Sign in

పైరసీ చేసేవాళ్లనే కాదు చూసేవాళ్లనూ అరెస్ట్ చేయాలి‍-భ‌యం పుట్టించాలి-ఐబొమ్మ ర‌వి రాబిన్ హుడ్‌? ఎంత అజ్ఞానం: ఆర్జీవీ ఫైర్

ఐబొమ్మ పైరేట్ వెబ్ సైట్ ఓనర్ ఇమ్మడి రవిని 'రాబిన్ హుడ్' తో పోలుస్తున్న వారిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. వాళ్ల అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Published on: Nov 22, 2025, 15:28:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పైరేట్ వెబ్ సైట్ ఐబొమ్మ నడుపుతున్న ఇమ్మడి రవిని ఈ వారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తర్వాత కొందరు ప్రేక్షకులు రవి చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ కు మద్దతు తెలుపుతూ, అతన్ని రాబిన్ హుడ్ తో పోల్చారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలాంటి వారిపై విరుచుకుపడ్డారు. వారి అజ్ఞానాన్ని ఎత్తిచూపారు.

రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ

ఆర్జీవీ ఫైర్

ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్, ఇమ్మడి రవి, పైరసీపై రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో రియాక్టయ్యారు. ‘‘పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం వల్లనో లేదా పోలీసుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వల్లనో కాదు. పైరసీ చేసిన సినిమాను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నంత కాలం, వారికి సేవ చేయడానికి 'రవి'లు ఎప్పుడూ ఉంటారు’’ అని ఆర్జీవీ ఎక్స్ లో పెద్ద పోస్టు పంచుకున్నారు.

రాబిన్ హుడ్

‘‘హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, రవి మద్దతుదారులు అతన్ని గర్వంగా రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారు. తాము ఏదో నోబెల్ బహుమతి గెలుచుకునే గొప్ప లాజిక్‌ను కనుగొన్నట్లుగా ఫీలవుతున్నారు. రాబిన్ హుడ్ హీరో కాదు. అతను ప్రపంచంలోనే మొట్టమొదటిగా నమోదైన ఉగ్రవాది. ధనవంతుల నుండి దోచుకుని, వాళ్లను చంపి, లేని వారికి ఇస్తాడు. ధనవంతులు చేసిన ఏకైక నేరం వారు ధనవంతులు కావడం మాత్రమే.

ఆర్థికంగా విజయం సాధించడాన్ని దొంగతనం, హత్యతో శిక్షించదగిన నేరంగా భావించేంతగా ఒక వ్యక్తి ఎంత నీచంగా ఉండాలో ఊహించండి. దొంగిలించిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారు అనే ఒకే ఒక్క కారణంతో ఒక నేరస్థుడిని "సాధువు"గా చూపించడానికి చాలా అజ్ఞానం కావాలి’’ అని రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు.

ఆ లాజిక్ ఏంటీ?

‘‘సినిమా ఖరీదైందా? అయితే పైరసీ సమర్థనీయం. పాప్‌కార్న్ ధర ఎక్కువ ఉందా? అయితే సినిమాను లీక్ చేయండి. టికెట్ల రేట్ అధికమా? అయితే కంటెంట్‌ను దొంగిలించండి.. ఇదే వాళ్ల లాజిక్. ఈ లాజిక్ ప్రకారం ఒక బీఎండబ్ల్యూ ఖరీదైనదైతే, మీరు షోరూమ్‌ను దోచుకుని ఆ కార్లన్నింటినీ స్లమ్‌లోని ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి. నగలు ఖరీదైనవా? దుకాణాన్ని దోచుకుని ఉచితంగా పంచిపెట్టండి. ఈ లాజిక్ అన్ని వస్తువులకు వర్తిస్తుంది. ఈ రకమైన ఆలోచన సామాజిక పతనానికి, అరాచకానికి దారి తీస్తుంది’’ అని ఆర్జీవీ మండిపడ్డారు.

నాలాంటి వాళ్లు

‘‘ప్రజలు ఏదో నైతిక విప్లవం కారణంగా పైరసీ కంటెంట్‌ను చూడరు. ప్రధానంగా సౌలభ్యం కోసమే చూస్తారు. కొందరికి ఇది డబ్బు ఆదా కావచ్చు. థియేటర్‌కు వెళ్లడం కంటే ఒక లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయవచ్చని చాలా మంది భావిస్తారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా నాతో సహా ఇదే కారణంతో పైరసీ కంటెంట్‌ను చూస్తారు’’ అని ఆర్జీవీ పోస్ట్ లో పేర్కొన్నారు.

చూసేవాళ్లను అరెస్ట్

‘‘పైరసీని ఆపడానికి ఎవరైనా సీరియస్‌గా ఉంటే, నిజమైన పరిష్కారం ఒక్కటే ఉంది. సరఫరా చేసేవారిని (సప్లయర్‌ను) నేరస్థులుగా పరిగణించడంతో పాటు, చూసేవారిని (వ్యూయర్‌ను) కూడా నేరస్థులుగా పరిగణించాలి. ఎందుకంటే పైరేట్ రహస్య డిజిటల్ ప్రాంతాల వెనుక దాగి ఉంటాడు కాబట్టి అతన్ని పట్టుకోవడం కష్టం. కానీ చూసేవారిని పట్టుకోవడం సులభం’’ అని ఆర్జీవీ పోస్టు చేశారు.

‘‘పైరసీ కంటెంట్‌ను చూస్తున్న ఓ 100 మందిని అరెస్టు చేసి, వారి పేర్లను బహిరంగంగా ప్రకటించండి. అప్పుడు హఠాత్తుగా అందరూ సినిమా లింక్‌ను చూడటం లేదా ఫార్వార్డ్ చేయడం అనేది అక్రమ రవాణా లేదా దొంగతనం చేసిన వస్తువులను స్వీకరించడంతో సమానం అని గ్రహిస్తారు. ఇక్కడ భయం పనిచేస్తుంది. నైతికత పనిచేయదు’’ అని ఆర్జీవీ ఎండ్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More