Sign in

తేజస్​ విమాన ప్రమాదంలో మరణించిన భర్తకు.. వింగ్ కమాండర్ అఫ్షాన్ హృదయ విదారక ‘సెల్యూట్’

దుబాయ్​ ఎయిర్​షోలో జరిగిన తేజస్​ విమాన ప్రమాదంలో కన్నుమూసిన వింగ్​ కమాండర్​ నమన్ష్​ స్యాల్​కి ఆయన భార్య, వింగ్​ కమాండర్​ అఫ్షాన్​ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ హృదయ విదారక దృశ్యాలు ప్రజలకు కంట తడి పెట్టిస్తున్నాయి.

Published on: Nov 24, 2025, 07:30:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దుబాయ్​ ఎయిర్​ షోలో జరిగిన తేజస్​ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వింగ్​ కమాండర్​ నమన్ష్​ స్యాల్​ అంత్యక్రియలు హిమాచల్​ ప్రదేశ్​ కాంగ్రా జిల్లాలో ఆదివారం జరిగింది. వందలాది మంది ప్రజలు తరలి వెళ్లి నమన్ష్​ స్యాల్​కి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆ సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి గురైన నమన్ష్​ స్యాల్​ భార్య, వింగ్​ కమాండర్​ అఫ్షాన్​ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రజలకు కంట తడి పెట్టిస్తోంది.

నమన్ష్​ భార్య, వింగ్​ కమాండర్​ అఫ్షాన్​ (PTI)
నమన్ష్​ భార్య, వింగ్​ కమాండర్​ అఫ్షాన్​ (PTI)

భర్తకు వింగ్ కమాండర్ అఫ్షాన్ హృదయ విదారక సెల్యూట్

నవంబర్ 21, శుక్రవారం నాడు దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షో సందర్భంగా తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతుండగా విమానం కూలిపోవడంతో వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ మరణించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన ఈ పైలట్‌కు భార్య, ఆరేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు.

“అంకితభావం కలిగిన ఫైటర్ పైలట్‌గా”, “నిష్ణాతులైన ప్రొఫెషనల్‌గా” ఐఏఎఫ్​ అభివర్ణించిన ఈ 34 ఏళ్ల పైలట్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం పాటియాల్కర్‌లో జరిగాయి. చివరి కర్మలకు ముందు వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్‌ను చివరిసారిగా చూసేందుకు గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

ఐఏఎఫ్​ అధికారులు సమన్ష్​ స్యాల్​కి గన్​ సెల్యూట్​ చేశారు.

న్యూస్ ఏజెన్సీ ఏఎన్​ఐ పంచుకున్న దృశ్యాల్లో.. వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్ కన్నీళ్లతో తన భర్తకు చివరి నివాళులర్పించడం కనిపించింది. ఐఏఎఫ్​ అధికారి అయిన ఆమె, తన భర్తకు వీడ్కోలు చెబుతూ సెల్యూట్ కూడా చేశారు. ఆ సమయంలో తీవ్ర బాధతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ చితికి నిప్పు పెట్టగా, ఐఏఎఫ్​ అధికారులు, పౌర అధికారులు, రాజకీయ నాయకులు, స్థానికులు హాజరై తమ ప్రియమైన ‘నమ్ము’కు చివరి నివాళులర్పించారు.

దుబాయ్ ఎయిర్‌షోలో ఏం జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన కార్యక్రమాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్‌షోలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రదర్శనలో 150కి పైగా దేశాలు తమ ఏరోస్పేస్ పనితీరును ప్రదర్శించాయి.

ఎయిర్‌షో చివరి రోజున తీసిన దృశ్యాల్లో.. తేజస్ ఫైటర్ జెట్ అకస్మాత్తుగా కింద పడిపోయి, మంటలు చెలరేగి, విమానాశ్రయం అంతటా దట్టమైన పొగ కమ్ముకోవడం కనిపించింది.

ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

నివాళులు అర్పించిన ప్రముఖులు

సైనిక్ స్కూల్ సుజాన్‌పూర్ టిరా పూర్వ విద్యార్థి అయిన నమన్ష్ స్యాల్, డిసెంబర్ 2009లో ఐఏఎఫ్​లో చేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆయనను "అచంచలమైన నిబద్ధత, అసాధారణ నైపుణ్యం" కలిగిన "అంకితభావం గల ఫైటర్ పైలట్, నిష్ణాతులైన ప్రొఫెషనల్‌"గా గుర్తు చేసుకుంది.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ నష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నటుడు కమల్ హాసన్ వంటి ప్రముఖులు కూడా నివాళులర్పిస్తూ.. ఆయనను "భారతదేశ ధైర్యవంతుడైన పుత్రుడు, చాలా తొందరగా దూరం అయ్యాడు" అని పేర్కొన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More