...
...
Next Story

K Bhagyaraj: స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరు- భాగ్యరాజ్ అందించిన సూపర్ హిట్ 6 తెలుగు రీమేక్ సినిమాలు- వెంకటేష్‌వే 3!

Top 6 Telugu Remakes Of K Bhagyaraj: కోలీవుడ్ స్క్రీన్‌ప్లే మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న కె. భాగ్యరాజ్ ఇవాళ మరణించడం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలోకని నెట్టేసింది. 5 దశాబ్దాల పాటు తన సినిమాలతో అలరించారు. అలాంటి నటుడు, రచయిత, దర్శకుడు భాగ్యరాజ్ అందించిన సూపర్ హిట్ 6 తెలుగు రీమేక్ సినిమాలేంటో చూద్దాం.

Published on: Jun 27, 2026, 13:01:07 IST
Advertisement

Top 6 Telugu Remakes Of K Bhagyaraj: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కె. భాగ్యరాజ్ పేరు వినపడగానే సగటు సినిమా అభిమానికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన అద్భుతమైన స్క్రీన్‌ప్లే చాతుర్యం. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న మనస్పర్థలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన శైలి ప్రత్యేకం.

గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత

స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరు- భాగ్యరాజ్ అందించిన సూపర్ హిట్ 6 తెలుగు రీమేక్ సినిమాలు- వెంకటేష్‌వే 3!
స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరు- భాగ్యరాజ్ అందించిన సూపర్ హిట్ 6 తెలుగు రీమేక్ సినిమాలు- వెంకటేష్‌వే 3!

అందుకే భాగ్యరాజ్‌ను కోలీవుడ్ స్క్రీన్‌ప్లే మాంత్రికుడు అని, కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే అని ముద్దుగా పిలుచుకుంటారు. హీరోగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఐదు దశబ్దాల పాటు విశేష సేవలు అందించిన కె భాగ్యరాజ్ (73) ఇవాళ (జూన్ 27) ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. దాంతో తెలుగు, తమిళ సినీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

హీరోల కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు

ఈ నేపథ్యంలో భాగ్యరాజ్ నటుడిగా, దర్శకత్వం వహించిన సినిమాల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో భాగ్యరాజ్ సృష్టించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు టాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించాయి. విక్టరీ వెంకటేష్, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ వంటి స్టార్ హీరోల కెరీర్‌ను భాగ్యరాజ్ రీమేక్ చిత్రాలు సరికొత్త మలుపు తిప్పడమే కాకుండా భారీ కలెక్షన్స్ సాధించాయి. అలా భాగ్యరాజ్ అందించిన సూపర్ హిట్ 6 తెలుగు రీమేక్ సినిమాలు ఏంటో చూద్దాం.

తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన కె. భాగ్యరాజ్ సినిమాల టాప్ 6 రీమేక్స్ ఇవే:

1. రాధా కల్యాణం (1981) – మూలం: అంద ఏలు నాట్కల్

హీరోయిన్ పెళ్లయిన తర్వాత తన మాజీ ప్రేమికుడిని మర్చిపోలేక ఇబ్బంది పడటం, అది గమనించిన భర్త ఆమెను తిరిగి ప్రేమికుడికి అప్పగించాలని చూడటం.. ఈ పాయింట్ అప్పట్లో ఒక సంచలనం. భాగ్యరాజ్ రాసిన క్లైమాక్స్ డైలాగులు తెలుగులోనూ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాయి. ఈ సినిమా చంద్రమోహన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

2. మూడు ముళ్లు (1983) – మూలం: ముంధానై ముడిచ్చు

తమిళనాట రికార్డుల వేట సాగించిన ‘ముంధానై ముడిచ్చు’ సినిమాను తెలుగులో ‘మూడు ముళ్లు’ పేరుతో రీమేక్ చేశారు. విశేషమేమిటంటే, ఈ తెలుగు వెర్షన్‌కు కూడా కె. భాగ్యరాజ్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఇందులో చంద్రమోహన్, రాధిక జంటగా నటించారు.

ఒక పల్లెటూరి అమ్మాయి (రాధిక) తాను ఇష్టపడిన సిటీ బాబును (చంద్రమోహన్) పెళ్లి చేసుకోవడానికి పన్నాగం పన్ని సక్సెస్ కావడం, ఆ తర్వాత వారి మధ్య వచ్చే ఈగో గొడవలను భాగ్యరాజ్ ఎంతో వినోదాత్మకంగా చూపించారు. ఈ సినిమాలో వచ్చే 'మునగకాయ' (Drumstick) కామెడీ సీన్ అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్.

3. సుందరకాండ (1992) – మూలం: సుందర కాండమ్

భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘సుందర కాండమ్’ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘సుందరకాండ’ పేరుతో రీమేక్ చేశారు. ఒక కాలేజీ లెక్చరర్ (వెంకటేష్)ను ఒక అల్లరి స్టూడెంట్ (అపర్ణ సేన్) ప్రేమించడం, ఓ అనాథ (మీనా)ను లెక్చరర్ పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తమిళ ఒరిజినల్‌లో భాగ్యరాజ్ లెక్చరర్ పాత్ర పోషించగా, తెలుగులో వెంకటేష్ తనదైన స్టైల్ కామెడీ, సెంటిమెంట్‌తో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా సాధించిన ఘన విజయం వెంకటేష్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది.

4. అబ్బాయిగారు (1993) – మూలం: ఎంగ చిన్న రాసా

భాగ్యరాజ్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ‘ఎంగ చిన్న రాసా’ కథ ఆధారంగా తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ‘అబ్బాయిగారు’ చిత్రాన్ని రూపొందించారు. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ చిత్రంలో జయచిత్ర సవతి తల్లి పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో మెప్పించారు.

కన్నతల్లి కంటే ఎక్కువగా సవతి తల్లిని నమ్మే ఒక అమాయకపు జమీందార్ కొడుకు కథ ఇది. భార్య ఎంట్రీతో ఆ ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఈవీవీ మార్క్ కామెడీతో సాగుతుంది. భాగ్యరాజ్ రాసిన బలమైన మదర్ సెంటిమెంట్ కథే ఈ సినిమాను తెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిపింది.

5. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)- మూలం: తైకులమే తైకులమే

భాగ్యరాజ్ కథ అందించిన ‘తైకులమే తైకులమే’ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, సౌందర్య, వినీత ప్రధాన పాత్రల్లో ఈవీవీ సత్యనారాయణ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ (1996) పేరుతో రీమేక్ చేశారు.

పిల్లలు లేని ఒక భర్త, పరిస్థితుల ప్రభావం వల్ల మరో మహిళ ద్వారా సంతానాన్ని పొంది, ఆమెను తన ఇంట్లోనే పనిమనిషిగా ఉంచాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఈ కథాంశం. ఈ సున్నితమైన పాయింట్‌కు ఈవీవీ సత్యనారాయణ మార్క్ వినోదాన్ని జోడించి క్లాసిక్ హిట్‌గా మార్చారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కామెడీ ట్రాక్ ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు స్క్రీన్లకు అతుక్కుపోతారు.

6. అత్తింట్లో అద్దె మొగుడు (1991) – మూలం: ఇదు నమ్మ ఆలు

భాగ్యరాజ్ కథను అందించి, నటించిన ‘ఇదు నమ్మ ఆలు’ సినిమాను తెలుగులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ‘అత్తింట్లో అద్దె మొగుడు’ పేరుతో రీమేక్ చేశారు. నిరోషా కథానాయికగా నటించారు.

తమను మోసం చేయాలని చూసే ఒక గర్విష్టి మామ (కోట శ్రీనివాసరావు) ఇంటికి అల్లుడిగా వెళ్లి, అతనికి బుద్ధి చెప్పే పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. మిడిల్ క్లాస్ పాలిటిక్స్, ఫ్యామిలీ ఈగోలను భాగ్యరాజ్ ఎంత పదునుగా రాస్తారో చెప్పడానికి ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ.

భాగ్యరాజ్ ప్రత్యేకత

కాగా, కె భాగ్యరాజ్ కథల ప్రత్యేకత ఏంటంటే.. అందులో భయంకరమైన విలన్లు ఉండరు కానీ, కేవలం పరిస్థితులు, మనుషుల బలహీనతలు మాత్రమే పాత్రలను నడిపిస్తాయి. అందుకే ఆయన రాసిన కథలు ఏ భాషలో రీమేక్ చేసినా, దశాబ్దాలు దాటినా నేటికీ సజీవంగా, సరికొత్తగా అనిపిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe