First Car Buying Tips : మొదటిసారి కారు కొంటున్నారా? షోరూమ్‌కు వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి..

 Car Buying Tips : మొదటిసారి కారు కొంటున్నారా? ఏ కారులో ఏ ఫీచర్​ ఉందో అని తెగ వెతికేస్తున్నారా? కారు అంటే కేవలం ఫీచర్లు మాత్రమే కాదని గుర్తుపెట్టుకోండి! మొదటిసారి కారు కొంటున్న సమయంలో చెక్​ చేసుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 27, 2026, 15:30:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే, మొదటిసారి కారు కొనడం అనేది ఒక మధురమైన అనుభూతి మాత్రమే కాదు.. కాస్త గందరగోళంతో కూడిన ప్రక్రియ కూడా. మార్కెట్​లో అన్ని ఆప్షన్లు ఉన్నాయి మరి! బడ్జెట్ నిర్ణయించుకోవడం దగ్గరి నుంచి, డీలర్‌షిప్‌లను సందర్శించడం, టెస్ట్ డ్రైవ్ చేయడం, లోన్లు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్.. ఇలా ఒకటా రెండా? ఎన్నో విషయాలు బుర్రను తొలిచేస్తుంటాయి."అసలు ఎక్కడ మొదలుపెట్టాలి?" అన్న ఆందోళన కూడా ఉంటుంది.

మొదటిసారి కారు కొంటున్నారా? ఇది మీకోసమే.. (HT AUTO)
మొదటిసారి కారు కొంటున్నారా? ఇది మీకోసమే.. (HT AUTO)

మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ కథనమే! మీరు మొదటిసారి కారు కొంటుంటే కచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలను ఇక్కడ చూసేయండి..

మొదటిసారి కారు కొంటున్నారా? ఇది మీకోసమే..

1. మీ అవసరాన్ని గుర్తించండి

ముందుగా అసలు కారు మీకు ఎందుకు అవసరమో స్పష్టత తెచ్చుకోండి. ఆఫీసు ప్రయాణాలకా? కుటుంబంతో కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్లడానికా? లేక కేవలం మీ హోదాను చూపించుకోవడానికా?

మీరు రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో లెక్కేయండి. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం ఉంటుందా లేక కేవలం దగ్గరిలోని మార్కెట్‌కు వెళ్లడానికే వాడుతారా? ఈ అంశాలే మీరు ఏ ఫ్యూయెల్​ టైప్​ని ఎంచుకోవాలో నిర్ణయిస్తాయి.

మీ రోజువారీ ప్రయాణం 20 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే, పెట్రోల్ కారు ఉత్తమం. డీజిల్ లేదా ఈవీ కార్లతో పోలిస్తే వీటి ధర తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 20 కి.మీ ప్రయాణానికి పెట్రోల్ కారుపై ఏడాదికి సుమారు రూ. 60-65 వేలు ఖర్చవుతుంది. అదే డీజిల్ కారు కొనాలంటే ముందే రూ. 2-3 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణం తక్కువైతే పెట్రోల్ వైపే మొగ్గు చూపండి.

2. బాడీ టైప్ - ఏది మీకు సెట్ అవుతుంది?

మీ జీవనశైలిని బట్టి కారు మోడల్‌ను ఎంచుకోవాలి:

సెడాన్: మంచి సౌకర్యం, ఎక్కువ లగేజీ స్పేస్ కావాలనుకునే చిన్న కుటుంబాలకు ఇది సరైన ఛాయిస్.

హ్యాచ్‌బ్యాక్: ఇవి చిన్నగా ఉండి, నగరాల్లో డ్రైవ్ చేయడానికి, పార్కింగ్‌కు చాలా అనువుగా ఉంటాయి. మైలేజీ కూడా ఎక్కువే.

ఎస్‌యూవీ/ఎంపీవీ: రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో ఉండేవారికి లేదా పెద్ద కుటుంబం ఉన్నవారికి ఎస్​యూవీలు, ఎంపీవీలు బాగుంటాయి. వీటిలో సీటింగ్ సామర్థ్యం ఎక్కువ, డ్రైవింగ్ వ్యూ కూడా స్పష్టంగా ఉంటుంది.

3. బడ్జెట్, మెయింటెనెన్స్

కారు ధర అంటే కేవలం కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించే 'ఎక్స్-షోరూమ్' ప్రైజ్​ మాత్రమే కాదని మీకు తెలుసా? దీనికి ఆర్‌టీఓ, ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జీలు తోడై 'ఆన్-రోడ్' ధర వేరుగ ఉంటుంది. దాని గురించి ముందే తెలుసుకోండి.

గోల్డెన్ రూల్: మీ నెలవారీ ఆదాయంలో కారు ఈఎంఐ, ఇన్సూరెన్స్, ఇంధనం, మెయింటెనెన్స్ ఖర్చులు కలిపి 25% మించకూడదు. అంటే మీ జీతం రూ. 75,000 అయితే, కారు కోసం చేసే ఖర్చు రూ. 18,750 లోపే ఉండాలి.

4. కొత్తదా? పాతదా?

కొత్త కారు ఇచ్చే ఆ ఫీల్​, లేటెస్ట్ టెక్నాలజీ, వారంటీలు అద్భుతంగా ఉంటాయి. కానీ బడ్జెట్ తక్కువగా ఉండి, మంచి కారు కావాలనుకుంటే 'ప్రీ-ఓన్డ్' (సెకండ్ హ్యాండ్) కార్లు మంచి ఆప్షన్. అయితే, పాత కారు కొనేటప్పుడు మెకానిక్ చేత క్షుణ్ణంగా తనిఖీ చేయించడం మర్చిపోవద్దు.

5. ఫీచర్లు, భద్రత

చాలామంది కారులో సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్ల కోసం వెంపర్లాడుతుంటారు. కానీ, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పుడు వీటికి బదులుగా.. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ప్రాణాలను కాపాడే ఫీచర్లు. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్‌ను కూడా ఒకసారి పరిశీలించండి.

6. ఇంధన రకం ఎంపిక

పెట్రోల్: తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్.

డీజిల్: మైలేజీ ఎక్కువ, కానీ కారు ధర ఎక్కువ. రోజుకు 50 కి.మీ కంటే ఎక్కువ తిరిగేవారికి ఇది మేలు.

సీఎన్జీ: తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం, కానీ గ్యాస్ స్టేషన్ల వద్ద క్యూలో వేచి ఉండాలి.

ఈవీ: పర్యావరణానికి మంచిది, రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. కానీ ఛార్జింగ్ సదుపాయం చూసుకోవాలి.

7. రీసేల్ వాల్యూ

కొన్నేళ్ల తర్వాత కారును అమ్ముదామని మీకు అనిపిస్తే, ఇప్పుడే మీరు ఎంచుకునే బ్రాండ్ ముఖ్యం. కొన్ని బ్రాండ్లకు మార్కెట్‌లో మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. డీజిల్ కార్ల విషయంలో కాలుష్య నిబంధనలు మారుతున్నందున, భవిష్యత్తులో వాటి రీసేల్ వాల్యూ తగ్గే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.

8. సర్వీస్ నెట్‌వర్క్

మీరు కొనే కారు కంపెనీకి మీ ప్రాంతంలో లేదా చుట్టుపక్కల సర్వీస్ సెంటర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండటం, మెకానిక్ల నైపుణ్యం వంటివి ప్రస్తుత కస్టమర్ల రివ్యూల ద్వారా తెలుసుకోండి.

9. అదనపు ఖర్చులు

కారు కొన్న తర్వాత టైర్లు, బ్యాటరీ, బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ ఫిల్టర్లు వంటివి కాలానుగుణంగా మార్చాల్సి ఉంటుంది. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు రిపేర్ ఖర్చులు భారం కాకుండా ఉండాలంటే 'ఎక్స్​టెండెడ్ వారంటీ' తీసుకోవడం మంచిది.

10. టెస్ట్ డ్రైవ్..

చివరిగా.. కారు నచ్చినా, నచ్చకపోయినా టెస్ట్ డ్రైవ్ మాత్రం కచ్చితంగా చేయండి. సీటింగ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్ ఎలా ఉందో స్వయంగా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే, ఒకటి కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను సంప్రదించి, వారు ఇచ్చే ఆఫర్లను బేరీజు వేసుకోండి. అనవసరమైన యాక్సెసరీల విషయంలో డీలర్లు చెప్పే మాటలు వినొద్దు. వింటే అధికంగా ఖర్చు చేయాల్సిందే.

మీకు నచ్చిన, మీ బడ్జెట్‌కు సరిపోయే కారును ఎంచుకుని మీ ప్రయాణాన్ని ఆనందంగా ప్రారంభించండి!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More