ఐపీఎల్ వేలంలో కామెరాన్ గ్రీన్‌కు రికార్డు ధర.. కేకేఆర్, సీఎస్కే హోరాహోరీ ఫైట్.. చివరికి కేకేఆర్ గూటికి..

ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు రికార్డు ధర లభించింది. అతడు ఏకంగా రూ.25.20 కోట్లకు అమ్ముడవడం విశేషం. గ్రీన్ కోసం సీఎస్కే, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడగా.. చివరికి కేకేఆర్ సొంతం చేసుకుంది.

Published on: Dec 16, 2025 3:12 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ జాక్‌పాట్ కొట్టాడు. అబుదాబి వేదికగా జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతన్ని ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం గ్రీన్ చేతికి మాత్రం రూ. 18 కోట్లు మాత్రమే వెళ్తాయి. మిగతా డబ్బు బోర్డుకు వెళ్తుంది. అయితే ప్రస్తుతం మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)ను దాటేసి ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ గా గ్రీన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ప్లేయర్ రిషబ్ పంత్ (రూ.27 కోట్లు).

ఐపీఎల్ వేలంలో కామెరాన్ గ్రీన్‌కు రికార్డు ధర.. కేకేఆర్, సీఎస్కే హోరాహోరీ ఫైట్.. చివరికి కేకేఆర్ గూటికి.. (IPL)
ఐపీఎల్ వేలంలో కామెరాన్ గ్రీన్‌కు రికార్డు ధర.. కేకేఆర్, సీఎస్కే హోరాహోరీ ఫైట్.. చివరికి కేకేఆర్ గూటికి.. (IPL)

కామెరాన్ గ్రీన్ కొత్త రికార్డు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఊహించినట్లే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) అత్యధిక ధర పలికాడు. మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఆసీస్ ఆటగాడి కోసం రికార్డు స్థాయి మొత్తాన్ని వెచ్చించింది.

కేవలం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ముంబై ఇండియన్స్ బిడ్డింగ్ మొదలుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. రూ. 13.60 కోట్ల వద్ద రాజస్థాన్ తప్పుకుంది.

కేకేఆర్ సొంతం చేసుకుంది అనుకునేలోపు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగగా.. చివరికి రూ. 25.20 కోట్లకు కేకేఆర్ గ్రీన్‌ను దక్కించుకుంది.

రూ. 25 కోట్లు పలికినా.. వచ్చేది 18 కోట్లే

ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడుపోయినప్పటికీ.. అతనికి దక్కేది మాత్రం రూ. 18 కోట్లు మాత్రమే. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. విదేశీ ఆటగాళ్లకు గరిష్టంగా రూ. 18 కోట్లు (గత వేలం హైయెస్ట్ రిటెన్షన్ స్లాబ్) మాత్రమే చెల్లించాలి. బిడ్డింగ్ అంతకంటే ఎక్కువ వెళ్లినా.. ఆటగాడికి ఆ రూ.18 కోట్లే ఇస్తారు.

మిగిలిన మొత్తం (రూ. 7.20 కోట్లు) బీసీసీఐకి చెందిన 'ప్లేయర్ వెల్ఫేర్ ఫండ్' కు వెళ్తుంది. అయితే ఫ్రాంచైజీ (KKR) మాత్రం తమ పర్సు నుంచి పూర్తి మొత్తం రూ. 25.20 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్ కేవలం విదేశీ ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.

గ్రీన్ ప్లేయర్ ప్రొఫైల్

కామెరాన్ గ్రీన్ ఓ ఆల్ రౌండర్. అయితే వేలానికి ముందు చిన్న పొరపాటు వల్ల గ్రీన్ పేరు కేవలం 'బ్యాటర్' జాబితాలో వచ్చింది. కానీ తాను బౌలింగ్ కూడా చేస్తానని గ్రీన్ స్పష్టం చేశాడు. గతంలో ముంబై, ఆర్సీబీ జట్లకు ఆడిన గ్రీన్.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 29 మ్యాచుల్లో 707 పరుగులు, 16 వికెట్లు సాధించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More