Intermittent fasting : జిమ్‌కి వెళ్లేవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? చేస్తే లాభమా? నష్టమా?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూనే వర్కౌట్లు చేయవచ్చా? ఇది కండరాల ఎదుగుదలకు, ఫ్యాట్ లాస్‌కు ఏ మేరకు ఉపయోగపడుతుంది? వర్కౌట్ చేసేవారు పాటించాల్సిన కీలక నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
బరువు తగ్గడానికైనా, శరీర జీవక్రియను మెరుగుపరుచుకోవడానికైనా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆహార నియమం ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’. మరోవైపు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు కండరాల నిర్మాణం, వేగవంతమైన రికవరీ కోసం హై-ప్రోటీన్ డైట్, వర్కౌట్‌లపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం వ్యక్తమవుతోంది.. "రోజూ జిమ్‌కు వెళ్తూ, కఠినమైన వర్కౌట్లు చేసేవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించవచ్చా?"

దీనికి సమాధానం.. "యెస్" అని నిపుణులు అంటున్నారు. అయితే మీ లక్ష్యాలు ఏంటి? మీరు ఎలాంటి వర్కౌట్లు చేస్తున్నారు? ఈ ఫాస్టింగ్ సమయంలో పోషకాహారాన్ని ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు? అనే అంశాలపైనే మీ ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు.
న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనం ఏం తింటున్నామనే దానికంటే "ఎప్పుడు తింటున్నాం" అనే దానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక ఆహార సమయ పద్ధతి. అయితే సరైన ప్రణాళికతో ఫాస్టింగ్ చేస్తే కండరాలు పెరిగి, కొవ్వు కరుగుతుంది. కానీ, తినే సమయంలో తగినంత పోషకాహారం తీసుకోకపోతే నీరసం రావడం, వర్కౌట్ సరిగ్గా చేయలేకపోవడం, మజిల్ రికవరీ మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ వర్కౌట్లు చేయవచ్చా?
ఫాస్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో లేదా ఇతర వ్యాయామాలు సురక్షితంగా చేయవచ్చు. అయితే, కండరాల రికవరీకి, బాడీ పర్ఫార్మెన్స్‌కు కావలసిన క్యాలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఖచ్చితంగా అందాలి. మీ ఈటింగ్ విండో చాలా తక్కువగా ఉండి, శరీరానికి సరిపడా పోషకాలు ఇవ్వకపోతే ఫాస్టింగ్ వల్ల అనుకున్న ఫలితాలు రాకపోగా నష్టం జరుగుతుంది.
జిమ్‌కు వెళ్లేవారికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు:
ఫ్యాట్ లాస్ (కొవ్వు కరగడం): ఫాస్టింగ్ వల్ల క్యాలరీల వినియోగం తగ్గి, బాడీ ఫ్యాట్ కరుగుతుంది. సరైన ప్రోటీన్ తీసుకుంటూ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే కండరాలు కరగకుండా కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది.
ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది: పరిశోధనల ప్రకారం ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వాడుకునేలా చేస్తుంది.
సులువైన మీల్ ప్లానింగ్: రోజులో పదే పదే తిండి గురించి ఆలోచించకుండా, నిర్ణీత సమయంలో మాత్రమే తినడం వల్ల డైట్ ఫాలో అవ్వడం తేలికవుతుంది.
మెరుగైన మెటబాలిక్ హెల్త్: రక్తంలో చక్కెర స్థాయులు, కొలెస్ట్రాల్, వాపులను తగ్గించడంలో ఇది సాయపడుతుంది.
ఎలాంటి రిస్క్‌లు ఉంటాయి?
వర్కౌట్ పర్ఫార్మెన్స్ తగ్గడం: ఎక్కువ సేపు ఉపవాసం ఉన్న తర్వాత వర్కౌట్ చేస్తే అలసట, తలతిరగడం, నీరసం రావచ్చు.
కండరాల ఎదుగుదల మందగించడం: మజిల్ బిల్డింగ్‌కు తగినన్ని క్యాలరీలు, ప్రోటీన్ అత్యవసరం. ఫాస్టింగ్ వల్ల తక్కువ తింటే కండరాల ఎదుగుదల నెమ్మదిస్తుంది.
నెమ్మదైన రికవరీ: వర్కౌట్ పూర్తయ్యాక సమయానికి పోషకాలు తీసుకోకపోతే మజిల్స్ త్వరగా కోలుకోవు.
ఆకలి, నీరసం: ప్రారంభ వారాల్లో విపరీతమైన ఆకలి, చిరాకు, తలనొప్పి, అలసట రావచ్చు.
ఫాస్టింగ్ పాటించే ఫిట్‌నెస్ ప్రియులకు ముఖ్యమైన టిప్స్..
ప్రోటీన్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి: మీరు తినే సమయంలో నాణ్యమైన ప్రోటీన్‌ను సరిసమానంగా విడదీసి తీసుకోండి. ఇది మజిల్ రిపేర్‌కు చాలా అవసరం.
వర్కౌట్ సమయాన్ని ప్లాన్ చేసుకోండి: ఫాస్టింగ్ పూర్తయ్యే సమయానికి కాస్త ముందు లేదా ఫాస్టింగ్ ముగిసిన వెంటనే వర్కౌట్ ప్లాన్ చేసుకుంటే.. వ్యాయామం పూర్తయిన వెంటనే ఆహారం తీసుకోవడానికి వీలవుతుంది.
హైడ్రేషన్ ముఖ్యం: రోజుమొత్తంలో తగినంత మంచి నీరు తాగాలి. ఎక్కువ సేపు ఫాస్టింగ్ చేసేవారు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కాపాడుకోవాలి.
కార్బోహైడ్రేట్లను నిర్లక్ష్యం చేయకండి: కండరాల్లో గ్లైకోజెన్ భర్తీకి, వర్కౌట్ ఎనర్జీకి కార్బోహైడ్రేట్లు అవసరం. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు డైట్‌లో చేర్చుకోండి.
సరిపడా క్యాలరీలు తీసుకోండి: ఫాస్టింగ్ చేస్తున్నప్పటికీ, మీ వర్కౌట్‌కు, రికవరీకి సరిపడా క్యాలరీలు శరీరానికి అందుతున్నాయో లేదో చూసుకోండి.
ఎవరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు?
ఈ కింది వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండటం లేదా తీవ్ర జాగ్రత్తలు పాటించడం అవసరం:
- గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు
- పిల్లలు, యుక్తవయస్సులో ఉన్నవారు
- ఈటింగ్ డిజార్డర్స్ (ఆహార సంబంధిత సమస్యలు) ఉన్నవారు
- కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు
- వేళకు ఆహారంతో పాటు మందులు వేసుకోవాల్సిన వారు
- వైద్యుల పర్యవేక్షణ లేని మధుమేహం (షుగర్) బాధితులు
కేవలం ఉపవాసం ఉండటం వల్లే ఫిట్‌నెస్ పెరగదు లేదా కండరాలు రావు. తగినంత ప్రోటీన్, క్యాలరీలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి నిద్ర, సరైన రికవరీ మాత్రమే మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతాయి. మీ ప్రధాన లక్ష్యం కండరాల పెంపు అయితే.. కేవలం ఫాస్టింగ్ గంటలు పెంచడం కంటే ఒక వ్యక్తిగత న్యూట్రిషన్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది.
కాగా ఏదైనా పెద్ద డైట్ మార్పులు చేసే ముందు క్వాలిఫైడ్ డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


