Pregnancy skin care : గర్భధారణ వేళ చర్మంలో మార్పులు.. ఏవి సాధారణం? ఏవి ప్రమాదకరం?
గర్భధారణ సమయంలో హార్మోన్ల వల్ల చర్మంలో అనేక మార్పులు రావడం సహజం. వీటిలో ఏవి ప్రసవం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయో, ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలో చర్మవ్యాధి నిపుణుల మాటల్లో తెలుసుకోండి.
గర్భవతిగా ఉన్న సమయంలో ముఖంపై నల్లటి మచ్చలు వచ్చినా, పొత్తికడుపుపై గీతలు కనిపించినా "పాప లేదా బాబు పుట్టాక అవన్నీ పోతాయిలే" అని ఇంట్లోని పెద్దవాళ్లు చెబుతుంటారు. పెద్దలు చెప్పినట్లుగానే గర్భధారణ సమయంలో చర్మంలో వచ్చే చాలా మార్పులు హార్మోన్ల ప్రభావం వల్ల వచ్చేవే, ప్రసవం తర్వాత సర్దుమణుగుతాయి. అయితే, కొన్ని రకాల చర్మ మార్పులు మాత్రం శరీరంలో దాగున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.

చర్మంలో మార్పులకు కారణాలేంటి?
గర్భధారణ సమయంలో కడుపులోని పిండం ఎదుగుదలకు అనుగుణంగా తల్లి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరగడం, శరీరంలో రక్త ప్రసరణ వేగం మారడం, రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల చర్మంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
"గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే అంతర్గత మార్పులే చర్మంపై ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తాయి," అని జోలీ స్కిన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ నిరూపమ పర్వాందా పేర్కొన్నారు.
ప్రసవం తర్వాత మాయమయ్యే సాధారణ మార్పులు..
గర్భధారణ సమయంలో కనిపించే చాలా రకాల మార్పులు తాత్కాలికమైనవని, వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభయమిస్తున్నారు.
"గర్భధారణ సమయంలో వచ్చే చాలా వరకు చర్మ మార్పులు స్వల్పకాలికమైనవి. ప్రసవం తర్వాత ఇవి క్రమంగా తగ్గిపోతాయి," అని డాక్టర్ నిరూపమ వివరించారు. అవేంటంటే:
హైపర్ పిగ్మంటేషన్ (చర్మం నల్లబడటం): ముఖం, చంకలు, మెడ భాగాల్లో చర్మం నల్లగా మారుతుంది. ఎంఎస్‌హెచ్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల వల్ల చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్ కణాలు ఎక్కువగా ప్రేరేపితమవ్వడమే దీనికి కారణం.
లీనియా నిగ్రా : గర్భధారణ సమయంలో పొత్తికడుపుపై నిలువుగా నల్లటి గీత ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన పిగ్మంటేషన్ మార్పే, ప్రసవానంతరం క్రమంగా మాయమవుతుంది.
స్ట్రెచ్ మార్క్స్ (నలిగిన మచ్చలు): కడుపులోని బిడ్డ ఎదుగుతున్న కొద్దీ చర్మం వేగంగా సాగడం వల్ల పొత్తికడుపు, తొడల భాగాల్లో మచ్చలు ఏర్పడతాయి.
మొటిమలు : హార్మోన్ల వ్యత్యాసాల వల్ల చర్మంలో నూనె (సీబమ్) ఉత్పత్తి పెరిగి ముఖంపై మొటిమలు వస్తుంటాయి.
స్పైడర్ వేన్స్ అండ్ వాపులు: రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల చర్మంపై చిన్న రక్తనాళాలు (స్పైడర్ వేన్స్) ఎర్రటి సాలెగూడులా కనిపిస్తాయి. అలాగే శరీరంలో నీరు చేరడం వల్ల కాళ్లలో స్వల్పంగా వాపులు వస్తుంటాయి.
స్కిన్ టాగ్స్ (చర్మపు పిలికలు): దుస్తులు లేదా చర్మం పరస్పరం రాపిడికి గురయ్యే చోట చిన్న చిన్న చర్మపు పిలికలు ఏర్పడతాయి. ఇవి పూర్తిగా ప్రమాదరహితమైనవి.
ఈ ప్రమాదకర లక్షణాలను తేలిగ్గా తీసిపారేయకండి..
కొన్ని రకాల చర్మ సమస్యలను కేవలం హార్మోన్ల ప్రభావమే అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. "చర్మంపై తీవ్రమైన నొప్పి, దురద, గుల్లలు లేదా బొబ్బలు కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి," అని డాక్టర్ నిరూపమ హెచ్చరించారు. అవేంటంటే:
అరిచేతులు, అరికాళ్లలో తీవ్రమైన దురద: చేతులు, అరికాళ్లలో తట్టుకోలేని దురద ఉంటే దానిని అస్సలు తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇది 'ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ' అనే కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు. దీనికి తక్షణ వైద్య పరీక్షలు అవసరం.
పొత్తికడుపుపై తీవ్రమైన దురద, దద్దుర్లు: పొత్తికడుపుపై విపరీతమైన దురదతో కూడిన దద్దుర్లు వస్తే దానిని ‘పాలిమార్ఫిక్ ఎరప్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’గా అనుమానించాలి.
పొత్తికడుపుపై బొబ్బలు: దురదతో పాటు పొత్తికడుపుపై నీటి బొబ్బలు కనిపిస్తే అది 'పెంఫిగోయిడ్ జెస్టేషనిస్' అనే అరుదైన చర్మ సమస్య కావచ్చు.
స్కిన్ కేర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ ఏ ఆధారిత ‘టాపికల్ రెటినోయిడ్స్’ ఉన్న క్రీమ్‌లను గర్భిణులు అసలు వాడకూడదు. అధిక శాతంలో 'సాలిసిలిక్ యాసిడ్' ఉండే ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


