Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతిని బ్లాక్‌మెయిల్ చేసిన బాలు.. రోహిణి తాళి తాకట్టు.. కామాక్షికి 2 లక్షలు
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 14 ఎపిసోడ్ లో ప్రభావతి అడ్డంగా దొరికిపోవడంతో తన రూ.5 లక్షలు ఇవ్వాలని బాలు డిమాండ్ చేస్తాడు. లేదంటే పోలీస్ కేసు పెడతానని అంటాడు. దీంతో రోహిణి తన తాళి తాకట్టు పెడుతుంది.
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో అందరి ముందూ ప్రభావతి దోషిలా నిలబడాల్సి వస్తుంది. అదే అదునుగా తన డబ్బు తిరిగి తీసుకోవడానికి బాలు తల్లిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఇది అటు ఇటు తిరిగీ తన మెడకు చుట్టుకునేలా ఉందనుకున్న రోహిణి తన తాళి తాకట్టు పెట్టి ఆ రూ.2 లక్షలను కామాక్షికి ఇస్తుంది.

అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 14) ఎపిసోడ్ ప్రభావతిని బాలు, మీనా నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ఆ రూ.2 లక్షలు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయో చెబుతారు. శివ మీద కేసు వాపసు తీసుకోవడానికి లాయర్ నుంచి రూ.2 లక్షలు తీసుకుందని చెప్పడంతో సత్యం సహా ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు.
దీంతో సత్యం ఆమెను దారుణంగా తిడతాడు. అసలు నువ్వు ఆడ పుట్టుకే పుట్టావా.. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా అంటూ మండిపడతాడు. అయినా ప్రభావతి మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది.
కేసు వేస్తానంటూ డబ్బు డిమాండ్ చేసిన బాలు
దీంతో బాలు రంగంలోకి దిగుతాడు. నువ్వు చేసిన పని వల్ల తనకు రూ.5 లక్షల నష్టం జరిగిందని, అది నువ్వే ఇవ్వాలని తల్లిని డిమాండ్ చేస్తాడు. లేదంటే నువ్వు లాయర్ దగ్గర రూ.2 లక్షలు లంచం తీసుకున్నావని కేసు వేస్తానంటాడు. దీంతో ప్రభావతి భయపడుతుంది. అటు సత్యం కూడా బాలుకు నువ్వు ఆ డబ్బు ఇచ్చి తీరాల్సిందే అని స్పష్టం చేస్తాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని అంటున్నా పట్టించుకోడు.
మనోజ్, రోహిణిలను డబ్బు ఏర్పాటు చేయాలన్న ప్రభావతి
ప్రభావతిలో టెన్షన్ మొదలవుతుంది. రాత్రి నిద్ర కూడా పట్టదు. నేరుగా మనోజ్, రోహిణి దగ్గరికి వెళ్తుంది. మొదట మనోజ్ ను డబ్బు ఏర్పాటు చేయాలని అడుగుతుంది. కానీ అంత డబ్బు తన దగ్గర లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆమె రోహిణి వైపు చూస్తుంది.
మలేషియాలో ఉన్న మీ నాన్నను అడిగి తీసుకురావచ్చు కదా అని అంటుంది. దీంతో రోహిణి షాక్ తింటుంది. వెంటనే ఫోన్ మాట్లాడమని అంటే.. ఇప్పుడే ట్రై చేశానని, కలవలేదని చెబుతుంది. మనమే మలేషియా వెళ్దాం.. ఓ కోటో, రెండు కోట్లో తెచ్చేసుకుందామని ప్రభావతి అనడంతో రోహిణి బిక్క మొహం వేస్తుంది.
పోలీసు కంప్లైంట్ ఇస్తానన్న ప్రభావతి.. వణికిపోయిన రోహిణి
అదంతా కుదరదని రోహిణి, మనోజ్ చెప్పడంతో ఇక వేరే దారి లేక పోలీసు కేసు వేస్తానని అంటుంది. వాళ్లు ఆ దొంగను పట్టుకొని రూ.2 లక్షలు రాబడితే.. కనీసం వాటినైనా బాలుకు ఇచ్చేస్తానంటుంది. అది విని రోహిణి వణికిపోతుంది. పోలీసు కేసు వేయొద్దని, అలా చేస్తే అందులో సగం డబ్బు వాళ్లే నొక్కేస్తారని, ఇంటి గుట్టు వీధిలో పడుతుందని ఏదేదో చెబుతుంది. అయినా ప్రభావతి వినదు. మనోజ్ కూడా కేసు వేయమనే చెబుతాడు. ప్రభావతి వెళ్లిపోతుంది.
రోహిణిలో మొదలైన టెన్షన్
ఇటు రోహిణిలో టెన్షన్ మొదలవుతుంది. విద్యను కలిసి జరిగిన విషయం చెబుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా.. నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావంటూ విద్య ఆమెకు క్లాస్ పీకుతుంది. అంటే నేను తప్పు చేశానా అని రోహిణి అడుగుతుంది. ఈ గండం నుంచి బయటపడటానికి తాళి తాకట్టు పెట్టి ఆ రూ.2 లక్షలు కామాక్షికి తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. నువ్వే దొంగనని చెబుతావా అని విద్య అడుగుతుంది. తన దగ్గర మరో ఐడియా ఉందని అంటుంది.
తాళి తాకట్టు పెట్టి కామాక్షికి రూ.2 లక్షలు
ఇద్దరూ కలిసి షాపుకి వెళ్లి తాళి తాకట్టు పెడతారు. ఆమె ఓ రోల్డ్ గోల్డ్ తాళి చేయించుకుంటుంది. తర్వాత కామాక్షి ఇంటికి వెళ్లి ఆమెను మెల్లగా బుట్టలోకి దింపుతుంది. మిమ్మల్ని చూస్తే తన తల్లి గుర్తుకు వస్తుందని, మీతో మాట్లాడితే తన ఒత్తిడంతా పోతుంది అంటుంది. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితి వివరిస్తుంది. కేసు వేస్తే మంచిదే అని కామాక్షి కూడా అంటుంది.
అలా చేస్తే ఇంటి పరువు పోతుంది.. నేను నా తాళి తాకట్టు పెట్టి రూ.2 లక్షలు తెచ్చాను.. ఇవి ఇంట్లో ఇచ్చేసి పోయిన డబ్బు తిరిగి దొరకిందని చెప్పండి.. అత్తయ్య బాగుంటే చాలు.. మీనాపై దొంగతనం ముద్ర కూడా పోతుంది అని కామాక్షిని రోహిణి కన్విన్స్ చేస్తుంది. ఆమె సరే అంటూ రోహిణిని మెచ్చుకుంటుంది.
ఇటు తల్లిని చూసి బాలు దొంగతనం ఎలా చేయాలో మీనాకు చెబుతుంటాడు. అంటే నేను దొంగనా అని ఆమె అంటుంది. అసలు దొంగ ఎవరో త్వరలోనే తెలుస్తుంది అని చెబుతుంది. అప్పుడే కామాక్షి ఇంటికి వస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


