Heart Health : బీపీ పెరిగితే గుండె గోడ చిరిగిపోతుందా? 'అయోర్టిక్ డిసెక్షన్' వివరాలు..
అధిక రక్తపోటు వల్ల గుండెలోని అయోర్టా లోపలి పొర చిరిగిపోయే ప్రమాదకర పరిస్థితినే 'అయోర్టిక్ డిసెక్షన్' అంటారు. ఇది క్షణాల్లో ప్రాణాలు తీయగల అత్యవసర వైద్య పరిస్థితి. దీని లక్షణాలు, చికిత్స, నివారణ మార్గాలపై సమగ్ర కథనం..
మన శరీరంలోని ప్రతీ ప్రధాన అవయవానికి రక్తాన్ని సరఫరా చేసే అతిపెద్ద, అత్యంత కీలకమైన రక్తనాళం గుండె ధమని అయోర్టా. ప్రతీ గుండె స్పందనతో వచ్చే భారీ ఒత్తిడిని తట్టుకునేలా దీని గోడల నిర్మాణం ఉంటుంది. అయితే, ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తికి కూడా ఒక పరిమితి ఉంటుంది. సంవత్సరాల తరబడి అధిక రక్తపోటు ఉన్నా లేదా ఉన్నపళంగా బీపీ విపరీతంగా పెరిగినా, అయోర్టా లోపలి పొర చిరిగిపోయే ప్రమాదం ఉంది. వైద్య పరిభాషలో ఈ ప్రాణాంతకమైన పరిస్థితినే 'అయోర్టిక్ డిసెక్షన్' అని అంటారు.

ఇలా అయోర్టా గోడల్లోని పొరల మధ్యకు రక్తం చొచ్చుకుపోవడం వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. కొన్నిసార్లు అయోర్టా పూర్తిగా పగిలిపోయి క్షణాల్లో మరణం సంభవిస్తుంది. మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే అధిక బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఇది అయోర్టిక్ డిసెక్షన్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
రక్తపోటే ప్రధాన శత్రువు..
అయోర్టిక్ డిసెక్షన్ బారిన పడుతున్న వారిలో దాదాపు 66 శాతం నుంచి 75 శాతం మంది తీవ్రమైన బీపీ సమస్యతో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లక్షలాది మందిపై ఏళ్ల తరబడి జరిపిన పరిశోధనల ప్రకారం.. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు పెరిగే కొద్దీ ఈ ప్రమాద ముప్పు క్రమంగా పెరుగుతూ పోతుంది.
సాధారణంగా పరిగణించే 140/90 mm Hg పరిమితి కంటే తక్కువ బీపీ ఉన్నవారిలో కూడా రక్తపోటు స్వల్పంగా పెరిగినా ఈ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అంటే, బీపీ ఎంత తక్కువగా, అదుపులో ఉంటే అయోర్టా అంత సురక్షితంగా ఉంటుంది.
ఈ సమస్యకు దారితీసే ఇతర కారణాలు..
కేవలం రక్తపోటు మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఈ అయోర్టా పగులుకు దారితీస్తాయి:
అథెరోస్కెలిరోసిస్: రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అవి గట్టిపడటం.
జన్యు/పుట్టుకతో వచ్చే లోపాలు: బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్, మార్ఫాన్ సిండ్రోమ్, ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్ వంటి కనెక్టివ్ టిష్యూ వ్యాధులు.
కుటుంబ చరిత్ర: కుటుంబంలో ఎవరికైనా అయోర్టిక్ అనూరిజం లేదా డిసెక్షన్ ఉంటే ఆ ముప్పు పెరుగుతుంది.
అలవాట్లు: ధూమపానం, ఉత్ప్రేరక మందులు వాడటం, అధిక వయస్సు.
గర్భధారణ: అధిక ముప్పు ఉన్న మహిళల్లో గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు.
ఇప్పటికే అయోర్టా సాగిపోయి బలహీనపడిన (Aneurysm) వారికి బీపీ పెరిగినప్పుడు అది త్వరగా చిరిగిపోయే ప్రమాదం ఉంది.
అత్యవసర సంకేతాలు.. గుండెపోటు అనుకుని పొరపడకండి!
అయోర్టిక్ డిసెక్షన్ చాలా తీవ్రమైన లక్షణాలతో హఠాత్తుగా బయటపడుతుంది. ఛాతీ లేదా వీపు ఎగువ భాగంలో ముక్కలుగా చిరిగిపోతున్నట్లు తీవ్రమైన నొప్పి వస్తుంది.
దీనితో పాటు కడుపునొప్పి, స్పృహ తప్పి పడిపోవడం, ఊపిరి ఆడకపోవడం, పక్షవాతం వచ్చినట్లు ఒకవైపు బలహీనత, చూపు మసకబారడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది దీనిని గుండెపోటు లేదా స్ట్రోక్‌గా పొరబడుతుంటారు. దీనివల్ల నిర్ధారణ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలి.
అత్యవసర చికిత్స విధానం..
ఈ సమస్యను అనుమానించినా లేదా నిర్ధారించినా, వెంటనే బీపీని తగ్గించడం అత్యంత ముఖ్యం. సిటి యాంజియోగ్రఫీ లేదా ట్రాన్స్‌ఈసోఫేగియల్ ఎకోకార్డియోగ్రఫీ ద్వారా సమస్య తీవ్రతను గుర్తిస్తారు.
వైద్యులు ఎస్మోలోల్, లాబెటలోల్ వంటి వేగంగా పనిచేసే బీటా-బ్లాకర్లను, నికార్డిపైన్ లేదా క్లెవిడిపైన్ వంటి వాసోడైలేటర్లతో కలిపి రోగికి అందిస్తారు. ఇది గుండె వేగాన్ని, రక్తపోటును వేగంగా తగ్గించి, అయోర్టాని మరింత చిరిగిపోకుండా నిరోధిస్తుంది. అవసరాన్ని బట్టి అత్యవసర శస్త్రచికిత్స చేసి అయోర్టాని పునర్నిర్మిస్తారు.
ముందస్తు నివారణే శ్రీరామరక్ష!
రక్తపోటును అదుపులో ఉంచుకోవడమే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.
ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకోవాలి.
రోజూ శారీరక వ్యాయామం చేయడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి.
ధూమపానం పూర్తిగా మానెయ్యాలి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
వైద్యుల సలహా మేరకు బీపీ మందులను క్రమం తప్పకుండా వాడాలి.
కుటుంబంలో ఎవరికైనా ఈ తరహా రక్తనాళాల సమస్యలు ఉంటే, ముందుగానే కార్డియాలజిస్ట్‌ను కలిసి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. నిశ్శబ్దంగా శరీరాన్ని దెబ్బతీసే బీపీని అదుపులో ఉంచుకోవడం అంటే కేవలం గుండెపోటును నివారించడమే కాదు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థకు జీవం పోసే మహాధమనిని కాపాడుకోవడమే!
- డా. విక్రమ్ రెడ్డీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథోరాసిస్ సర్జన్, యశోధ హాస్పిటల్స్ హైటెక్ సిటీ, హైదరాబాద్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


