Gunde Ninda Gudi Gantalu Today Episode: శివపై కేసు వాపసుకు ప్రభావతి షరతు.. సుమతి పెళ్లి రద్దు.. రోహిణికి గుణ షాక్
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో శివపై కేసు వాపసు తీసుకోవడానికి ప్రభావతి అంగీకరిస్తూనే ఓ కండిషన్ పెడుతుంది. అటు సుమతి పెళ్లి రద్దవుతుంది. రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుంది.
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాను ఇంటి నుంచి పంపించేస్తేనే తాను శివపై కేసు వాపసు తీసుకుంటానని ప్రభావతి అంటుంది. అటు శివ కారణంగా సుమతి పెళ్లి రద్దవుతుంది. ఇటు దినేష్ తో చేతులు కలిపిన గుణ రోహిణికి పెద్ద షాకే ఇస్తాడు.

పోలీస్ స్టేషన్‌కు బాలు, మీనా.. పార్వతిని వదిలేసిన పోలీసులు
గుండె నిండా గుడి గంటలు బుధవారం (ఏప్రిల్ 1) ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ కు పార్వతి కోసం బాలు, మీనా వెళ్లే సీన్ తో మొదలవుతుంది. అక్కడ పోలీసులను వాళ్లు వేడుకుంటారు. శివ ఎక్కడున్నాడో తెలియదని, అతని తల్లిని వదిలేయాలని అడుగుతారు. మొదట పోలీసులు బెట్టు చేస్తారు. తర్వాత ఒక రోజు గడువు ఇచ్చి.. శివను తీసుకురాకపోతే కేసు నమోదు చేస్తామని చెప్పి పార్వతిని వదిలేస్తారు.
సుమతి పెళ్లి రద్దు
ఇటు పార్వతిని ఇంటికి తీసుకురాగానే మరో షాక్ తగులుతుంది. సుమతిని పెళ్లి చేసుకోబోయే వాళ్లు ఇంటికి వస్తారు. ఇంత జరిగాక ఈ పెళ్లి జరగదని వాళ్లు చెబుతారు. ఈ విషయంలో తమ తల్లిదండ్రుల మాటే తన మాట అని అబ్బాయి కూడా స్పష్టం చేస్తాడు. శివ చేసిన తప్పుకు సుమతిని ఎందుకు శిక్షిస్తారంటూ బాలు, మీనా వేడుకున్న వాళ్లు కనికరించరు. ఇక ఈ పెళ్లి జరగదని చెప్పి వెళ్లిపోతారు. అటు సుమతి కూడా తనకూ ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది.
రోహిణిని పిలిచిన గుణ.. దినేష్‌తో కలిసి కొత్త ప్లాన్
మరోవైపు రోహిణిని మరింత ఇరికించడానికి గుణ ప్లాన్ చేస్తాడు. రోహిణి, విద్యను పిలిపిస్తాడు. దినేష్ ను నాలుగు రోజులుగా తీవ్రంగా కొట్టడంతో గుండె పట్టుకొని పడిపోయాడని, వారంలో చనిపోయే ప్రమాదం ఉందని అంటాడు.
అదే జరిగితే పోలీసులు పట్టుకుంటారని, అప్పుడే మీ పేరే చెబుతానని వాళ్లను బెదిరిస్తాడు. అలా జరగకూడదంటే కేరళ తీసుకెళ్లి వైద్యం చేయించాలని, దానికి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. చేసేది లేక రోహిణి సరే అంటుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత దినేష్ తో గుణ చేతులు కలిపి ఇదంతా చేశాడని అర్థం అవుతుంది.
లాయర్‌ను కలిసిన బాలు, మీనా
శివను కేసు నుంచి బయట పడేయడానికి లాయర్ ను కలవడానికి వెళ్తారు బాలు, మీనా. జరిగినదంతా చెబుతారు. కేసు లేకుండా చేయొచ్చు కానీ ఖర్చువుతుంది.. అలా కాకూడదంటే కేసు పెట్టిన వాళ్లే విత్ డ్రా చేసుకోవాలి అని లాయర్ చెబుతాడు. కేసు పెట్టింది మీ అమ్మే కదా.. ఆమెను అడిగి చూడమంటాడు. అది కుదరదేమో అని బాలు అంటే.. ఓసారి ప్రయత్నించి చూడమని చెప్పి పంపిస్తాడు.
సత్యంను వేడుకున్న మీనా
దీంతో బాలు, మీనా ఇంటికి వస్తారు. శివ కేసు గురించి సత్యంతో మాట్లాడతారు. ఈ విషయంలో తాను చేసేది ఏముందని సత్యం అంటాడు. మీనా కుటుంబం ఈ కేసు వల్ల ఎంతలా ఇబ్బంది పడుతోందో చెప్పడంతోపాటు సుమతి పెళ్లి రద్దయిన విషయం కూడా చెప్పడంతో సత్యం షాక్ తింటాడు. కేసు వాపసు తీసుకోమని అమ్మకు చెప్పమని బాలు అంటాడు.
అడ్డుకున్న మనోజ్.. గతం గుర్తు చేసుకున్న బాలు
అది విన్న మనోజ్ అడ్డుపడతాడు. శివలాంటి వాళ్లు జైల్లోనే ఉండాలంటాడు. దీంతో బాలు అతని కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. చిన్నవాళ్ల జీవితం నాశనం చేయడం నీకు అలవాటే కదా అని అంటాడు. అప్పుడు చిన్నతనంలో మనోజ్ వల్ల బాలు జైలుకెళ్లడం చూపిస్తారు.
తన అన్నను తాను చంపి ఆ నేరాన్ని బాలుపై మనోజ్ వేయడం చూడొచ్చు. అది గుర్తొచ్చి మనోజ్ సైలెంట్ గా వెళ్లిపోతాడు. అతడు ఎందుకలా వెళ్లిపోయాడని మీనా అడిగినా అసలు నిజం చెప్పకుండా బాలు దాటేస్తాడు.
ప్రభావతిని కేసు వెనక్కి తీసుకోమన్న సత్యం
బాలు, మీనా వేడుకోవడంతో కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి సత్యం వెళ్తాడు. అతన్ని చూడగానే ప్రభావతి సంతోషిస్తుంది. తనను తీసుకెళ్లడానికి వచ్చాడని అనుకుంటుంది. కానీ సత్యం మాత్రం జరిగిన విషయం చెప్పి కేసు వెనక్కి తీసుకోవాలని అడుగుతాడు. ప్రభావతి వినదు. నువ్వు క్షమిస్తే ఓ కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అని సత్యం అనడంతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది.
మీనాను ఇంటి నుంచి పంపించేయాలన్న ప్రభావతి
సరే కేసు వెనక్కి తీసుకుంటానని ప్రభావతి అంటుంది. కానీ ఒక్క షరతు అంటూ ఆ పూలమ్ముకునే మీనాను ఇంట్లో నుంచి పంపించేయాలని చెబుతుంది. మీనా వెళ్లిపోతే బాలు పరిస్థితి ఏంటి అని సత్యం అంటాడు. వాడి సంగతి తనకు అనవసరం.. దొంగల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తన ఇంట్లో ఉండకూడదని ప్రభావతి స్పష్టం చేస్తుంది. దీంతో సత్యం షాక్ తింటాడు. కామాక్షి ముందు నిన్ను కొట్టలేక వెళ్లిపోతున్నాను అని అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


