Sign in

అంబటి రాంబాబు మెడకు సంక్రాంతి లక్కీ లాటరీ కేసు.. బయటకు వస్తారనుకునేలోపే..

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట అక్రమ వసూళ్లు చేశారనే కేసులో పీటీ వారంట్ జారీ అయింది.

Published on: Feb 12, 2026, 09:44:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. బెయిల్ వచ్చిందనే సంబరపడేలోపే.. మరో కేసు మెడకు చుట్టుకుంది. అంబటిపై గుంటూరు నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అంబటి అనుచరులు ఆనందపడ్డారు. కానీ ఆయనపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గతంలో నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి సత్తెనపల్లి పోలీసులు ఆయనను గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో హాజరుపరచనున్నారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ లాటరీ ముసుగులో రాంబాబు వసూళ్లకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఫిర్యాదులు అందాయి. అతని నాయకత్వంలో లాటరీ టిక్కెట్లు అమ్ముడయ్యాయని, గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు ఈ టిక్కెట్ల అమ్మకాలను సులభతరం చేశారని ఆరోపణలు వచ్చాయి.

2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి జనసేన నాయకులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను అనుసరించి జనవరి 16, 2023న సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజా పీటీ వారెంట్ జారీ చేశారు.

అంబటి రాంబాబు మంత్రి హోదాలో సత్తెనపల్లిలో 2023 జనవరిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తన నియోజకవర్గ పరిధిలో లాటరీ టికెట్లకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పింఛనుదారుల దగ్గర నుంచి రూ.200 చొప్పున తీసుకుని రెండేసి లాటరీ టిక్కెట్లు ఇచ్చారని చర్చ నడిచింది. సంక్రాంతి రోజున లాటరీ తీసి బహుమతులను అందజేశారు. ఇలా లాటరీలు తీయడం చట్టవిరుద్ధమని జనసేన పార్టీ నేత గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులోనే తాజాగా పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఈ నెల 18లోగా ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేశారనే కేసులో రిమాండ్ విధించారు. దీంతో ఆయనను మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. బుధవారం ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ పత్రాలను తీసుకుని ఆయన తరఫు న్యాయవాదులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లారు. ఇదే సమయంలో సంక్రాంతి లాటరీ టికెట్ల వ్యవహారంలో పీటీ వారంట్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ కారణంగా అంబటి రాంబాబును విడుదల చేయలేదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More