Sign in

Brazil vs Norway : 'నార్వే' గండం గట్టెక్కని బ్రెజిల్- టోర్నీ​ నుంచి ఔట్.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్​మర్!

Neymar : ఫిఫా ప్రపంచకప్ 2026లో సంచలనం. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో రెండు సూపర్‌ గోల్స్‌తో చెలరేగడంతో.. ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు నెయ్​మర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు కన్నీటి వీడ్కోలు పలికాడు.

Published on: Jul 6, 2026, 05:48:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన బ్రెజిల్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. అమెరికా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే 2-1 తేడాతో బ్రెజిల్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 1990 తర్వాత ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ ఇంత త్వరగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఓటమి అనంతరం ఇంటర్నేషనల్​ ఫుట్​బాల్​కి విడ్కోలు పలుకుతున్నట్టు బ్రెజిల్​ స్టార్ ప్లేయర్ నెయ్​మర్ ప్రకటించాడు.

ఓటమి తర్వాత బ్రెజిల్ ఆటగాళ్ల భావోద్వేగాలు.. (AFP)
ఓటమి తర్వాత బ్రెజిల్ ఆటగాళ్ల భావోద్వేగాలు.. (AFP)

హాలాండ్ విశ్వరూపం.. నైలాండ్ అద్భుతం!

నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ తన అద్భుత ఆటతీరుతో బ్రెజిల్ డిఫెన్స్‌ను ముక్కలు చేశాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన రెండు గోల్స్‌తో కలిపి ఈ టోర్నీలో హాలాండ్ మొత్తం 7 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా లియోనల్ మెస్సి, కిలియన్ ఎంబాపె సరసన నిలిచాడు.

మరోవైపు నార్వే గోల్‌కీపర్ ఓర్లాన్ నైలాండ్ కొండంత అడ్డుగోడలా నిలిచి బ్రెజిల్ ఫిఫా వరల్డ్​ కప్ 2026 కలలను భగ్నం చేశాడు. మ్యాచ్ మొదటి సగభాగంలో బ్రెజిల్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను బ్రూనో గుయిమారెస్ గోల్‌గా మలచకుండా నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా వినీషియస్ జూనియర్, మార్టినెల్లి కొట్టిన ప్రమాదకరమైన షాట్లను జీవం పణంగా పెట్టి ఆపాడు.

ఉత్కంఠ రేపిన సమరం.. చివరి నిమిషాల్లో మలుపులు!

మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. థర్డ్ మినిట్‌లోనే నార్వే ఆటగాడు పాట్రిక్ బెర్గ్ గోల్ చేసినప్పటికీ, అది ఆఫ్‌సైడ్‌గా తేలింది. బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోట్టి గాయపడిన లూకాస్ ప్యాకెటా స్థానంలో గాబ్రియేల్ మార్టినెల్లిని బరిలోకి దించారు. ఇరు జట్ల డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో ఫస్ట్ హాఫ్ సున్నా-సున్నా (0-0)తో ముగిసింది.

రెండో సగభాగంలో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్​మర్ 67వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే, 79వ నిమిషంలో నార్వేకు చెందిన షెల్డెరప్ లెఫ్ట్ వింగ్ నుంచి అందించిన క్రాస్‌ను అందుకున్న హాలాండ్, బ్రెజిల్ డిఫెండర్ గాబ్రియేల్‌ను అధిగమిస్తూ అద్భుతమైన హెడర్‌తో నార్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఆ తర్వాత మ్యాచ్ 90వ నిమిషంలో హాలాండ్ బాక్స్ అంచు నుంచి బుల్లెట్ లాంటి షాట్‌తో రెండో గోల్ సాధించడంతో నార్వే విజయం ఖాయమైంది. ఇంజూరీ టైమ్ 10వ నిమిషంలో బ్రెజిల్‌కు పెనాల్టీ లభించగా, నెయ్​మర్ దానిని గోల్‌గా మార్చినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది.

క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్ లేదా మెక్సికో

ప్రపంచకప్‌ నాకౌట్ దశలో బ్రెజిల్ జట్టు ఒక యూరోపియన్ ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడం ఇది వరుసగా ఆరోసారి కావడం గమనార్హం. అంతేకాదు, బ్రెజిల్​కి నార్వే జట్టు పీడకలలా వెంటాడుతోంది! నార్వేపై దిగ్గజ బ్రెజిల్​ జట్టు ఎప్పుడూ గెలవలేదు! ఈ మ్యాచ్​తో కలిపి బ్రెజిల్​ సీనియర్ మెన్స్​ టీమ్.. నార్వేతో తలపడిన ఐదుసార్లు ఓడిపోయింది.

ఈ చారిత్రాత్మక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన నార్వే.. జులై 11న మయామిలో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ లేదా ఫిఫా వరల్డ్​ కప్ 2026 సహ-ఆతిథ్య దేశం మెక్సికోతో తలపడనుంది.

కన్నీటి వీడ్కోలు పలికిన నెయ్​మర్: "ఇక సెలవు"

ఫిపా వరల్డ్​ కప్ 2026 నుంచి బ్రెజిల్ నిష్క్రమించడంతో ఆ దేశ సాకార్ లెజెండ్, 34 ఏళ్ల నెయ్​మర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

"నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది. ఏ మెట్‌లైఫ్ స్టేడియంలో అయితే 2010లో నా అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించానో, సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే మైదానంలో నా కెరీర్‌ను ముగిస్తున్నాను," అని నెయ్​మర్ భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన నెయ్​మర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బ్రెజిల్‌కు 6వ ప్రపంచకప్ అందించి తీరాలనే నెయ్​మర్ సుదీర్ఘ నిరీక్షణ ఈ ఘోర పరాజయంతో విషాదాంతంగా ముగిసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More