దేశ రాజధాని దిల్లీలో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వెక్టర్-బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

వార్తా సంస్థ పీటీఐ అందించిన సమాచారం ప్రకారం.. దిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,300కి పైగా ఇన్‌ఫ్లూయెంజా-ఏ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,777కి పైగా స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నట్లు తేలింది. ఒక్క గురువారం నాడే ఏకంగా 114 హెచ్1ఎన్1 కేసులు వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
దిల్లీలో హెచ్1ఎన్1 తాజా గణాంకాలు..
ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు దిల్లీలో నమోదైన మొత్తం ఇన్‌ఫ్లూయెంజా కేసుల సంఖ్య 2,602కి చేరింది. ఇందులో శుక్రవారం వరకు నమోదైన 2,392 ఇన్‌ఫ్లూయెంజా-ఏ, 210 ఇన్‌ఫ్లూయెంజా-బీ కేసులు ఉన్నాయి.
ఇన్‌ఫ్లూయెంజా-ఏ కేసులలో 1,777 హెచ్1ఎన్1 కాగా, 37 హెచ్1, 138 హెచ్3, అలాగే 440 ఇతర కేసులు ఉన్నాయి. ఇక ఇన్‌ఫ్లూయెంజా-బీ జాబితాలో 200 విక్టోరియా స్ట్రెయిన్ కేసులు, 10 ఇతర కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వల్ల వచ్చే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షనే సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా అని ఆరోగ్య శాఖ పేర్కొంది. చిన్న పిల్లలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (కో-మార్బిడిటీస్) ఉన్న వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
స్వైన్ ఫ్లూ కేసులు ‘ఆరు రెట్లు ఎక్కువ’
పీఎస్ఆర్ఐ హాస్పిటల్ పల్మినరీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీతూ జైన్ పీటీఐతో మాట్లాడుతూ.. "ఈ ఏడాది దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో హెచ్1ఎన్1 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా ఉంది" అని తెలిపారు.
{{/usCountry}}పీఎస్ఆర్ఐ హాస్పిటల్ పల్మినరీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీతూ జైన్ పీటీఐతో మాట్లాడుతూ.. "ఈ ఏడాది దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో హెచ్1ఎన్1 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా ఉంది" అని తెలిపారు.
{{/usCountry}}దిల్లీలో కేసులు పెరగడానికి కారణాలను వివరిస్తూ.. "మొదటిది వాతావరణ పరిస్థితులు. అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన తేమ కారణంగా హెచ్1ఎన్1 కేసులు, ఫ్లూ కేసులు, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి," అని పేర్కొన్నారు.
"జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు కారడం, నీరు కారే కళ్లు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలే హెచ్1ఎన్ లలో కూడా కనిపిస్తాయి," అని తెలిపారు.
"త్వరగా కోలుకోవడానికి యాంటీవైరల్ మందులు ఇస్తారు, అలాగే అవసరమైతే సపోర్టివ్ కేర్ అందిస్తారు," అని డాక్టర్ తెలిపారు. హెచ్1ఎన్1 అనేది చాలా వరకు నయం చేయదగిన వ్యాధేనని, సాధారణంగా ఇది అంత ప్రమాదకరం కాదని, కానీ కొంతమందికి మాత్రం తీవ్రరూపం దాల్చుతుందని చెప్పారు. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా మాట్లాడుతూ.. స్వైన్ ఫ్లూ అనేది కొత్త సబ్‌టైప్ కాదని, చాలా కాలంగా మనకు తెలిసిందేనని అన్నారు.
"అయితే, ఈసారి వస్తున్న హెచ్1ఎన్1 కేసులు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అంతేకాకుండా, ఈ వైరస్ సోకిన వ్యక్తి ద్వారా కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు గమనిస్తున్నాం," అని లహరియా పీటీఐకి తెలిపారు.
దీనికి కారణం వివరిస్తూ.. ఈ వైరస్ సంవత్సరాల తరబడి సర్క్యులేట్ అవుతుందని, అయితే ఫ్లూ వైరస్‌లు ప్రతి ఏటా మారుతుంటాయని చెప్పారు. వాటి సబ్‌టైప్స్‌లో కూడా మార్పులు వచ్చి, లక్షణాలు మారుతుంటాయని తెలిపారు. ఈసారి వస్తున్న హెచ్1ఎన్1 సబ్‌టైప్ మరింత తీవ్ర ప్రభావం చూపుతోందని, ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, హై-రిస్క్ గ్రూపుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
స్వైన్ ఫ్లూ రిస్క్ గ్రూపులు, లక్షణాలు..
ఇంటర్నల్ మెడిసిన్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ అండ్ యూనిట్ హెడ్ డాక్టర్ సతీష్ కౌల్ మాట్లాడుతూ.. తన ఓపీడీలో ఇప్పటివరకు హెచ్1ఎన్1 వల్ల ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు. కాగా వృద్ధులకు ఈ ఫ్లూ సోకితే అది "న్యుమోనియాగా మారే ప్రమాదం" ఉందని హెచ్చరించారు. చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు.
"అన్నింటికంటే ముఖ్యంగా, అదుపులో లేని మధుమేహం (డయాబెటిస్), క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు, లేదా ఇమ్యూనోసప్రెసివ్ మందులు వాడుతున్న ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాధి తీవ్రమైన రూపం దాల్చవచ్చు," అని సతీష్ కౌల్ వివరించారు.
"ఇతరులకు అయితే కేవలం 3 నుంచి 5 రోజులు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఉండి తగ్గిపోతుంది.. ప్రతి రోగికి యాంటీ-ఫ్లూ మందులు అవసరం లేదు. కేవలం 'కేటగిరీ-సి' కిందకు వచ్చే రోగులకు మాత్రమే ఇవి అవసరమవుతాయి. సీజన్ మారే సమయంలో ప్రజలు ఎక్కువగా కలవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది," అని తెలిపారు.
దిల్లీ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ..
హెచ్1ఎన్1 కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దిల్లీ ప్రభుత్వం ఒక ఆరోగ్య సలహాను (అడ్వైజరీ) జారీ చేసింది. ప్రజలు రెస్పిరేటరీ హైజీన్ పాటించాలని, జనసందోహం ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని కోరింది. స్వయంగా మందులు వాడకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.
ప్రజలు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇవి..
- దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.
- క్రమం తప్పకుండా సబ్బు, నీటితో చేతులను కడుక్కోవాలి.
- జనసమ్మద్ద ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలి.
- శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
- కళ్లు, ముక్కును పదే పదే తాకకూడదు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం మానుకోవాలి.
- తగినన్ని ద్రవ పదార్థాలు (నీరు, జ్యూసులు) తీసుకోవాలి.
- జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందులు వాడకూడదు.
హెచ్1ఎన్1 సన్నద్ధతపై జేపీ నడ్డా సమీక్ష..
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం దేశంలో హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా జాతీయ రాజధాని దిల్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బలమైన నిఘా (సర్వైలెన్స్), ముందస్తు సన్నద్ధత ఉండాలని పిలుపునిచ్చారు.
జాతీయ నిఘా పరిస్థితి, ఇన్‌ఫ్లూయెంజా లాంటి అనారోగ్య, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ ట్రెండ్స్, టెస్టింగ్, ల్యాబొరేటరీ సర్వైలెన్స్, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా కేసులను నిర్వహించడానికి ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించారు.
పీటీఐ ప్రకారం.. ఐఎల్‌ఐ, సారీ, ఇన్‌ఫ్లూయెంజా కేసుల స్క్రీనింగ్, రిపోర్టింగ్, పర్యవేక్షణ కోసం చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ ఆఫీసర్లు, ఆసుపత్రులకు అధికారిక మార్గదర్శకాలు జారీ చేశారు.
రోగుల వర్గీకరణ, చికిత్స ప్రోటోకాల్‌లు, వెంటిలేటర్ మేనేజ్‌మెంట్, మాస్క్ వాడకం, హోమ్ కేర్ వంటి అంశాలపై టెక్నికల్ గైడ్‌లైన్స్ ఇప్పటికే సర్క్యులేట్ చేశారు. హెల్త్‌కేర్ వర్కర్లకు కూడా లక్షణాలు, ఫాలో-అప్ ప్రోటోకాల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు.
ఇటీవల జిల్లా అధికారుల కోసం రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇన్‌ఫ్లూయెంజా నివారణపై అవగాహన పెంచడానికి ఎంసీడీ, ఎన్‌డీఎంసీ, కంటోన్మెంట్ బోర్డు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, డీడీఏ తదితర భాగస్వామ్య సంస్థలతో ఇంటర్-సెక్టోరల్ మీటింగ్ నిర్వహించారు. సీడీఎంఓలతో రోజూ రివ్యూ మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు.