అకిరాతో మాట్లాడాను.. కాక్రో‌చ్‌లు మురికిలోనే ఉంటాయ్.. సీజేపీ క్రేజ్‌పై పవన్ కళ్యాణ్ విశ్లేషణ!

యువత నేతృత్వంలోని రాజకీయ ఉద్యమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి తరం తమదైన ఆకాంక్షలను, ఆలోచనలను తీసుకువస్తుందని గుర్తు చేశారు.

Published on: Jun 12, 2026, 12:26:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలో సాగుతున్న రాజకీయ ఉద్యమాలపై చర్చ జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party - CJP) ఆవిర్భావం, నేటి తరం ఆలోచనలపై ఆయన తన అభిప్రాయాలను ఏఎన్ఐతో పంచుకున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని పూర్తిగా ఒక కొత్త విషయంగా చూడలేమని, ప్రతి తరంలోనూ రాజకీయాలను, సమాజాన్ని తమదైన శైలిలో మార్చాలని యువత ప్రయత్నించే ఒక నిరంతర ప్రక్రియలో భాగమే అని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలపై యువతలో ఉన్న అసంతృప్తి వల్లే ఈ మార్పు వస్తోందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానమిస్తూ.. రాజకీయ ఆలోచనలలో తరం మారినప్పుడల్లా ఇలాంటి మార్పులు సహజమేనని చెప్పారు.

'ప్రస్తుతం 'జెన్ జీ' (Gen Z) గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఏదో అకస్మాత్తుగా ఈ వాదన తెరపైకి వచ్చినట్లు అందరూ భావిస్తున్నారు. కానీ నా దృష్టిలో 1920లు లేదా 1940లను చూసినా.. ప్రతి 25-30 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుంది. వారు తమ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తారు. 1980లలో ఒక తరం ఉంది, 2000లలో మరో తరం వచ్చింది, ఇప్పుడు 2020లలో ఉన్న యువతకు వారి స్వంత ఆకాంక్షలు ఉన్నాయి.' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ యువ ఉద్యమాలను తక్కువ చేసి చూపకూడదని, యువత ఎందుకు అంత ఆగ్రహంతో ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని జనసేనాని అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరును ప్రస్తావిస్తూ.. 'బొద్దింక (Cockroach) అనేది మురికి కాలువల్లో ఉండే జీవి. వ్యవస్థలోని లోపాల వల్ల వారు అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను.' అని పవన్ వ్యాఖ్యానించారు.

నేటి యువత ఇలాంటి ఉద్యమాలను ఎలా చూస్తోందో తెలుసుకోవడానికి తన కుమారుడితో (అకిరా నందన్) మాట్లాడినట్లు పవన్ వెల్లడించారు. 'నా కొడుకుతో మాట్లాడుతూ ఈ విషయంపై అడిగాను. వాడికి దాదాపు 20 మంది స్నేహితుల గ్రూప్ ఉంది. అందులో ఎంతమంది ఈ మూవ్‌మెంట్‌ను ఫాలో అవుతున్నారని అడిగితే.. ముగ్గురు దీనికి సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు చెప్పాడు.' అని పవన్ వివరించారు. దీనిని బట్టి ఈ మద్దతు ఎప్పుడూ ప్రత్యక్ష ఉద్యమంగా కనిపించకపోవచ్చు కానీ, యువతలో ఉన్న అసంతృప్తికి ఇది అద్దం పడుతోందని పవన్ అభిప్రాయపడ్డారు.

యువత బహిరంగంగా ఇలాంటి వేదికలపైకి రావడానికి సంకోచించినప్పటికీ.. వారు మార్పును కోరుకుంటున్నారని పవన్ స్పష్టం చేశారు. యువత తమ అసంతృప్తిని ప్రదర్శించడానికి, లేదా వారికి నచ్చని విషయాలను వ్యతిరేకించడానికి ఒక వేదికను వెతుక్కున్నారన్నారు. గత కొన్ని రోజులుగా తాను యువతతో జరిపిన సంభాషణల ప్రకారం.. వారు భిన్నమైన రాజకీయాలను ఆశిస్తున్నారని చెప్పారు.

'సరికొత్త ఆలోచనలతో పాతకాలపు మార్కు రాజకీయాలకు స్వస్తి పలకాలి. ప్రాంతీయ పక్షపాతం, వినాశకర విధానాలు పోవాలి. అర్థవంతంగా మాట్లాడే నాయకులను యువత కోరుకుంటోంది.' అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

నిజానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సెటైరికల్ ఉద్యమంగా పుట్టుకొచ్చింది. దేశంలోని కొందరు యువకులను ఉద్దేశించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కాక్రోచ్ అనే పదాన్ని ఉపయోగించడంతో, దానికి నిరసనగా యువత ఈ వేదికను ఏర్పాటు చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More