...
...
Next Story

హైస్పీడ్ రైళ్ల ప‌నులు వేగ‌వంతం చేయండి - కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైస్పీడ్ రైళ్లు, రీజినల్ రింగ్ రైలు, కొత్త రైలు మార్గాల మంజూరుపై చర్చించారు.

Published on: Oct 30, 2026, 21:49:23 IST
Advertisement

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన కీలకమైన రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రైలు భవన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా పలు ప్రతిపాదిత రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి
కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి

రాష్ట్రానికి గతంలో ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ - పుణె, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రాథమిక ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించిందని తెలిపారు. ఈ మార్గాల్లో కొన్ని మార్పులు చేర్పులు సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన తుది ప్రతిపాదనలను కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ మూడు ప్రధాన కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అలైన్‌మెంట్‌ను అధికారికంగా ఆమోదించిన వెంటనే భూసేకరణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అలైన్‌మెంట్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.

అనుమతులు మంజూరు చేయండి - సీఎం విజ్ఞప్తి

వికారాబాద్ – కృష్ణా మధ్య ప్రతిపాదించిన 130 కిలోమీటర్ల నూతన రైలు మార్గానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా లభించిన భారీ సున్నపురాయి నిక్షేపాలను ప్రామాణికంగా తీసుకుని, ఆ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే సరుకు రవాణాతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపారు.

దీనితో పాటు డోర్నకల్ - గద్వాల్, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ – జగ్గయ్యపేట (250 కి.మీ.), పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ.), బోధన్ – లాతూర్ (175 కి.మీ.), అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ.) మార్గాలను వెంటనే మంజూరు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ సమీపంలోని అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాలని అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ డిపో ఏర్పాటుకు అవసరమైన 409.1 ఎకరాల స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని గుర్తుచేశారు. ఈ మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోకు త్వరగా అనుమతులు మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks