కళ్ల ముందే మంటల్లో కాలిబూడిదైన ఊరు.. బాధితులకు కొత్త ఇళ్లు, ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం
సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ఘోరమైన ఘటన జరిగింది. కళ్ల ముందే గిరిజనులకు చెందిన ఊరు కాలి బూడిదైంది. దాదాపు ఊరు మెుత్తం రోడ్డు మీద పడింది.
సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. కానీ ఓ ఊర్లో ఈ సమయంలో విషాదం నెలకొన్నది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. మన్యంలో ఉన్న ఈ తండాలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. దాదాపు ఊరు ఊరంతా కాలి బూడిదైన పరిస్థితి.

ఈ ఘోరమైన ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారు. తమకు చెందిన వస్తువులన్నీ కళ్ల ముందే కాలి బూడిదైపోయాయి. గిరిజనులు బిక్కుబిక్కుమంటూ చూశారు. సరకులు కొనుగోలు చేసేందుకు కొందరు గ్రామస్థులు తుని పట్టణానికి వెళ్లారు. మరికొందరు ఊర్లోనే ఉన్నారు. తుని నుంచి వచ్చేసరికి ఊరు ఊరంతా కాలిపోయింది. అక్కడే ఉన్న గ్రామస్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి ఊరంతా కాలిపోయింది. గ్యాస్ బండ పేలిందని కొందరు, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అగ్ని వ్యాపిస్తూ.. 38 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రతిపాడు ఎమ్మెల్యే సార్లంకపల్లెకు వచ్చి బాధితులను పరామర్శించారు. ఆహారం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
బాధితులకు కొత్త ఇళ్లు
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందన్నారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వివరించారు హోం మంత్రి అనిత, ఇతర అధికారులు.
బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని చంద్రబాబు ఆదేశించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు నేడు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలన్నారు.
ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలన్నారు. బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


