Gut health : ఈ 3 సింపుల్ విషయాలు చేస్తే చాలు.. 7 రోజుల్లో మీ ‘గట్ హెల్త్’ రిపేర్ అయిపోతుంది!
How to Reset Gut System : మనం తినే ఆహారం జీర్ణం కావడమే కాకుండా రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు కూడా మన పొట్ట (గట్ హెల్త్) ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ప్రముఖ లైఫ్‌స్టైల్ కోచ్ లూక్ కౌటిన్హో పొట్ట ఆరోగ్యాన్ని మునుపటిలా మార్చుకోవడానికి ఏడు రోజుల పాటు పాటించాల్సిన 3 సులువైన చిట్కాలను పంచుకున్నారు.
శరీరంలో రోగాలు రాకుండా ఉండాలన్నా, రోజంతా ఉత్సాహంగా గడపాలన్నా మన పొట్ట లోపలి వ్యవస్థ (గట్ హెల్త్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థ కేవలం మనం తినే ఆహారాన్ని అరిగించుకోవడానికే పరిమితం కాదు. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని నియంత్రించడంలో, మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అలసట వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాగా నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం రకరకాల డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు వాడుతుంటారు. కానీ, కేవలం కొన్ని చిన్నపాటి అలవాట్లను మార్చుకుంటే గట్ హెల్త్‌ని మళ్లీ మెరుగుపరుచుకోవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు చెబుతున్నారు.

ఖరీదైన ప్రొబయోటిక్స్ వద్దు.. సహజ పద్ధతులే ముద్దు!
గట్ హెల్త్‌ని కాపాడుకోవడం అనేది మనం అనుకున్నంత కష్టమైన పని ఏమీ కాదని ప్రముఖ లైఫ్‌స్టైల్ కోచ్, ప్రముఖ రచయిత లూక్ కౌటిన్హో స్పష్టం చేశారు. చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల హెల్త్ ప్రొడక్ట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తారు కానీ, ప్రాథమిక జీవనశైలి అలవాట్లను సరిచేసుకోవడం మర్చిపోతారని ఆయన పేర్కొన్నారు. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే ఎంత ఖరీదైన సప్లిమెంట్లు వాడినా ఆశించిన ఫలితాలు ఉండవని హెచ్చరించారు.
ఒకవేళ తన గట్ హెల్త్‌ని మొదటి నుంచి రీసెట్ చేసుకోవాల్సి వస్తే, ఏడు రోజుల పాటు తాను కచ్చితంగా పాటించే మూడు సాధారణ విషయాలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన వివరించారు.
ఆ 7 రోజులు హోమ్ ఫుడ్ మాత్రమే!
“నేను 7 రోజుల పాటు బయటి ఆహారం తినడం పూర్తిగా ఆపేస్తాను. ప్యాక్ చేసిన ఫుడ్స్, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లను. కేవలం ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని మాత్రమే తీసుకుంటాను. భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని, ఆ ఆహారానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ తింటాను. నోట్లోకి తీసుకున్న ప్రతి ముద్దను దాదాపు ద్రవరూపంలోకి మారేంతవరకు బాగా నమిలి ఆ తర్వాతే మింగుతాను,” అని లూక్ కౌటిన్హో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.
రాత్రి ఆలస్యంగా తినే అలవాటుకు గుడ్ బై!
పొట్ట సమస్యలకు ప్రధాన కారణం రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేయడం. లూక్ కౌటిన్హో అభిప్రాయం ప్రకారం రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య కనీసం 3 నుంచి 4 గంటల వ్యవధి ఉండాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవడానికి పొట్టకు తగినంత సమయం దొరుకుతుంది. దీనివల్ల ఉదయాన్నే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవు.
సూర్యకాంతితోనే ఆరోగ్యం..
లూక్ కౌటిన్హో ప్రకారం.. ఉదయం నిద్ర లేవగానే చేయాల్సిన మొదటి పని ప్రకృతితో కనెక్ట్ అవ్వడం! ఉదయాన్నే వచ్చే సహజమైన సూర్యకాంతి మన శరీరంపై పడేలా చూసుకోవాలి. ఇది మన శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' (జీవ గడియారం) ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ జీవ గడియారానికి, మన పొట్ట ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. సూర్యకాంతి తగలడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉండి, జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
ఈ మూడు సాధారణ సూత్రాలను ఏడు రోజుల పాటు క్రమశిక్షణతో పాటిస్తే పొట్ట ఆరోగ్యంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చని లూక్ కౌటిన్హో సలహా ఇస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


