...
...
Next Story

రెమ్యునరేషన్ వదులుకుంటే 325 కోట్లు వచ్చాయి- ప్రభాస్, అల్లు అర్జున్, ఖాన్స్ కాదు- ఇండియన్ సినిమా కొత్త సుల్తాన్ ఎవరంటే?

Highest Paid Actor In India: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదైంది. పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, అల్లు అర్జున్, ఖాన్ త్రయం హవాకు బ్రేక్ వేసి ఏకంగా రూ. 325 కోట్ల పారితోషికంతో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటుడిగా నిలిచాడు. ఇండియన్ కొత్త సుల్తాన్‌గా మారిన ఆ హీరో ఎవరో చూద్దాం.

Published on: Jun 21, 2026, 20:49:58 IST
Advertisement

India's Highest Paid Actor: ఒక సినిమాకు కోటి రూపాయల పారితోషికం అంటేనే ఒకప్పుడు యావత్ సినీ ప్రపంచం నోరెళ్లబెట్టేది. 1990వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అతిలోక సుందరి శ్రీదేవి తొలిసారిగా కోటి రూపాయల మార్కును అందుకుని సంచలనం సృష్టించారు.

పెద్ద బడ్జెట్ సినిమాల హంగామా

రెమ్యునరేషన్ వదులుకుంటే 325 కోట్లు వచ్చాయి- ప్రభాస్, అల్లు అర్జున్, ఖాన్స్ కాదు- ఇండియన్ సినిమా కొత్త సుల్తాన్ ఎవరంటే?
రెమ్యునరేషన్ వదులుకుంటే 325 కోట్లు వచ్చాయి- ప్రభాస్, అల్లు అర్జున్, ఖాన్స్ కాదు- ఇండియన్ సినిమా కొత్త సుల్తాన్ ఎవరంటే?

ఆ తర్వాత బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయం (షారుఖ్, సల్మాన్, అమీర్) హవా నడిచింది. గత కొన్నేళ్లుగా పెద్ద బడ్జెట్ సినిమాల హంగామా పెరగడంతో రజనీకాంత్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి దక్షిణాది స్టార్లు ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేస్తూ బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు.

అయితే ఈ రేసులో మొన్నటివరకు రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ అల్లు అర్జున్ టాప్ 1 స్థానంలో ఉన్నాడు. కానీ, తాజాగా బాలీవుడ్ మళ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖాన్స్ కాకుండా మరో క్రేజీ హీరో ఈ ఘనత సాధించడం విశేషం.

'ధురంధర్' మ్యాజిక్.. రణ్‌వీర్ ఖాతాలో రూ. 325 కోట్లు

బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా, నటుడిగా రికార్డు సృష్టించారు. ఆయన నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమాలు సాధించిన అసాధారణ విజయమే ఇందుకు కారణం.

ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకుని రెండు భాగాలుగా విడుదలైన ఈ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 3200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా, కేవలం భారతదేశంలోనే రూ. 1900 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

రెమ్యునరేషన్ వదులుకుని.. రిస్క్ చేసి లాభాల్లో వాటా

"థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ షేర్, సక్సెస్ బోనస్‌లతో పాటు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కగడితే రణ్‌వీర్ సింగ్ వాటా ఏకంగా రూ. 325 కోట్లకు చేరింది" అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ భారీ లాభాల్లో సింహభాగం నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ (Jio Studios) సొంతం చేసుకోగా, ఆ తర్వాత ఆదిత్య ధర్ బ్యానర్ బి62 స్టూడియోస్ కైవసం చేసుకుంది. ఒకే ప్రాజెక్ట్ ద్వారా ఒక భారతీయ నటుడు ఇంత పెద్ద మొత్తంలో సంపాదించడం ఇదే తొలిసారి.

షారుఖ్, ప్రభాస్, అల్లు అర్జున్ రికార్డులు బద్దలు

రణ్‌వీర్ సింగ్ రూ. 300 కోట్ల మార్కును దాటకముందు వరకు ఈ రికార్డు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉండేది. ఆయన 2024లో వచ్చిన 'జైలర్' సినిమాకు దాదాపు రూ. 250 కోట్లు అందుకున్నారు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రూ. 200 కోట్లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు రూ. 300 కోట్లు వసూలు చేశారు.

ధురంధర్‌లో రణ్‌వీర్ సింగ్

సుల్తాన్‌గా రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ విషయానికి వస్తే, 2023 నుంచి ఈ రికార్డు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పేరిట భద్రంగా ఉంది. 'పఠాన్', 'జవాన్' చిత్రాల విజయాలతో ఆయన ఒక్కో సినిమాకు రూ. 200 కోట్ల వరకు లాభాల రూపంలో పొందారు. అంతకుముందు 2010వ దశకంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ స్థానాల్లో మారుతూ వచ్చారు. ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి రణ్‌వీర్ సింగ్ సరికొత్త రికార్డుతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో సుల్తాన్‌గా నిలిచారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe