తిరుపతిలో భద్రతా వైఫల్యం - శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం..!
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతాలోపం కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సిబ్బంది కళ్లుగప్పి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించాడు. 3 గంటలపాటు శ్రమించిన భద్రతా సిబ్బంది… అతడిని కిందికి దించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే లోపలికి వెళ్లిపోయాడు. అంతేకాకుండా ఆలయ గోపురంపైకి ఎక్కి కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు.

సదరు వ్యక్తిని గమనించిన సిబ్బంది అక్కడికి చేరుకొని కిందికి దింపే ప్రయత్నం చేసింది. కానీ 3 గంటలపాటు వారిని ఇబ్బందికి గురి చేశాడు. ఆ తర్వాత కిందికి దింపగా… అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తిని నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు.
టీటీడీ ఈవో సమీక్ష - కీలక ఆదేశాలు:
టీటీడీ అనుబంధ ఆలయాల్లో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, అందుకు అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి విచ్చేసే దివ్యాంగ భక్తులు సౌకర్యంగా రాకపోకలు సాగించేందుకు చెక్క బల్లలతో బల్లపరుపు (వుడెన్ ర్యాంప్) ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లు, తాగునీరు తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు చంటి పిల్లలకు తల్లులు సౌకర్యవంతంగా పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు వచ్చే రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లు, భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద లోహాలను గుర్తించే భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు.
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే అరికట్టాలని, నార్త్ మాడ, సౌత్ మాడ వీధుల్లో డ్రైనేజీ సక్రమంగా ఉండేలా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ మహా రథంకు సంబంధించి బీహెచ్ ఈఎల్ అధికారులతో సంప్రదించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. స్వామి వారు విహరించే వాహనాలు, తండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా సంబంధిత ఆలయాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనుబంధ ఆలయాలలో భక్తుల రద్దీకి తగ్గట్లు అవసరమైన పార్కింగ్ , మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు.
పౌర్ణమి గరుడసేవ రద్దు:
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 3వ తేదీన పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడసేవ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనింంచాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

