Hand Fatigue : వామ్మో! గంటల తరబడి టైపింగ్ చేయడం.. ఇంత ప్రమాదకరమా!
Carpal Tunnel Syndrome : నిరంతరం ల్యాప్‌టాప్‌లపై టైపింగ్ చేయడం, మొబైల్ స్క్రీన్లు వాడటం వల్ల చేతి వేళ్లు, మణికట్టు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులలో పెరుగుతున్న ఈ రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీస్ ముప్పుపై సీనియర్ సర్జన్ డాక్టర్ అభిషేక్ బర్లి ప్రత్యేక విశ్లేషణ ఇదీ..
How to Avoid Hand Fatigue : నేటి డిజిటల్ యుగంలో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు మన చేతి వేళ్లకు అస్సలు విశ్రాంతి దొరకడం లేదు. ఆఫీసులో ల్యాప్‌టాప్, కంప్యూటర్ కీబోర్డ్‌లపై టైపింగ్ చేయడం, మౌస్‌ను క్లిక్ చేయడం లేదా చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రీన్ స్క్రోల్ చేయడం మనకు నిత్యకృత్యంగా మారింది. అయితే, ఇలా చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన చేతి వేళ్లను, మణికట్టును చాలా అసౌకర్యమైన పొజిషన్లలో ఉంచుతున్నాము.

ఈ అలవాటు వల్ల వచ్చే అసలైన ఆరోగ్య ముప్పు ఎక్కడుందంటే.. మనం రోజంతా వేర్వేరు స్క్రీన్లను చూస్తూ నిరంతరం ఒకే రకమైన మూవ్‌మెంట్స్ (కదలికలు) చేస్తుంటాము. రోజూ ఇలాగే చేయడం వల్ల క్రమంగా చేతిలోని కీళ్లు, నరాలు, కండరాలను ఎముకలకు అనుసంధానించే టెండన్లు తీవ్ర ఒత్తిడికి గురై దెబ్బతింటాయి. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చుని డిజిటల్ పనులతో గంటల తరబడి టైపింగ్ చేసే డెస్క్ ఉద్యోగులలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో, గంటల తరబడి టైపింగ్ చేయడం వల్ల చేతులకు వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏంటి? వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి? అనే విషయాలను హైదరాబాద్‌లోని ప్రముఖ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్, ట్రామా అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్ బర్లి వివరంగా పంచుకున్నారు. మనకు ఇది రోజువారీ సాధారణ పనిలాగే అనిపించవచ్చు, చేతులు నొప్పి పెడితే ఏదైనా పెయిన్ బామ్ రాసుకుని తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. కానీ భవిష్యత్తులో ఇది చేతి నరాలు, కీళ్లపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన హెచ్చరించారు.
"మౌస్‌ను నిరంతరం ఉపయోగించడం లేదా కీబోర్డ్‌పై టైపింగ్ చేయడం వంటి ఒకే రకమైన కదలికలను పదే పదే చేయడం వల్ల కాలక్రమేణా అవి 'రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీస్' (ఆర్‌ఎస్‌ఐ) గా మారతాయి. ప్రస్తుతం ఆఫీస్ ఉద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, టీనేజర్లలో కూడా ఈ ఆర్‌ఎస్‌ఐ సమస్యలు చాలా వేగంగా పెరుగుతున్నాయి," అని డాక్టర్ అభిషేక్ బర్లి వెల్లడించారు.
అస్సలు నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు ఇవే!
చేతులకు సంబంధించి కింది లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణ నొప్పులుగా భావించి అస్సలు లైట్ తీసుకోవద్దని, అవి తగ్గకుండా అలాగే వేధిస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు:
చేతి వేళ్లలో సూదులు గుచ్చినట్లు తిమ్మిర్లు రావడం
వేళ్లు మొద్దుబారిపోవడం
బొటనవేలిలో తీవ్రమైన నొప్పి రావడం
మణికట్టు భాగంలో అసౌకర్యంగా లేదా నొప్సిగా అనిపించడం
చేతులు త్వరగా అలసిపోవడం
చేతితో పట్టుకునే పట్టు బలహీనపడటం
మోచేతి కింది భాగంలో మంటగా అనిపించడం
ఈ లక్షణాలు ప్రారంభంలో చాలా స్వల్పంగానే ఉంటాయని, కానీ రోజులు గడిచేకొద్దీ తీవ్రంగా మారుతాయని డాక్టర్ బర్లి హెచ్చరించారు. అంతేకాదు, కొంతమందిలో చేతి వేళ్లు అకస్మాత్తుగా లాక్ అయిపోవడం లేదా కదిలించినప్పుడు 'క్లిక్' అనే శబ్దం రావడం వంటి విచిత్రమైన సమస్యలు కూడా కనిపిస్తాయని, దీనిని వైద్య పరిభాషలో ‘ట్రిగ్గర్ ఫింగర్’ అంటారని ఆయన తెలిపారు.
చేతులు శాశ్వతంగా దెబ్బతింటాయా?
గంటల తరబడి డెస్క్ జాబ్ చేయడం వల్ల చేతులు శాశ్వతంగా పాడైపోతాయా? అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని డాక్టర్ భరోసా ఇచ్చారు. కానీ, పని మధ్యలో చేతులకు చిన్న చిన్న బ్రేకులు (విశ్రాంతి) ఇవ్వడం అత్యంత ముఖ్యం. తగినంత రెస్ట్ ఇవ్వకుండా, కూర్చునే విధానంలో మార్పులు చేసుకోకుండా అలాగే పని చేస్తూ పోతే.. చేతుల్లో దీర్ఘకాలిక వాపులు రావడం, నరాలు నలిగిపోవడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గకపోవచ్చని సర్జన్ తెలిపారు.
"తీవ్రమైన కేసుల్లో చికిత్స తర్వాత కూడా 'కార్పల్ టన్నెల్ సిండ్రోమ్' వల్ల చేతులు మొద్దుబారడం, బలహీనత, చేతి వేళ్లతో సూక్ష్మమైన పనులు చేయలేకపోవడం, గ్రిప్ తగ్గడం వంటి సమస్యలు అలాగే ఉండిపోవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నా నిర్లక్ష్యం చేసి వైద్యం తీసుకోకపోతే, బొటనవేలి చుట్టూ ఉండే కండరాలు పూర్తిగా క్షీణించిపోయే ప్రమాదం కూడా ఉంది," అని డాక్టర్ బర్లి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరికి ఎక్కువ ముప్పు ఉంది?
డాక్టర్ బర్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీస్ బారిన పడుతున్న వారిలో ఆఫీస్ ఉద్యోగులు, ఐటీ రంగ నిపుణులు, కాలేజీ విద్యార్థులు, టీనేజర్లు ఎక్కువగా ఉంటున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోకుండా, సరైన భంగిమలు పాటించకుండా గంటల తరబడి కీబోర్డ్ టైపింగ్, మౌస్ వర్క్, స్మార్ట్‌ఫోన్ గేమ్స్ ఆడటం లేదా చాటింగ్ చేయడం వల్లే వీరంతా ఈ రోగాల బారిన పడుతున్నారు.
చేతులను సురక్షితంగా కాపాడుకోవడం ఎలా?
కంప్యూటర్లు, మొబైల్స్ ఎక్కువగా వాడేటప్పుడు చేతులు అలసిపోకుండా, తిమ్మిర్లు, నొప్పులు రాకుండా ఉండటానికి డాక్టర్ అభిషేక్ బర్లి కొన్ని అద్భుతమైన చిట్కాలను, నివారణ మార్గాలను సూచించారు:
సరైన ఎత్తులో ఉంచండి: మీ కంప్యూటర్ కీబోర్డ్, మౌస్ ఎల్లప్పుడూ మీ మోచేయి ఎత్తుకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మణికట్టుపై ఒత్తిడి తగ్గుతుంది.
చిన్న బ్రేకులు తీసుకోండి: ప్రతి 45 నుంచి 60 నిమిషాల పని తర్వాత కనీసం రెండు మూడు నిమిషాల పాటు టైపింగ్‌కు విరామం ఇవ్వండి.
చేతులకు స్ట్రెచింగ్: ఆ చిన్న విరామ సమయంలో మీ చేతి వేళ్లను, మణికట్టును వెనక్కి, ముందుకు సాగదీస్తూ చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
కూర్చునే విధానం మార్చండి: కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు మీ వెన్నుముక నేరుగా ఉండేలా, మీ బాడీ పోస్చర్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవడం వల్ల చేతులపై పడే భారం చాలా వరకు తగ్గుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


