Heart attack : ఈ 5 అలవాటు చేసుకుంటే చాలు.. గుండెపోటు ముప్పును జయించినట్టే!
Heart attack prevention : ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్.. గుండెపోటు ముప్పును భారీగా తగ్గించే ఐదు కీలక జీవనశైలి మార్పులను వివరించారు.
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 'హార్ట్ ఫౌండేషన్' విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న (మొత్తం మరణాల్లో) ప్రతి 25 మరణాలలో ఒకటి గుండెపోటు వల్లే సంభవిస్తోంది. సగటున ప్రతి 80 నిమిషాలకు ఒకరు, రోజుకు కనీసం 19 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గణాంకాలు వినడానికే చాలా భయానకంగా ఉన్నాయి.

అయితే, మన గుండెను పదిలంగా కాపాడుకోవడానికి ఎలాంటి మ్యాజిక్ పిల్స్ లేదా ఒకే ఒక్క పరిష్కారం అంటూ ఏదీ లేదు. గుండె ఆరోగ్యం అనేది అనేక రకాల అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, అమెరికాకు చెందిన ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ఎడ్యుకేషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
"ఒక హార్ట్ సర్జన్‌ను అడిగి తెలుసుకోండి.. 60 సెకన్లలో గుండెపోటును ఎలా నివారించవచ్చో" అనే క్యాప్షన్ తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. కేవలం ఒకే ఒక్క నిమిషంలో గుండెపోటు ముప్పును భారీగా తగ్గించే ఐదు అద్భుతమైన లైఫ్ స్టైల్ మార్పులను ఆయన సూచించారు.
డాక్టర్ జెరెమీ లండన్ తన వీడియోలో వివరించిన ఆ 5 గోల్డెన్ రూల్స్ ఇవే:
1. పొగతాగడానికి పూర్తిగా గుడ్ బై చెప్పండి!
గుండె ఆరోగ్యానికి ధూమపానం అత్యంత ప్రమాదకరం. సిగరెట్లు, చుట్టలు మాత్రమే కాదు.. ఈ రోజుల్లో యువత ఫ్యాషన్‌గా భావిస్తున్న వేపింగ్, లేదా గంజాయి వంటి ఏ రకమైన పొగతాగే అలవాటైనా సరే, అది గుండెకు తీవ్ర హాని కలిగిస్తుందని డాక్టర్ జెరెమీ హెచ్చరించారు. వీటన్నింటికీ పూర్తిగా దూరంగా ఉండటమే గుండె రక్షణకు మొదటి మెట్టు.
2. బీపీ చెక్ చేసుకోండి.. నంబర్లను గుర్తుంచుకోండి!
సైలెంట్ కిల్లర్‌గా పిలిచే హై బ్లడ్ ప్రెజర్ లేదా రక్తపోటు గురించి నిర్లక్ష్యం అస్సలు వద్దు. "ఇది చాలా కీలకమైన విషయం. అధిక రక్తపోటు అనేది మన రక్తనాళాల లోపలి పొరను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే బీపీని కొలిచే 'హోమ్ బ్లడ్ ప్రెజర్ కఫ్' కొనుగోలు చేసి, మీ రీడింగ్స్ ఎలా ఉన్నాయో క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలి," అని డాక్టర్ జెరెమీ స్పష్టం చేశారు.
3. కొలెస్ట్రాల్ పరీక్షలు అవసరం..
శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణమని మనందరికీ తెలుసు. అయితే కేవలం సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షలు మాత్రమే సరిపోవని, గుండె ముప్పును ఖచ్చితంగా అంచనా వేసే ApoB (అపోలిపోప్రోటీన్ బి-100), Lp(a) ల్యాబ్ పరీక్షల వివరాలను కూడా తెలుసుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదాన్ని, పక్షవాతం వచ్చే అవకాశాలను ఈ పరీక్షల ద్వారా ముందే గుర్తించవచ్చని మెడికల్ నిపుణులు చెబుతున్నారు.
4. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు అడ్డుకట్ట వేయండి..
మన ఆహారంలో చక్కెర వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీసి, గుండె ధమనులను బలహీనపరుస్తాయి.
5. ఒంటరితనానికి దూరంగా ఉండండి..
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా గుండెకు ఎంతో ముఖ్యం. "మీ సామాజిక బంధాలపై దృష్టి పెట్టండి. ఒంటరితనం అనేది గుండె జబ్బుల ముప్పును పెంచే ఒక అత్యంత శక్తివంతమైన నెగెటివ్ ఫ్యాక్టర్," అని డాక్టర్ జెరెమీ వివరించారు. ఆత్మీయులతో గడపడం, మంచి స్నేహ సంబంధాలను కలిగి ఉండటం గుండెపై ఒత్తిడిని తగ్గించి పరోక్షంగా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
చివరగా, 25 ఏళ్లకు పైగా అనుభవమున్న ఈ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఒకే మాట చెప్పారు – ఎవరైతే ఈ ఐదు విషయాలను తమ జీవితంలో పక్కాగా పాటిస్తారో, వారు గుండెపోటు ముప్పును దాదాపుగా జయించినట్లే, కాలం ఎప్పుడూ వారివైపే ఉంటుంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


