విచ్చలవిడిగా నకిలీ లిక్కర్ అమ్మకాలు.. మరీ ఇంత దుర్మార్గమా...? వైఎస్ జగన్ ఫైర్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృతమైందని ఆరోపించారు. ఇలాంటి మాఫియాను ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. డైవర్షన్‌లో భాగంగానే జోగి రమేష్‌పై ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు.
నకిలీ మద్యం వ్యవస్థీకృతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి మాఫియాను ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. నకిలీ మద్యం తయారీ కోసం చిన్నపాటి పరిశ్రమలనే ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వంలోని వ్యక్తులే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని.. వాళ్లే బెల్టుషాపులు పెట్టి అమ్ముతున్నారని ఆరోపించారు. బెల్టుషాపులు కాకుండా ఇల్లీగల్ పర్మిట్‌రూమ్‌లు కూడా నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.
డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా బయటకు వచ్చిందన్నారు. ఒక్క మొలకలచెరువులోనే 20 వేలకు పైగా నకిటీ మద్యం బాటిళ్లు దొరికాయని గుర్తు చేశారు. మరో 8వేల బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని పట్టుకున్నారని చెప్పారు. 1,050 లీటర్ల స్పిరిట్ కూడా దొరికిందని… ఒకవేళ పట్టుబడకుంటే వేల లీటర్ల నకిలీ మద్యం తయారీ జరిగేదని అభిప్రాయపడ్డారు.
లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు..? జగన్
విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడిందని జగన్ చెప్పారు. పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె. నెల్లూరులోనూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు బయటపడ్డాయని గుర్తు చేశారు. పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడన్న జగన్… ఆర్గనైజ్డ్‌గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేశ్‌కు మాత్రమే సాధ్యమని ధ్వజమెత్తారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలెన్నో అని అన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబుకు తెలిసింది అది ఒక్కటే అని కామెంట్స్ చేశారు.
“డైవర్షన్‌లో భాగంగా ఎదుటివారిపై వాళ్లే బురదజల్లుతారు. నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డిది కీలకపాత్ర. నకిలీ లిక్కర్ బయటపడిన తర్వాత ఏ ఒక్క షాపులోనూ తనిఖీ చేయలేదు. జనార్దన్‌రావుపై లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? మీ కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వస్తుంది…?” అని వైఎస్ జగన్ నిలదీశారు.
డైవర్షన్‌లో భాగంగానే జోగి రమేష్‌పై ఆరోపణలు చేశారని జగన్ చెప్పారు. జనార్దన్‌తో పరిచయం లేదని జోగి రమేష్ క్లియర్‌గా చెప్పారన్నారు. తన రెండు ఫోన్లు కూడా చూపించాడని… వీళ్లే ఫేక్ చాట్‌ను క్రియేట్ చేసి బురదజల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఎవిడెన్స్‌ను క్రియేట్ చేయడం దారుణమన్న జగన్… ఇటీవల లిక్కర్ స్కాం కేసులో రూ.11 కోట్లు సీజ్ చేసినట్లు హడావిడి చేశారని విమర్శనాస్త్రాలను సంధించారు.
2020లోనే అదానీ డేటా సెంటర్‌కు ఒప్పందం చేసుకున్నామని వైఎస్ జగన్ చెప్పారు. ఆ తర్వాత అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశామన్నారు. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తెచ్చేందుకు కూడా అంకురార్పణ చేశామని తెలిపారు. అదానీ, వైసీపీ, కేంద్రం కృషి లేకుంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చేది కాదని జగన్ వ్యాఖ్యానించారు. కానీ కూటమి పాలనలో రాష్ట్రాన్ని ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా పాలిస్తున్నారని… పెర్ఫార్మెన్స్‌లో చంద్రబాబు వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అని దుయ్యబట్టారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

