Heart attack : బాత్‌రూమ్‌లో గండెపోటు! మలబద్ధకంతో జాగ్రత్త..
మలబద్ధకం లేదా ఫోన్ ఉపయోగిస్తూ టాయిలెట్‌లో ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం వల్ల గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఇది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి..
చాలామంది టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు మలబద్ధకం వల్ల లేదా సాధారణ అలవాటుగా ఎక్కువగా ప్రెజర్/ స్ట్రెయిన్ పెడుతుంటారు. మరికొందరైతే చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని ఎంత సమయం గడుపుతున్నామో కూడా గమనించకుండా గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రేగులు, మలాశయం (కోలోన్) పై ఒత్తిడిపడి పైల్స్ వంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ, ఈ చిన్న అలవాటు మీ గుండె ప్రాణాలకే ముప్పు తెస్తుందని మీకు తెలుసా?

టాయిలెట్‌లో తీవ్ర స్ట్రెయిన్ వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఇది గుండె అత్యవసర పరిస్థితికి లేదా గుండెపోటుకు దారితీస్తుందని ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్ట్రెయిన్ చేయడం వల్ల గుండెపోటు ఎలా వస్తుంది?
స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు మన ఛాతీ భాగంలో ఒక రకమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ గుండె పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిపీన్‌చంద్ర భామ్రే వివరించారు.
"మల విసర్జన సమయంలో చాలామంది ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తుంటారు. ఈ హఠాత్ ఒత్తిడి వల్ల శరీరంలో రక్తపోటు, గుండె స్పందనల వేగం తాత్కాలికంగా ఒక్కసారిగా మారుతాయి. ఇది గుండెపై తీవ్రమైన అదనపు ఒత్తిడిని గుప్పిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, నియంత్రణలో లేని అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో లేదా గుండె పనితీరు బలహీనంగా ఉన్నవారిలో ఈ అదనపు ఒత్తిడి వల్ల తీవ్రమైన ఛాతీ నొప్పులు, క్రమం లేని గుండె స్పందనలు లేదా గుండెపోటు కూడా రావచ్చు," అని డాక్టర్ బిపీన్‌చంద్ర తెలిపారు.
మన జీర్ణవ్యవస్థలో మనం ఇచ్చే తీవ్రమైన ఒత్తిడి కేవలం పొట్టకే పరిమితం కాకుండా, రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, హృదయ స్పందనల వ్యవస్థను సైతం దెబ్బతీస్తుందని ఈ విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది.
లక్షణాలు ఎలా పెరుగుతాయి? వాటి తీవ్రత ఎలాంటిది?
బాత్‌రూమ్‌లో ఉండే సమయంలో గుండెపోటు లక్షణాలు చాలా వేగంగా విస్తరిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అకస్మాత్తుగా ప్రారంభమయ్యే తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా భరించలేని ఒత్తిడి భావనతో ఇది మొదలవుతుంది.
ఈ నొప్పి క్రమంగా ఎడమ చేయి, మెడ, దవడ, భుజాలు లేదా వెనుక భాగానికి విస్తరిస్తుంది. దీనితో పాటు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది (ఆయాసం), చల్లని చెమటలు పట్టడం, మైకం రావడం, వికారం, వాంతులు, విపరీతమైన నీరసం లేదా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితి ముఖ్యంగా వయోవృద్ధులలో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
బాత్‌రూమ్‌లో ఛాతీ నొప్పి వస్తే ఏం చేయాలి?
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఛాతీలో ఎలాంటి అసౌకర్యం లేదా నొప్పి అనిపించినా దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. "మల విసర్జన సమయంలో ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం మొదలైతే వెంటనే ప్రెజర్/ స్ట్రెయిన్ చేయడం ఆపేయాలి. ప్రశాంతంగా ఉండి, వెంటనే సహాయం కోసం కేక వేయాలి లేదా ఇతరులను పిలవాలి. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి," అని డాక్టర్ భామ్రే స్పష్టం చేశారు.
స్ట్రెయిన్‌ని నివారించడానికి, గుండెను కాపాడుకోవడానికి చిట్కాలు:
మలబద్ధకం నివారించండి: రోజూ తగినంత నీరు తాగడం, పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం దరిచేరకుండా చూసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక లేదా సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
టాయిలెట్‌లో ఒత్తిడి వద్దు: విసర్జన సమయంలో బలవంతంగా స్ట్రెయిన్ చేయడం లేదా ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చోవడం పూర్తిగా మానేయాలి.
ఔషధాల వాడకం: ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను సమయానికి క్రమం తప్పకుండా వాడాలి.
ఆరోగ్య సూచీల నియంత్రణ: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అదుపులో ఉంచుకోవాలి.
మామూలు హెల్త్ చెకప్‌లు: నిర్ణీత వ్యవధిలో మాస్టర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


