'సంచార్ సాథి' యాప్ తొలగించుకునే వెసులుబాటు ఉంది: కేంద్ర మంత్రి సింధియా క్లారిటీ

అన్ని మొబైల్ ఫోన్లలో 'సంచార్ సాథి' (Sanchar Saathi) యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు, గోప్యత ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు. 

Published on: Dec 2, 2025, 14:14:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మోసాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'సంచార్ సాథి' యాప్‌ను 90 రోజుల్లోగా అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలపై రాజకీయంగా, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాన్ని తీవ్రంగా ఖండించాయి.

'సంచార్ సాథి' యాప్ తొలగించుకునే వెసులుబాటు ఉంది: కేంద్ర మంత్రి సింధియా క్లారిటీ (PTI)
'సంచార్ సాథి' యాప్ తొలగించుకునే వెసులుబాటు ఉంది: కేంద్ర మంత్రి సింధియా క్లారిటీ (PTI)

ఈ నేపథ్యంలో, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం దీనిపై వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న ఈ యాప్ ఐచ్ఛికం (Optional) మాత్రమేనని, వినియోగదారులు దాన్ని తమ పరికరాల నుంచి తొలగించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.

“... మీకు 'సంచార్ సాథి' వద్దు అనుకుంటే, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఐచ్ఛికం. ఈ యాప్‌ను ప్రజలకు పరిచయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే, దీన్ని తమ ఫోన్లలో ఉంచుకోవాలా లేదా అన్నది పూర్తిగా వినియోగదారుల ఇష్టం” అని సింధియా విలేకరులతో అన్నారు.

నేపథ్యం ఇదీ:

మోసాలను గుర్తించేందుకు రూపొందించిన ఈ 'సంచార్ సాథి' యాప్‌ను 90 రోజుల్లోగా అన్ని కొత్త పరికరాలలో ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) ఫోన్ తయారీదారులు, దిగుమతిదారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ప్రతిపక్ష ఎంపీలు ఈ తప్పనిసరి ఇన్‌స్టాలేషన్‌పై తీవ్ర నిరసనలు తెలిపారు.

మరోవైపు, ఈ ఆదేశాలను పాటించడానికి అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ నిరాకరిస్తోందని, ఆ విషయాన్ని ఢిల్లీకి తెలియజేయాలని యోచిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

'స్నూపింగ్ యాప్' ఉపసంహరించుకోవాలి: కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 2న విలేకరులతో మాట్లాడిన ఆమె.. 'సంచార్ సాథి'ని "స్నూపింగ్ యాప్" (గూఢచర్యం చేసే యాప్)గా అభివర్ణించారు. పౌరుల గోప్యత హక్కును ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఈ యాప్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

“సంచార్ సాథి అనేది పచ్చి స్నూపింగ్ యాప్, దీని ఉద్దేశం హాస్యాస్పదంగా ఉంది. పౌరులకు గోప్యత హక్కు ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందేశాలు పంపుకునేటప్పుడు ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనించకుండా ఉండే గోప్యత హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలి” అని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలని కేంద్రం చూస్తోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

“ఇది కేవలం ఫోన్‌లో గూఢచర్యం చేయడం మాత్రమే కాదు. ప్రతి విషయంలోనూ ఈ దేశాన్ని నియంతృత్వ దేశంగా మారుస్తున్నారు. పార్లమెంట్ ఎందుకు పనిచేయడం లేదు? ఎందుకంటే ప్రభుత్వం ఏ అంశంపైనా చర్చించడానికి నిరాకరిస్తోంది. ప్రతిపక్షాన్ని నిందించడం చాలా సులభం, కానీ వారు దేనిపైనా చర్చకు అనుమతించడం లేదు. అది ప్రజాస్వామ్యం కాదు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం అంటే చర్చ అని, భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని ప్రియాంక గాంధీ అన్నారు. "మోసాలను రిపోర్ట్ చేయడానికీ, భారతదేశ పౌరులందరూ తమ ఫోన్లలో ఏం చేస్తున్నారో చూడడానికీ మధ్య చాలా సన్నని గీత ఉంది. మనం ఇలా పనిచేయకూడదు. మోసాలను సమర్థవంతంగా నివేదించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. సైబర్‌ సెక్యూరిటీపై మేము విస్తృతంగా చర్చించాం. సైబర్ భద్రత అవసరమే, కానీ దాని కోసం ప్రతి పౌరుడి ఫోన్ లోకి వెళ్లడానికి సాకుగా చూపకూడదు. ఏ పౌరుడు కూడా దీనికి సంతోషించరని నేను భావిస్తున్నాను” అని ఆమె అన్నారు.

రాజ్యసభలోనూ నిరసన

ఈ యాప్ వివాదంపై చర్చించేందుకు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రూల్ 267 కింద ఈ అంశంపై చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఘాటుగా స్పందించారు. ముందే లోడ్ చేసి, తొలగించడానికి వీలు లేని యాప్ ఒక "డిస్టోపియన్ టూల్" (ప్రతికూల భవిష్యత్తును సూచించే సాధనం) అని వ్యాఖ్యానించారు.

“బిగ్ బ్రదర్ మనల్ని చూడకూడదు. ఈ DoT ఆదేశం రాజ్యాంగ వ్యతిరేకం. గోప్యత హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరచిన ప్రాథమిక జీవించే హక్కు, స్వేచ్ఛలో అంతర్భాగం. తొలగించడానికి వీలు లేని విధంగా ముందే లోడ్ చేసిన ప్రభుత్వ యాప్ ప్రతి భారతీయుడిని పర్యవేక్షించే ఒక డిస్టోపియన్ టూల్. ఇది ప్రతి పౌరుడి కదలికలు, సంభాషణలు, నిర్ణయాలను గమనించే సాధనం అవుతుంది” అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

DoT నోటిఫికేషన్లో ఏముంది?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం:

మోసాలను గుర్తించేందుకు రూపొందించిన 'సంచార్ సాథి' యాప్‌ను 90 రోజుల్లోగా భారతదేశంలో ఉపయోగించేందుకు ఉద్దేశించిన అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలి.

భారతదేశంలో వినియోగించే అన్ని మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీదారులు, దిగుమతిదారులు ఈ ఆదేశాలు జారీ చేసిన 120 రోజుల్లోగా DoTకి కంప్లైన్స్ రిపోర్ట్‌లను సమర్పించాలి.

ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023, అలాగే టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్, 2024 (సవరించిన విధంగా), ఇతర వర్తించే చట్టాల కింద చర్యలు తీసుకుంటారు.

ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి. DoT సవరించేవరకు లేదా ఉపసంహరించుకునే వరకు అమలులో ఉంటాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More