...
...
Next Story

సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం... సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి - కేటీఆర్

సింగరేణిలో విదేశీ బొగ్గు కొనుగోళ్లు, సోలార్ విద్యుత్ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Updated on: Oct 16, 2026, 17:02:14 IST
Advertisement

సింగరేణి సంస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు.సింగరేణిని వేదికగా చేసుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాష్ట్రంలో శాంతిభద్రతలు, విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. "సింగరేణిలో టన్ను బొగ్గు రూ. 3,800లకే లభిస్తుంటే, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి టన్నుకు రూ. 10,000 నుండి రూ. 12,000 పెట్టి కొనుగోలు చేయడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కేవలం ముడుపులు, కమీషన్లు కొట్టేందుకే ఈ విదేశీ బొగ్గు డ్రామా ఆడుతున్నారు," అని విమర్శించారు.

సింగరేణికి ప్రభుత్వం నుంచి రూ. 60,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకుండా సంస్థను బాద్నామ్ చేస్తున్నారని… ఉత్పత్తిని కావాలనే తగ్గించి రవాణా వ్యవస్థను పడకేయించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే సింగరేణిలో జరిగిన విదేశీ బొగ్గు టెండర్లు, సోలార్ పవర్ కుంభకోణం మరియు ఆయన బావమరిది కొల్లగొట్టిన రూ. 10,000 కోట్ల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. "కేవలం మీడియా ముందు మాట్లాడటం కాదు, నిజాయితీ ఉంటే విచారణకు ఆదేశించు" అని డిమాండ్ చేశారు.

ఈఎంఐ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - కేటీఆర్

కాంగ్రెస్ అధిష్టానానికి ముడుపులు చెల్లించకపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడుతుందని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. "రేవంత్ రెడ్డి ఒక ఈఎంఐ ముఖ్యమంత్రి. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇక్కడ రికవరీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారు. నెలానెలా కమీషన్ల రూపంలో ఈఎంఐ కట్టకపోతే రేవంత్ రెడ్డి సీటును గుంజుకుంటారు. అందుకే ఏఐసీసీకి కప్పం కట్టేందుకే సింగరేణి భుజం మీద తుపాకీ పెట్టి వేల కోట్ల స్కామ్‌లకు పాల్పడుతున్నారు" అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా గోదావరి నీటిని సముద్రంలోకి వృథాగా పోనిచ్చారని కేటీఆర్ ఆరోపించారు. "ఆరు నెలల ముందే కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని మేము మొత్తుకున్నా రేవంత్ వినలేదు. నీళ్లను కిందకు వదిలేసి ఇప్పుడు ఎల్-నీనో పేరు చెప్పి చేతులెత్తేస్తున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, పోతిరెడ్డిపాడు ద్వారా 400 టీఎంసీల నీటిని తరలించి కుప్పం వరకు జలపండగ చేసుకుంటుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తోంది. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కేవలం కాంగ్రెస్ చేతకానితనం తెచ్చిన కరువు" అని మండిపడ్డారు.

పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్తూ, నర్సంపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గాన్ని తానే స్వయంగా దత్తత తీసుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాల మేరకు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని…. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యమని పేర్కొంటూ, త్వరలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks