- సైడ్​ ఎఫెక్ట్స్​..

టీకా వేయించుకున్న చోట స్వల్ప నొప్పి, వాపు లేదా ఎరుపు రంగులోకి మారడం, తల తిరగడం, స్వల్ప జ్వరం లేదా కండరాల నొప్పులు వంటి సాధారణ లక్షణాలు ఉండవచ్చు.

హెచ్​పీవీ వాక్సినేషన్​ డ్రైవ్​- ఎవరు తీసుకోకూడదు?

  • గర్భిణీ స్త్రీలు.
  • మోడరేట్ లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు కోలుకునే వరకు వేచి ఉండాలి.
  • ఈస్ట్ (Yeast) అలర్జీ ఉన్నవారు లేదా గతంలో ఏదైనా టీకా వల్ల అలర్జీలు వచ్చిన వారు తీసుకోకూడదు.

భారత్‌లో ఇది ఎందుకు కీలకం?

అధిక ముప్పు: ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాల్లో 25% భారత్‌లోనే సంభవిస్తున్నాయి. ప్రపంచంలో ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు భారతీయులే! దేశంలో ప్రతి ఏడు నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో మరణిస్తోంది.

నివారణ: భారత్‌లో 80-85% గర్భాశయ క్యాన్సర్లకు హెచ్‌పీవీ టైప్ 16, 18 కారణం. వ్యాక్సిన్ వీటిపై 100% సమర్థంగా పనిచేస్తుంది.

హెర్డ్ ఇమ్యూనిటీ: ఎక్కువ మంది టీకా తీసుకోవడం వల్ల సమాజంలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఈ టీకాను మగవారు కూడా తీసుకోవచ్చా? దీనివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

అవును, హెచ్‌పీవీ వ్యాక్సిన్ మగవారికి కూడా సురక్షితమైనది. మగవారిలో ఈ వైరస్ వల్ల వచ్చే గుదము (Anal), గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ మొటిమల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా, మగవారు టీకా తీసుకోవడం వల్ల వారి నుంచి మహిళలకు వైరస్ వ్యాప్తించే అవకాశం తగ్గుతుంది, తద్వారా సమాజంలో వైరస్ తగ్గుముఖం పడుతుంది (హెర్డ్ ఇమ్యూనిటీ).

2. ఇప్పటికే పెళ్లయిన వారు లేదా 27 ఏళ్లు దాటిన వారు ఈ టీకా తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందా?

9 నుంచి 45 ఏళ్ల వయస్సు వరకు ఎవరైనా ఈ టీకా తీసుకోవచ్చు. అయితే, 27 ఏళ్లు పైబడిన వారు టీకా తీసుకునే ముందు డాక్టరును సంప్రదించడం మంచిది. ఎందుకంటే, పెళ్లయిన వారు లేదా ఇప్పటికే లైంగికంగా చురుగ్గా ఉన్నవారు ఈ వైరస్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికే వైరస్ సోకి ఉంటే, టీకా ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, భవిష్యత్తులో సోకబోయే ఇతర హెచ్‌పీవీ రకాల నుంచి ఇది రక్షణనిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More