భారతీయులకు హెచ్-1బీ వీసా కష్టాలు: 2027 వరకు ఇంటర్వ్యూ స్లాట్లు లేనట్టే!

అమెరికా వీసా స్టాంపింగ్ కోసం భారత్ వచ్చిన హెచ్-1బీ వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో భారీగా పెండింగ్ పెరిగిపోవడంతో, ఇంటర్వ్యూ గడువులు ఏకంగా 2027 వరకు వెనక్కి వెళ్లాయి. ఫలితంగా వేలాది మంది తమ ఉద్యోగాలకు, కుటుంబాలకు దూరమయ్యారు.

Published on: Jan 25, 2026, 16:02:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో స్థిరపడాలనే సాఫ్ట్‌వేర్ నిపుణుల కలలకు 'వీసా స్టాంపింగ్' గండం చుట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఏకంగా 2027 వరకు పెరిగిపోయింది. ఈ పరిణామం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మొదట 2025 డిసెంబరులో మొదలైన ఈ హెచ్​-1బీ వీసా ఇంటర్వ్యూ జాప్యం, క్రమంగా 2026 మార్చ్​కి, ఆపై అక్టోబర్‌కు, ఇప్పుడు ఏకంగా 2027 వరకు చేరుకుంది.

భారతీయుల హెచ్​-1బీ వీసా కష్టాలు..
భారతీయుల హెచ్​-1బీ వీసా కష్టాలు..

హెచ్​-1బీ కష్టాలు- నిపుణులు ఏమంటున్నారు?

పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సూచనలు కనిపించడం లేదని వలస వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ ఉద్యోగులు వీసా స్టాంపింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు రావద్దని వారు సూచిస్తున్నారు.

"అమెరికా అధికారులు వీసాలు ఇవ్వడానికి ఎటువంటి తొందర పడటం లేదు. వీసాలను తిరస్కరించడానికే ప్రయత్నిస్తున్నారు. బైడెన్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ ప్రభుత్వం మీకు వీసా ఇవ్వడానికి సుముఖంగా లేదు," అని హ్యూస్టన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ సంస్థ పార్టనర్ ఎమిలీ న్యూమాన్ కుండబద్దలు కొట్టారు. గడిచిన 50 రోజుల్లో భారత్‌లో ఒక్క కొత్త ఇంటర్వ్యూ స్లాట్ కూడా ఓపెన్ కాలేదని ఆమె పేర్కొన్నారు.

హెచ్​-1బీ వీసా అసలు ఎందుకీ జాప్యం?

ఈ భారీ వెయిటింగ్ లిస్ట్‌కు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:

సోషల్ మీడియా స్క్రీనింగ్: 2025 డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఉపాధి ఆధారిత వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. దీనివల్ల ప్రతి దరఖాస్తును పరిశీలించడానికి కాన్సులేట్ అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా రోజుకు జరిగే హెచ్​-1బీ ఇంటర్వ్యూల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

థర్డ్ కంట్రీ ఆప్షన్ రద్దు: గతంలో భారతీయులు వీసా స్టాంపింగ్ కోసం ఇతర దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉండేది. కానీ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆ అవకాశాన్ని రద్దు చేయడంతో, అందరూ భారత కాన్సులేట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనితో దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కాన్సులేట్లపై తీవ్ర పని ఒత్తిడి పడుతోంది.

కుటుంబాలకు దూరం.. ఉద్యోగాల గండం!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడ్డిట్' ఇప్పుడు బాధితుల ఆవేదనకు వేదికైంది. ఒక యూజర్ తన గోడు వెళ్లబోసుకుంటూ.. "చెన్నైలో ఫిబ్రవరి 18, 2026న ఉన్న నా అపాయింట్‌మెంట్‌ను మే 24, 2027కి మార్చారు. నా ప్రయాణం రద్దయ్యింది, ఉద్యోగం ఊడుతుందేమోనని భయంగా కూడా ఉంది," అని పోస్ట్ చేశారు.

అమెరికాలో భార్యాపిల్లలు ఉండి, కేవలం స్టాంపింగ్ కోసం భారత్ వచ్చిన వారు ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఉద్యోగ కాంట్రాక్టులు అన్నీ గందరగోళంగా మారాయి. పైగా డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించడంతో, కంపెనీలు కూడా కొత్తగా స్పాన్సర్ చేయడానికి వెనకాడుతున్నాయి.

అమెరికన్ కంపెనీలపైనా ప్రభావం..

భారతీయ నిపుణుల గైర్హాజరీ వల్ల విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి సంస్థలే కాకుండా అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఐటీ కంపెనీలు భారతీయుల కంటే అమెరికా పౌరులకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాయి.

మొత్తం మీద తాజా పరిణామాలతో అడ్మినిస్ట్రేటివ్ పరంగా చిన్న ప్రక్రియగా భావించే వీసా స్టాంపింగ్, ఇప్పుడు వేలాది కుటుంబాలకు ఒక భావోద్వేగ పోరాటంగా మారింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More