జంక్ ఫుడ్ తింటే డిప్రెషన్ పెరుగుతుందా? అసలు నిజాలు..
డిప్రెషన్‌తో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం వల్ల మానసిక ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
డిప్రెషన్ అనేది మన మధ్య చాలామందిని వేధిస్తున్న తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి, జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక మానసిక గాయాలు డిప్రెషన్‌కు ప్రధాన కారణాలని మనం సాధారణంగా భావిస్తుంటాం. అయితే, మనం రోజువారీ తీసుకునే ఆహార అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యంపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రముఖ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రసిద్ధ వైద్య పత్రిక ‘జామా సైకియాట్రీ’లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే ఉపశమనం!
మేజర్ డిప్రెషన్ డిసార్డర్‌తో బాధపడుతున్న 20 మంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఈ ప్రాథమిక (పైలట్) అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిపై రెండు విభిన్న దశల్లో పరిశోధనలు జరిపారు. ఒక దశలో వారు రోజూ తినే సాధారణ ఆహారాన్ని, మరో నాలుగు వారాల పాటు ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్’ అత్యంత కనిష్టంగా ఉన్న ప్రత్యేక ఆహారాన్ని అందించారు.
ఈ పరిశోధనలో పాల్గొన్నవారు తమ ఆహారంలో ప్రాసెస్ చేసిన పదార్థాలను 85 శాతానికి పైగా తగ్గించగా, వారిలో డిప్రెషన్ లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దానితో పాటు ఆందోళన స్థాయిలు కూడా తగ్గడం విశేషం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించడం వల్ల డిప్రెషన్ బాధితులకు మేలు జరుగుతుందని ఈ అధ్యయనం ప్రాథమికంగా నిరూపించింది.
నాలుక రుచి వెనుక అసలు రహస్యం!
మన చుట్టూ దొరికే జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ పదార్థాలను మానడం ఎందుకు అంత కష్టమో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నియాషా చాజ్వెడెరా వివరించారు.
"అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా చౌకగా, సులువుగా దొరకడమే కాకుండా నాలుకకు అమితమైన రుచిని ఇస్తాయి. అందుకే వీటిని మానడం పెద్ద సవాలు. ఇవి మెదడులో ఆనందాన్ని ఇచ్చే 'డోపమైన్' హార్మోన్‌ను విడుదల చేసి, మళ్లీ మళ్లీ తినాలనే కోరికను రేకెత్తిస్తాయి. ప్రజలు వీటిని ఎక్కువగా తినేలా చేయడానికి ఆహార తయారీ సంస్థలు నిపుణుల సహాయంతో చక్కెర, ఉప్పు, కొవ్వులను ఖచ్చితమైన పరిమాణంలో కలుపుతాయి," అని డాక్టర్ నియాషా పేర్కొన్నారు.
ఏవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్?
సాధారణంగా ఫ్యాక్టరీల్లో రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కలిపి తయారు చేసే ఆహారాన్ని 'అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్' అంటారు. మన ఇంట్లో లభించే సహజ సిద్ధమైన కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు కాకుండా.. బయట ప్యాకెట్లలో లభించే చిప్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, రెడీ-టు-ఈట్ లేదా ఇన్స్టెంట్ భోజనాలు, బిస్కెట్లు, బేకరీ ఐటెమ్స్, ప్రాసెస్ చేసిన మాంసం, రుచిని పెంచే రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపిన పదార్థాలు ఈ వర్గంలోకి వస్తాయి. అయితే ప్యాక్ చేసిన ప్రతి ఆహారం చెడ్డది కాదని, తీవ్రంగా రసాయనాలు కలిపిన వాటితోనే ముప్పు అని పరిశోధకులు స్పష్టం చేశారు.
పొట్టకు- మెదడుకు ఉన్న బంధం!
ఆహారానికి, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం వెనుక 'గట్-బ్రెయిన్ కనెక్షన్' (జీర్ణవ్యవస్థ-మెదడు అనుబంధం) కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. మనం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్టలో మంట ఏర్పడి, అది మెదడు పనితీరుపై, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. దీనికి తోడు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాల నుంచి శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు లభించవు.
మందులు అపేయవచ్చా?
ఈ అధ్యయనం ప్రాథమికమైనదేనని, కేవలం ఆహారం మార్చడం ద్వారానే డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చని భావించి వాడుతున్న మందులను ఆపకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ అనేది ఒక సంక్లిష్టమైన వైద్య సమస్య. డాక్టర్ల సలహాతో కౌన్సెలింగ్, థెరపీ, మందులను కొనసాగిస్తూనే.. ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం మంచిదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై మరింత విస్తృతమైన పరిశోధన చేయడానికి రెండవ దశ ప్రయోగాలను 2028లో ప్రారంభించనున్నట్లు పరిశోధక బృందం వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


