Mangoes : మామిడి పండ్లంటే పిచ్చి.. కానీ బరువు పెరుగుతానని భయమా? ఇలా చేయండి..

మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారనే భయంతో చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. అయితే, తినే విధానం మార్చుకుంటే బరువు తగ్గుతూనే మామిడి పండ్లను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చని 45 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్ నమన్ సోలాంకి వివరిస్తున్నారు.

Published on: Jun 7, 2026, 12:25:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండ్ల రాజుగా పిలుచుకునే మామిడి కోసం చాలా మంది ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ పండు ఎంత రుచిగా ఉంటుందో, బరువు తగ్గాలని ప్రయత్నించే వారి 'అవాయిడ్ లిస్ట్' (తినకూడని పదార్థాల జాబితా)లో అంత త్వరగా చేరిపోతుంది. మామిడి పండ్లు తింటే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుందని, తమ వెయిట్ లాస్ లక్ష్యాలు దెబ్బతింటాయని చాలా మంది భయపడుతుంటారు. కానీ, అసలు సమస్య మామిడి పండులో లేదు, మనం దానిని తినే విధానంలోనే ఉందని ఫిట్‌నెస్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన పరిమాణంలో, పద్ధతిగా తింటే బరువు తగ్గడానికి మామిడి పండ్లు ఎలాంటి అడ్డంకి కావని వారు చెబుతున్నారు.

మామిడి పండు ఇలా తింటే బరువు పెరగరు! (Unsplash)
మామిడి పండు ఇలా తింటే బరువు పెరగరు! (Unsplash)

తానే స్వయంగా 125 కిలోల బరువు నుంచి 79 కిలోలకు (ఏకంగా 45 కిలీలు) తగ్గిన ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ నమన్ ఎస్ సోలాంకి ఈ విషయంపై స్పందించారు. మామిడి పండ్ల వల్ల బరువు పెరుగుతారనే అపోహను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. "ఫ్యాట్ లాస్ (కొవ్వు తగ్గించే) జర్నీలో ఉన్నప్పుడు మామిడి పండ్లు తినవచ్చా? నిస్సందేహంగా తినవచ్చు. మామిడి పండు వల్ల ఎలాంటి సమస్య రాదు. అసలు సమస్య చాలా మంది దానిని తినే పద్ధతిలోనే ఉంది" అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నమన్ పేర్కొన్నారు.

మామిడి పండ్లు తినేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి?

బరువు తగ్గాలనుకునే వారు వేసవి కాలంలో మామిడి పండ్లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం.. అది బరువును పెంచుతుందనే బలమైన నమ్మకం. అయితే, మామిడి పండు ఎంతమాత్రం తప్పు కాదని నమన్ స్పష్టం చేశారు. మనం సాధారణంగా చేసే కొన్ని తప్పుడు అలవాట్లే ఇందుకు కారణమవుతున్నాయి. మామిడి పండ్లను షుగర్ ఎక్కువగా ఉండే మిల్క్‌షేక్‌లుగా మార్చడం, ఆమ్రస్ (మామిడి రసం) లో అదనంగా చక్కెర కలపడం, అతిగా తినడం లేదా ఇప్పటికే భారీగా భోజనం చేసిన తర్వాత మళ్లీ మామిడి పండ్లను డెజర్ట్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల శాతం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రకమైన తినే అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతాయి తప్ప, కేవలం పండు తినడం వల్ల కాదు.

మామిడి పండ్లను తినే సరైన పద్ధతి..

మామిడి పండ్లను చక్కెర, సిరప్‌లు లేదా స్వీటెన్డ్ డైరీ ప్రొడక్ట్స్‌తో కలిపి ఎక్కువ క్యాలరీల డెజర్ట్‌గా మార్చవద్దు. అలా కాకుండా, దానిలోని సహజమైన పోషక విలువలు దెబ్బతినకుండా, క్యాలరీలు పెరగకుండా తినాలని నమన్ సూచిస్తున్నారు. మామిడి పండును వేరే వాటితో కలపకుండా విడిగా ఒక స్నాక్‌లా ఎంజాయ్ చేయాలని, తినే పరిమాణంపై శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం లేదా బరువు తగ్గే లక్ష్యాలు దెబ్బతినకుండా ఈ సీజనల్ ఫ్రూట్‌ను మనసారా ఆస్వాదించవచ్చు.

మామిడి పండ్లను మీ డైట్‌లో చేర్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న సులువైన మార్గాలు:

  • మామిడి పండును ముక్కలుగా కట్ చేసుకుని నేరుగా తినండి.
  • దీనిని ఒక ప్రత్యేకమైన స్నాక్ సమయంలో మాత్రమే తీసుకోండి.
  • చక్కెర ఎక్కువగా ఉండే మిల్క్‌షేక్‌లు, డెజర్ట్‌లుగా మార్చకండి.
  • ఎంత పరిమాణంలో తింటున్నారనేది కంట్రోల్‌లో ఉంచుకోండి.
  • సాధారణంగా రోజుకు ఒక మీడియం సైజు మామిడి పండు మాత్రమే తినడానికి పరిమితం అవ్వండి.

ఇది ఎలా పని చేస్తుంది?

కేవలం ఒక పండును డైట్ నుంచి పూర్తిగా దూరం పెట్టడం వల్లే బరువు తగ్గిపోరని నమన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా బరువు అదుపులో ఉండటం అనేది మనం తీసుకునే మొత్తం క్యాలరీలు, క్వాంటిటీ కంట్రోల్, సరైన ఆహార ఎంపికలు, క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. స్వీట్స్ లేదా ఐస్‌క్రీమ్స్ తినాలనే కోరిక కలిగినప్పుడు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ కంటే సహజమైన తీపి ఉండే మామిడి పండును తినడం చాలా ఉత్తమమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని ఆయన వివరించారు.

"ఫ్యాట్ లాస్ అనేది మొత్తం క్యాలరీలు, పోర్షన్ కంట్రోల్, స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది కానీ ఏదో ఒక పండును పూర్తిగా మానేయడం వల్ల కాదు. ప్రాసెస్ చేసిన స్వీట్ల కంటే మామిడి పండు ద్వారా సహజంగానే తీపి కోరికలను అదుపు చేయవచ్చు," అని ఫిట్‌నెస్ ట్రైనర్ పేర్కొన్నారు.

మామిడి పండ్ల ద్వారా శరీరానికి ఇవి కూడా అందుతాయి:

  • ఫైబర్ (పీచు పదార్థం)
  • అవసరమైన విటమిన్లు
  • సహజమైన తీపి

"అందుకే మామిడి పండును చూసి భయపడాల్సిన అవసరం లేదు. దానిని సరైన పద్ధతిలో తినండి. పరిమాణాన్ని అదుపులో ఉంచుకోండి. మీ వెయిట్ లాస్ జర్నీ ఎప్పటిలాగే సాగుతుందిస," అని నమన్ ముగించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More