Soda tax : భారత దేశ కూల్ డ్రింక్స్​లో మోతాదుకు మించి చక్కెర! ఇతర దేశాల్లో చాలా తక్కువ- సోడా ట్యాక్స్ వల్లే..

ఫ్రాన్స్‌లో లభించే కూల్ డ్రింక్స్‌తో పోలిస్తే భారతదేశంలో విక్రయించే డ్రింక్స్‌లో చక్కెర చాలా ఎక్కువ. దీనికి అక్కడ అమల్లో ఉన్న 'సోడా టాక్స్' ప్రధాన కారణమంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్రభావశీలి ఫుడ్ ఫార్మర్ (రేవంత్ హిమత్సింగ్కా) ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Published on: Jul 25, 2026, 07:28:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్రాన్స్ దేశంలో విక్రయించే శీతల పానీయాలతో పోలిస్తే, అదే బ్రాండ్ కూల్ డ్రింక్స్ మన భారతదేశంలో అత్యధిక పరిమాణంలో చక్కెరను కలిగి ఉంటున్నాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఫ్రాన్స్ ప్రభుత్వం విధిస్తున్న 'సోడా టాక్స్' అని ప్రముఖ ఇన్​ఫ్లుయెన్సర్ రేవంత్ హిమత్సింగ్కా అలియాస్ 'ఫుడ్ ఫార్మర్' వివరించారు. మన దేశంలో కూడా ఇటువంటి పన్ను విధానాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా కోరుతున్నారు.

సోడా ట్యాక్స్ అంటే ఏంటో తెలుసా?
సోడా ట్యాక్స్ అంటే ఏంటో తెలుసా?

అసలు ఫ్రాన్స్ అమలు చేస్తున్న ఈ సోడా టాక్స్ విధానం ఏంటి? ఇది శీతల పానీయాల పరిశ్రమలో ఎలాంటి మార్పులు తెచ్చిందో పూర్తి వివరంగా పరిశీలిద్దాం.

ఫ్రాన్స్ 'సోడా టాక్స్' అంటే ఏంటి?

శీతల పానీయాల్లో ఉండే చక్కెర మోతాదు ఆధారంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పన్ను విధిస్తుంది. పానీయంలో పంచదార పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే, పన్ను భారం అంత తీవ్రంగా పెరుగుతుంది. పన్నుల భారాన్ని తట్టుకోలేక చాలా పానీయాల తయారీ కంపెనీలు ధరలు పెంచడం కంటే, డ్రింక్స్‌లో వాడే చక్కెర మోతాదును గణనీయంగా తగ్గించడానికే ప్రాధాన్యత ఇచ్చాయి.

ఫ్రాన్స్ ప్రభుత్వం మొదటగా 2012 జనవరిలో ఈ పన్నును అమల్లోకి తెచ్చినప్పటికీ, 2018 జులైలో దీనిని మరింత కఠినతరం చేసింది. పానీయంలో అదనంగా కలిపే చక్కెర గ్రాముల ఆధారంగా పన్ను స్లాబ్‌లను వర్గీకరించింది.

స్లాబ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

ఎక్కువ చక్కెర ఉండే సాధారణ కోలా డ్రింక్స్ (లీటరుకు 100 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర) అత్యధిక పన్ను పరిధిలోకి వస్తాయి. మరోవైపు, డైట్ డ్రింక్స్, షుగర్ ఫ్రీ లేదా కృత్రిమ తీపి పదార్థాలు వాడే పానీయాలకు ఈ కఠిన నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చి చాలా తక్కువ రుసుము మాత్రమే వసూలు చేస్తారు.

దీనివల్ల కంపెనీలు తమ పానీయాల తయారీ ఫార్ములాను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పన్ను శ్లాబులు మారే కొద్దీ చెల్లించాల్సిన రుసుము భారీగా పెరుగుతుంది కాబట్టి, సదరు కంపెనీలు పన్నుల భారాన్ని భరించే బదులు పానీయాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడానికే మొగ్గు చూపాయి.

వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపింది?

ఫ్రాన్స్ ఈ పన్నును అమలు చేసినప్పుడు కంపెనీలు ధరలను 7 నుంచి 8 శాతం మేర పెంచడం వల్ల ప్రజల కొనుగోలు అలవాట్లలో కొన్ని మార్పులు వచ్చాయి. అయితే, ప్రజల వద్ద నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం కాదు. కంపెనీలు తమ ఉత్పత్తుల్లో చెక్కరను తగ్గించేలా ఒత్తిడి తీసుకురావడమే ఈ విధాన ముఖ్య ఉద్దేశం.

ఫలితంగా, 2017లో ఫ్రాన్స్ ఈ నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత 'డాక్టర్ పెప్పర్ స్నాపుల్ గ్రూప్' తమ షెవెప్స్ డ్రింక్స్‌లో 40 శాతానికి పైగా, సెవెన్ అప్ డ్రింక్స్‌లో 30 శాతానికి పైగా చక్కెరను తగ్గించింది. యూనిలీవర్ సంస్థ తమ 'లిప్టన్ ఐస్ టీ'లో, కోకా-కోలా కంపెనీ తమ 'ఫాంటా' డ్రింక్‌లో 30 శాతం మేర చక్కెర వినియోగాన్ని తగ్గించడం గమనార్హం.

ఇతర దేశాల్లోనూ ఇదే బాట!

శీతల పానీయాలపై ప్రత్యేక పన్నులు విధించడంలో ఫ్రాన్స్ ఒక్కటే లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాలు ఇప్పటికే చక్కెర పానీయాలపై పలు రకాల పన్నులను అమలు చేస్తున్నాయి.

  • అమెరికాలోని పలు కీలక నగరాలు, ప్రాంతాలు
  • యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)
  • మెక్సికో
  • సౌతాఫ్రికా
  • పోర్చుగల్
  • చిలీ

భారత్‌లో ఈ పన్ను ఎందుకు అవసరం?

"తక్కువ చక్కెరతో శీతల పానీయాలు తయారు చేసే సాంకేతికత, సామర్థ్యం ఈ కంపెనీలకు ఇప్పటికే ఉన్నాయి. అలాంటప్పుడు భారతదేశంలో కూడా అదే సూత్రాన్ని ఎందుకు అమలు చేయకూడదు? మన దేశంలో కూడా సోడా టాక్స్ తక్షణమే అమలు చేయాలని నేను బలంగా కోరుకుంటున్నాను. దీని ద్వారా కంపెనీలు తాము కలిపే పంచదార శాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా భారతీయులు ప్రతిరోజూ తీసుకునే అత్యధిక చక్కెర ప్రమాదం తప్పుతుంది," అని ఫుడ్ ఫార్మర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయన ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా వివరించారు. భారతదేశంలో విక్రయించే సాధారణ సోడాలలో ప్రతి 100 మిల్లీలీటర్లకు సగటున 10 నుంచి 11 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే మనం ఒక 300ఎంఎల్ బాటిల్ డ్రింక్ తాగితే దాదాపు 30 నుంచి 33 గ్రాముల చక్కెర (సుమారు 7.5 నుంచి 8 టీస్పూన్లు) శరీరంలోకి చేరుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రోజుకు గరిష్టంగా 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదని సూచిస్తున్న వేళ, ఒకే ఒక్క కూల్ డ్రింక్ బాటిల్ ఆ పరిమితిని దాటేస్తోంది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More