బరువు తగ్గడం కోసం ప్రతి 2-3 గంటలకు ఒకసారి తినడం మంచిదేనా? డాక్టర్​ సూచనలు ఇవి..

బరువు తగ్గడంలో 'పోర్షన్ కంట్రోల్' కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి కొంచెం కొంచెం తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుందని, బరువు తగ్గుతారనే వాదనల్లో శాస్త్రీయత లేదని ముంబైకి చెందిన డాక్టర్ మనన్ వోరా స్పష్టం చేశారు.

Published on: Feb 8, 2026, 08:16:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వెయిట్​ లాస్​ జర్నీలో క్యాలరీలను తగ్గించడం కోసం చాలామంది 'పోర్షన్ కంట్రోల్'పై దృష్టి పెడుతుంటారు. ఇందులో భాగంగా భారీ భోజనానికి బదులుగా, రోజంతా క్రమమైన విరామాల్లో, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునే పద్దతిని అనుసరిస్తుంటారు. అయితే, ఈ పద్ధతి జీవక్రియపై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రతి 2-3 గంటలకు ఒకసారి తినడం మంచిదేనా?
ప్రతి 2-3 గంటలకు ఒకసారి తినడం మంచిదేనా?

ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆరోగ్యకరమైన బరువు నిర్వహణపై కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ, అన్ని కాలాల్లో సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే, నియమిత ఆహార ప్రణాళికల కంటే, సమతుల్య పోషణపైనే దీర్ఘకాలిక బరువు నిర్వహణ ఆధారపడి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.

ప్రతి 2-3 గంటలకు ఒకసారి తినడం వల్ల ఫలితం ఉంటుందా?

ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని, మెటబాలిజం చురుగ్గా మారుతుందని చాలామంది నమ్ముతారు. కానీ, డాక్టర్ మనన్ ప్రకారం ఈ 'మెటబాలిజం హ్యాక్'కు సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

"మెటబాలిజం అనేది మనం రోజుకు ఎన్నిసార్లు తింటున్నామనే దానిపై ఆధారపడి ఉండదు. ఇది మనం తీసుకునే మొత్తం క్యాలరీలు, శారీరక శ్రమ, హార్మోన్లు మజిల్​ మాస్​పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే మొత్తం క్యాలరీల పరిమాణం సమానంగా ఉంటే, మీరు ఎన్నిసార్లు తింటున్నారనేది బరువు తగ్గడంలో పెద్దగా మార్పు చూపదు," అని ఆయన వివరించారు.

నిరంతరం తినడం వల్ల కలిగే నష్టం..

తరచుగా ఏదో ఒకటి తినడం వల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు నిరంతరం చురుగ్గా ఉంటాయి. దీనివల్ల కడుపు నిండిన భావన కలగడం కష్టమవుతుందని, తద్వారా ఆహారంపై క్రేవింగ్స్​ పెరుగుతాయని డాక్టర్ వెల్లడించారు.

మరి ఏది ఉత్తమమైన పద్ధతి?

విభిన్నమైన డైట్ ట్రెండ్స్ మధ్య గందరగోళానికి గురికాకుండా, సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత నమ్మదగిన మార్గమని డాక్టర్ మనన్ సూచించారు.

సమతుల్య ఆహారం ప్రయోజనం..

ఇది ఆకలి హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది, తద్వారా ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి..

"ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏదో మాయాజాలం కాదు. ఇది కొందరికి తక్కువ క్యాలరీలు తీసుకోవడంలో సహాయపడుతుంది కాబట్టే పని చేస్తుంది. అంతే తప్ప దీని వెనుక ప్రత్యేకమైన టైమింగ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవు," అని ఆయన స్పష్టం చేశారు.

బరువు తగ్గడంలో ఏ డైట్ ప్లాన్ అనుసరిస్తున్నామనే దానికంటే, ఎంత స్థిరంగా పాటిస్తున్నామనేదే ముఖ్యం. దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన, స్థిరమైన ఆహారపు అలవాట్లే అసలైన విజేతలని ఆయన ముగించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More