...
...
Next Story

CII Partnership Summit Visakhapatnam : విశాఖ వేదికగా సీఐఐ సమ్మిట్ - 58 దేశాల ప్రతినిధులు రాక, పెట్టుబడులపై ఫోకస్..!

CII Partnership Summit Visakhapatnam : విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. 58 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ సమ్మిట్‌ ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడులు, 1.47 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

Published on: Nov 10, 2026, 08:05:47 IST
Advertisement

CII Partnership Summit Visakhapatnam 2026 : నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్‌తో విశాఖ వేదికగా ఈ నెల 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుంది. మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలకు నూతన దశాదిశ అందించేలా ఈ పెట్టుబడుల సదస్సు విశాఖలో ఆవిష్కృతం కానుంది.

అమిత్ షా రాక…

విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

కేవలం పెట్టుబడుల ఆకర్షణకు మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ వివిధ అంశాలపై మేథోమథనం నిర్వహించి ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేలా ఈ భాగస్వామ్య సదస్సులో చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం అమిత్ షా సహా కేంద్రమంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికే నమోదు చేసుకున్నారు.

ప్రపంచ మార్కెట్లతో ఏపీ పరిశ్రమల్ని అనుసంధానించటమే లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలిచేలా ఈ సదస్సులో చర్చలు, ఒప్పందాలు జరుగనున్నాయి.

మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, సాంకేతికత, పరస్పర విశ్వాసం, నిపుణుల దార్శనిక ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ చర్చలు సాగనున్నాయి. ప్రపంచ దేశాలతో భారత ఆర్థిక భాగస్వామ్యానికి ప్రధాన వేదికగా ఈ సదస్సును 1995 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

58 దేశాలు…16 మంది విదేశీ మంత్రులు

పెట్టుబడుల సదస్సులో భాగంగా ఈ నెల 11 తేదీన పారిశ్రామిక ప్రతినిధుల మధ్య ముందస్తు సమావేశాలు జరుగనున్నాయి. అదే రోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి అధికారిక విందు ఇవ్వనున్నారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో 12, 13 తేదీల్లో ప్రధాన సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సమాంతరంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ 2026 నిర్వహిస్తారు. 12 తేదీ ఉదయం 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి నారా లోకేష్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి రాబర్టో తదితరులు సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్నారు.

ఇక నవంబర్ 13, సాయంత్రం 4 గంటలకు సదస్సు ముగింపు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, వాల్యుచైన్, క్వాంటం టెక్నాలజీ, సెమీ కండక్టర్ సహా నూతన సాంకేతికతలు, అంతర్జాతీయ సహకారం, నైపుణ్యాలు, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, ఆహార భద్రత, జీవ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి.

గత పెట్టుబడుల సదస్సు సహా వివిధ సందర్భాల్లో ఒప్పందాలను పారిశ్రామిక ప్రాజెక్టులుగా మలిచేందుకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రులు, అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి.

మరో రూ.17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. 2025-26లో దేశంలోనికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.6 శాతం ఏపీ దక్కించుకుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన 6 సన్నాహక ప్రాంతీయ సదస్సుల ద్వారా 194 ఎంఓయూల ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. తద్వారా 1.47 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks