లేటుగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తుంటే.. మీరేమీ గొప్ప వారు కాదు! ఈ అలవాటుతో అనేక ఆరోగ్య సమస్యలు..

Bad sleeping habits : రాత్రి వేళల్లో ఆలస్యంగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా మేల్కొనడం అలవాటుగా మారిందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు, శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Published on: Jul 17, 2026, 06:48:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా, ఉదయాన్నే అలారం కంటే ముందే మేల్కొంటే తాము ఆరోగ్యంగానే ఉన్నామని, తగినంత నిద్రపోయామని భ్రమపడుతుంటారు. అయితే ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం తక్షణమే కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఈ స్లీపింగ్​ హాబిట్స్​తో అనేక సమస్యలు!
ఈ స్లీపింగ్​ హాబిట్స్​తో అనేక సమస్యలు!

సాధారణంగా వయోజనులకు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిరంతరం ఆలస్యంగా పడుకుంటూ, త్వరగా లేవడం వల్ల మెదడు కోలుకోవడానికి, జ్ఞాపకశక్తిని బలోపేతం చేసుకోవడానికి, శారీరక శ్రమను దూరం చేయడానికి తగిన సమయం దొరకదు. దీనివల్ల ఏర్పడే నిద్ర లేమి.. కాలక్రమేణా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని నోయిడాలోని సైమ్‌మేట్ హెల్త్‌కేర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, న్యూరోమాడ్యులేషన్ నిపుణులు డాక్టర్ సమంత్ దార్శి పేర్కొన్నారు.

"నిద్ర లేమి అనేది కేవలం నీరసానికి మాత్రమే పరిమితం కాదు. మెదడు తనను తాను పునరుద్ధరించుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి, జ్ఞాపకాలను భద్రపరచడానికి తగినంత నిద్ర అవసరం. నిద్ర కరువైతే ఒత్తిడి స్థాయిలు పెరగడం, ఏకాగ్రత లోపించడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల పనితీరు కూడా మందగిస్తుంది" అని డాక్టర్ సమంత్ దార్శి వివరించారు.

నిద్ర తగ్గితే ఎందుకు ప్రమాదం?

మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సహజమైన సమయం నిద్ర మాత్రమే. ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడులోని వ్యర్థాలు శుభ్రపడతాయి, కణాలు పునరుజ్జీవం పొందుతాయి, హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఎప్పుడైతే మనం నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తామో, అప్పుడు ఈ ప్రక్రియలన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఇది స్వల్పకాలికంగానే కాకుండా దీర్ఘకాలికంగానూ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

శరీరం ఇచ్చే ప్రాథమిక హెచ్చరికలు ఇవే!

బిజీ లైఫ్‌స్టైల్ వల్లే అలసటగా ఉందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిద్ర లేమి వల్ల కూడా కావచ్చు! మీ శరీరం ఇచ్చే ఈ కింది ప్రాథమిక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ దార్శి సూచిస్తున్నారు:

  • ఎంత విశ్రాంతి తీసుకున్నా ఇంకా అలసటగా అనిపించడం
  • రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి కాఫీలపై ఆధారపడటం
  • పగటిపూట తరచూ కునుకు తీయడం
  • దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం
  • సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం
  • ఉత్పాదకత తగ్గడం

సమయానికి నిద్ర అలవాట్లను మార్చుకోకపోతే ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారుతాయి.

మూడ్ మారిపోతుంది జాగ్రత్త!

మన భావోద్వేగాలను నియంత్రించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది.

"చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, ఆందోళన పెరగడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వంటి మార్పులు నిద్ర లేమి వల్లే జరుగుతాయి. ఎందుకంటే నిద్ర తగ్గడం వల్ల మూడ్‌ను నియంత్రించే డోపమైన్, సెరటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరు దెబ్బతింటుంది," అని డాక్టర్ దార్శి చెప్పారు.

దీనివల్ల మనుషులు చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ఓపిక నశించడం, రోజువారీ పనులకే తీవ్రమైన ఒత్తిడికి లోనవడం జరుగుతుంది.

మెదడు చురుకుదనం తగ్గుతుంది..

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలికంగా నిద్ర కరువైతే ఈ కింది సమస్యలు వస్తాయని డాక్టర్ దార్శి హెచ్చరిస్తున్నారు:

  • మతిమరుపు పెరగడం
  • ఏకాగ్రత లోపించడం
  • ప్రతిస్పందించే సమయం ఆలస్యం కావడం
  • కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఇబ్బంది
  • సృజనాత్మకత తగ్గడం

దీర్ఘకాలంలో ఇది డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, జ్ఞాపకశక్తి పూర్తిగా క్షీణించే ప్రమాదానికి దారితీస్తుంది.

శారీరక ఆరోగ్యంపై దెబ్బ..

నిద్ర లేమి ప్రభావం కేవలం మెదడుపైనే కాదు, మొత్తం శరీరంపై పడుతుంది. దీనివల్ల కలిగే నష్టాలను డాక్టర్ దార్శి ఇలా వివరించారు:

  • రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది
  • రక్తపోటు పెరుగుతుంది
  • ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది
  • టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ

కాబట్టి మెటబాలిజం, గుండె ఆరోగ్యం బాగుండాలంటే సరైన నిద్ర తప్పనిసరి.

త్వరగా ఎందుకు మేల్కొంటారు?

ఆలస్యంగా పడుకున్నా సరే, అనుకున్న సమయం కంటే ముందే మెలకువ రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

"తీవ్రమైన ఒత్తిడి, రాత్రి వేళల్లో స్క్రీన్ టైమ్ (మొబైల్, టీవీ చూడటం), కాఫీలు ఎక్కువగా తాగడం, షిఫ్ట్ డ్యూటీలు లేదా గుర్తించని నిద్ర రుగ్మతలు ఇందుకు కారణం కావచ్చు. కొన్నిసార్లు మానసిక ఆందోళన లేదా డిప్రెషన్ వల్ల కూడా ఉదయాన్నే త్వరగా మెలకువ వచ్చేస్తుంది," అని డాక్టర్ దార్శి పేర్కొన్నారు.

నిద్రను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు..

కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో నిద్ర లేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం డాక్టర్ దార్శి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు:

  • ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి.
  • పడుకునే సమయాన్ని, ఉదయం లేచే సమయాన్ని రోజూ ఒకేలా పాటించాలి.
  • పడుకోవడానికి ముందు మొబైల్, లాప్‌టాప్ స్క్రీన్లకు దూరంగా ఉండాలి.
  • సాయంత్రం వేళల్లో కేఫీన్ (కాఫీ, టీ) తీసుకోవడం తగ్గించాలి.
  • పడకగది ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.

వీకెండ్స్ ఎక్కువ సమయం నిద్రపోయి, వారమంతా ఉన్న నిద్ర లేమిని భర్తీ చేయవచ్చని అనుకోవడం పొరపాటు. నిలకడగా రోజూ నిద్రపోవడమే ముఖ్యం.

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

ఎప్పుడో ఒకసారి నిద్ర పట్టకపోవడం సహజం, కానీ వారాల తరబడి రాత్రి లేటుగా పడుకుని, ఉదయాన్నే త్వరగా మెలకువ రావడం, దాంతో పాటు నిరంతరం నిరాశగా ఉండటం లేదా ఆందోళన వేధిస్తుంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ప్రారంభంలోనే దీనికి గల కారణాలను తెలుసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్య సమస్యల నుంచి, ఇతర నిద్ర రుగ్మతల నుంచి సులభంగా బయటపడవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More