Crime news : కన్నతండ్రిని చంపిన లేడీ పోలీస్- మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! తన ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఓ మహిళ, కొన్నేళ్ల క్రితం తన తండ్రిని పక్కా ప్లాన్‌తో చంపేసింది. ప్రేమ పెళ్లి ఫెయిల్ అవ్వడంతో, ఇప్పుడు ఆమె భర్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగినది మొత్తం చెప్పేశాడు!
అది 2023, ఏప్రిల్ 25వ తేదీ ఉదయం. మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల పోలీస్ అధికారి జయంత్ బల్లవార్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కుమార్తె ఆర్య (ఈమె కూడా పోలీస్ శాఖలోనే పనిచేస్తోంది) ప్రేమగా తండ్రికి మిల్క్‌షేక్ ఇచ్చింది. అది తాగిన తర్వాత, కొద్దిసేపటికి ఆయన జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయి ప్రాణాలు విడిచారు. అప్పట్లో అది అనారోగ్యంతో జరిగిన సహజ మరణంగానే అందరూ భావించారు. కానీ, మూడేళ్ల తర్వాత ఈ కేసులో బయటపడిన నిజాలు పోలీసులనే విస్మయానికి గురిచేస్తున్నాయి.

ప్రేమ కోసం అడ్డు తొలగించుకోవాలని..
పోలీసుల కథనం ప్రకారం.. ఆర్య బల్లవార్ 2022 నుంచి ఆశిష్ షెడ్మాకే అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే, ఈ సంబంధాన్ని తండ్రి జయంత్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తండ్రిని ఎలాగైనా వదిలించుకోవాలని ఆర్య, ఆశిష్ ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగానే ఆర్య తన బంధువు చైతన్య గెడమ్ (22) సహాయం కోరింది. విషం సంపాదించి పెట్టినందుకు అతనికి రూ. 5,000 కూడా చెల్లించింది. మరొక వ్యక్తి (ఇంకా పేరు వెల్లడించలేదు) ఆ విషాన్ని వీరికి సరఫరా చేశాడు.
ఆ రోజు ఏం జరిగిందంటే?
పథకం ప్రకారం.. జయంత్ డ్యూటీకి బయలుదేరే ముందు ఆర్య ఆ విషాన్ని మిల్క్‌షేక్‌లో కలిపి తండ్రికి ఇచ్చింది. అది తాగిన ఆయన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విషం ప్రభావం చూపడం మొదలైంది. ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోవడంతో, అందరూ అది సహజ మరణమే అనుకున్నారు. అనుమానం రాకపోవడంతో అప్పట్లో పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు! దీనితో కేసు అక్కడితో ముగిసిపోయిందని అంతా భావించారు.
పెళ్లి విఫలం.. బయటపడ్డ రహస్యం!
తండ్రి మరణం తర్వాత ఆర్య, ఆశిష్ వివాహం చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎంతో కాలం సాఫీగా సాగలేదు. ఆశిష్ క్రమశిక్షణారాహిత్యం కారణంగా పోలీస్ ట్రైనింగ్ నుంచి డిస్మిస్ అయ్యాడు. అటు ఆర్య కూడా అత్తగారింటికి వెళ్లడానికి నిరాకరించి, తన తల్లి ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయాలపై దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.
చివరికి గత వారం ఈ కేసులో ఊహించని మలుపు తిరిగింది. భార్యతో గొడవపడిన ఆశిష్, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మూడేళ్ల క్రితం తన మామగారిని తన భార్యే విషం పెట్టి చంపిందని, ఆ ప్లాన్‌లో తానూ భాగస్వామినని ఒప్పుకున్నాడు!
"నా భార్యే తన తండ్రికి విషం ఇచ్చింది. దీని కోసం తన బంధువు సాయంతో విషం తెప్పించుకున్నాము," అని ఆశిష్ పోలీసులకు వివరించాడు.
ముగ్గురు అరెస్ట్.. లోతైన విచారణ!
ఆశిష్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆర్య బల్లవార్, ఆమె భర్త ఆశిష్ షెడ్మాకే, బంధువు చైతన్యతో పాటు విషం సరఫరా చేసిన నాలుగో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నలుగురూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
కన్నతండ్రిని, అది కూడా తోటి పోలీస్ అధికారిని ఇలా కూతురే పథకం ప్రకారం అంతమొందించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


