మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త - 119 నియోజకవర్గాల్లో సూపర్ బజార్లు, మండలాల్లో రైస్ మిల్లులు!
రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పథకాలను ప్రకటించారు. నియోజకవర్గాల్లో కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు, మండలాల్లో రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Indira Mahila Shakti Super Bazar : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చి, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మహిళా శక్తి ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో 'ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్ల'ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్లు
కేవలం సూపర్ బజార్లకే పరిమితం కాకుండా, మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు వీలుగా ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
"కొందరు రైస్ మిల్లర్లు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఈ బాధ్యతలను మన ఆడబిడ్డలకు అప్పగించడం ద్వారా వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనం వస్తుంది. భవిష్యత్‌లో ప్రతి మండలంలో పెద్ద గోడౌన్లు కట్టి ధాన్యాన్ని భద్రపరుస్తాం. మిల్లర్లు నేరుగా మహిళల దగ్గరి నుంచే ధాన్యం సేకరించేలా విధానాన్ని మారుస్తాం," అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన స్థలాలను కేటాయించే బాధ్యత తనదేనని…. బ్యాంకు లంకేజీ ద్వారా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన
రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఏకకాలంలో 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలోనే ఒకే రోజు ఇన్ని భవనాలకు శంకుస్థాపన చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే వేదికపై మహిళలకు అందించే ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను సీఎం విడుదల చేశారు.
30 ఏళ్ల లీజు, కార్పస్ ఫండ్ సహాయం
సూపర్ బజార్ల నిర్వహణ కోసం మొదటి విడతగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి, మహిళా సంఘాలకు కేవలం నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని సీఎం ఆదేశించారు. ఈ సూపర్ బజార్ల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత కార్పస్ ఫండ్ అందిస్తామని…. అదే సమయంలో సంఘాల్లోని మహిళలు కూడా కొంత మేర పెట్టుబడి భాగస్వాములు కావాలని సూచించారు.
“కార్పొరేట్ కంపెనీల సూపర్ బజార్లలో వస్తువులు కొనేది మన మహిళలే. ఇకపై నాణ్యమైన నిత్యావసరాలు, అత్యవసర వస్తువులు కావాలంటే మహిళా శక్తి బజార్లకే వెళ్లాలనే బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలి. ఇవి దేశంలోనే నంబర్ వన్ సూపర్ బజార్లుగా ఎదగాలి” అని సీఎం ఆకాంక్షించారు.
మహిళా సంఘాలకు ఆర్థిక ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులను కేటాయించింది. దీని ద్వారా మహిళా సంఘాలకు అద్దె రూపంలో నెలకు రూ. 70,000 స్థిర ఆదాయం సమకూరుతుంది. ఇందులో భాగంగానే జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మరో 553 బస్సులను మహిళా సంఘాలకు అందించనున్నారు. మహిళలు వ్యాపారాల్లో రాణించేందుకు…. సరికొత్త ఐడియాలతో ముందుకు వచ్చేందుకు వీలుగా ఈ నెల 29న 'వీ-హబ్' (V-Hub) ద్వారా ప్రత్యేక ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నారు.
మహిళా సంఘాల బ్యాంకు రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి ఏకంగా రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళా రుణాలపై జీరో వడ్డీ కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,390 కోట్లు చెల్లించిందని తెలిపారు. ఈ సందర్భంగా రుణాల చెల్లింపుల్లో 100 శాతం రికార్డు సాధించిన నిర్మల్ జిల్లా మహిళలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
మహిళల ఆర్థికాభివృద్ధిపైనే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉందన్న ముఖ్యమంత్రి, మహిళల ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కోసం కేవలం 29 నెలల్లోనే ఆర్టీసీకి రూ. 10,000 కోట్లకు పైగా నిధులు చెల్లించామని సీఎం గుర్తుచేశారు. ఈ వారంలోనే ఇందిరాగాంధీ స్త్రీ శక్తి అంగన్‌వాడీ భవనాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి మరిన్ని కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
"2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా క్యాబినెట్ లక్ష్యం. మహిళలందరినీ మా సొంత సోదరీమణులుగా భావించి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది," అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

