Milk vs Curd : పాలు వర్సెస్ పెరుగు.. గట్​ హెల్త్​కి ఏది బెస్ట్? వెయిట్​ లాస్​కి ఏది మంచిది?

Gut health foods : భారతీయ ఆహారంలో పాలు, పెరుగు భాగం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్నిచ్చే అమృతం. అయితే వెయిట్ లాస్, జీర్ణక్రియ విషయానికి వస్తే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందో పూర్తి వివరాలతో ఇక్కడ తెలుసుకుందాము..

Published on: Jul 2, 2026, 07:28:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉదయం తాగే గరమ్‌ గరమ్‌ ఛాయ్ నుంచి మధ్యాహ్నం భోజనంలో వడ్డించే థాలీ వరకు.. పాలు, పెరుగు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ రెండింటిలోనూ ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయితే, బరువు తగ్గడం, గట్​ హెల్త్ విషయానికి వస్తే పాలు, పెరుగు శరీరంలో వేర్వేరుగా స్పందిస్తాయి. పాలు శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తూ కండరాల పుష్టికి తోడ్పడితే, పెరుగు ఒక సహజమైన ‘ప్రోబయోటిక్’లా పనిచేస్తూ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. మరి ఫిట్‌గా మారాలనుకునే వారు లేదా గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి విముక్తి పొందాలనుకునే వారు ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాము..

పాలు వర్సెస్​ పెరుగు- గట్​ హెల్త్, వెయిట్​ లాస్​కి ఏది బెస్ట్? (AI generated Image)
పాలు వర్సెస్​ పెరుగు- గట్​ హెల్త్, వెయిట్​ లాస్​కి ఏది బెస్ట్? (AI generated Image)

పాలు వర్సెస్ పెరుగు: పోషకాల వ్యత్యాసం..

పాలు, పెరుగు ఒకే మూలం (పాలు) నుంచి వచ్చినప్పటికీ, తోడు పెట్టే ప్రక్రియ వల్ల పెరుగు గుణాలు పూర్తిగా మారిపోతాయి!

పాలు: యూఎస్‌డీఏ నివేదిక ప్రకారం, హోల్ మిల్క్‌లో ప్రోటీన్ (సుమారు 3.2గ్రా/100మి.లీ) అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాల బలానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డీ, ఫ్యాట్స్ ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి.

పెరుగు: స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అమన్ తెలిపిన వివరాల ప్రకారం, 100 గ్రాముల పెరుగు నుంచి 3.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. పాలు పెరుగుగా మారే క్రమంలో ల్యాక్టోజ్ శాతం తగ్గుతుంది. కాబట్టి ఇది సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియను పెంపొందించే మంచి బ్యాక్టీరియా (లైవ్ కల్చర్స్) పెరుగులో ఎక్కువగా ఉంటుంది.

బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు పాలు ఎలా సహాయపడతాయి?

సరిగ్గా తీసుకుంటే బరువు తగ్గడానికి పాలు అద్భుతమైన ఆప్షన్.

ఆకలిని నియంత్రిస్తుంది: పాలలో ఉండే హై-క్వాలిటీ ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల అనవసరమైన జంక్ ఫుడ్స్ తినకుండా ఉండొచ్చు.

కండరాల పుష్టి: 2008 నాటి ఒక పరిశోధన ప్రకారం, వ్యాయామం చేసిన తర్వాత పాలు తాగడం వల్ల కండరాలు త్వరగా కోలుకుంటాయి.

మెటబాలిజం బూస్ట్: పాలలోని కాల్షియం, విటమిన్ డీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఇది కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుందని 2013 అధ్యయనాలు చెబుతున్నాయి.

గమనిక: బరువు తగ్గడమే మీ లక్ష్యమైతే, ఫ్యాట్ తక్కువగా ఉండే 'లో-ఫ్యాట్' లేదా 'స్కిమ్డ్ మిల్క్' ఎంచుకోండి. చక్కెర ఎక్కువగా ఉండే మిల్క్‌షేక్‌లకు దూరంగా ఉండటం మంచిది.

పెరుగు: పొట్ట ఆరోగ్యానికి సంజీవని..

పెరుగు మన జీర్ణవ్యవస్థకు అత్యంత ఆప్తుడు. ఒక అధ్యయనం ప్రకారం, పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పునరుద్ధరిస్తాయి. ఇది ఆహారం త్వరగా అరగడానికి, పోషకాలను శరీరం గ్రహించడానికి రూట్ మ్యాప్ వేస్తుంది.

ఉబ్బరం, అసిడిటీ దూరం: పెరుగు క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

బొడ్డు చుట్టూ కొవ్వు కరుగుతుంది: ఓ అధ్యయనం ప్రకారం.. పెరుగులోని ప్రోబయోటిక్స్ శరీర మెటబాలిజంను పెంచి, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది లైట్‌గా ఉండటం వల్ల శరీరంపై భారం పడదు.

పాలు మంచివా? పెరుగు మంచిదా?

మీరు పొట్ట ఆరోగ్యం, జీర్ణక్రియ సమస్యల కోసం చూస్తుంటే, ప్రోబయోటిక్ పవర్ ఉన్న పెరుగే విజేత. అదే బరువు తగ్గడం విషయానికి వస్తే రెండూ మేలు చేస్తాయి. పాలు కండరాలను కాపాడితే, పెరుగు పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. ఉదయం పూట లేదా వర్కౌట్ తర్వాత పాలు తాగండి, మధ్యాహ్నం లంచ్ సమయంలో పెరుగు తీసుకోండి.

పాలు, పెరుగు తీసుకోవడానికి సరైన సమయం..

పాలు: ఆయుర్వేదం ప్రకారం పాలను సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తాగడం చాలా మంచిది. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. ఒక సాధారణ వయోజనుడు రోజుకు 500-600 మి.లీ పాలు తీసుకోవచ్చు.

పెరుగు: పెరుగును ఎల్లప్పుడూ పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. రాత్రి వేళల్లో పెరుగు తింటే సైనస్, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పెరుగు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

ఎవరు వేటికి దూరంగా ఉండాలి?

పాలు: ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ (పాలు పడకపోవడం) ఉన్నవారు, చర్మంపై మొటిమల సమస్య తీవ్రంగా ఉన్నవారు పాలను తగ్గించాలి.

పెరుగు: తీవ్రమైన జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్, సైనస్ సమస్యలతో బాధపడేవారు రాత్రి పూట పెరుగు అస్సలు తినకూడదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More