Adhey Neevu Adhey Nenu Review: అదే నీవు అదే నేను రివ్యూ-ట్విస్టులతో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Adhey Neevu Adhey Nenu Review And Rating In Telugu: త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అదే నీవు అదే నేను. కొండల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి అదే నీవు అదే నేను రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jul 31, 2026, 14:54:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Adhey Neevu Adhey Nenu Movie Review In Telugu And Rating: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్లలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆకట్టుకునే ప్రేమకథకు కాసింత ఉత్కంఠ, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ అంశాలు తోడైతే ప్రేక్షకులు సీట్ల అంచులపై కూర్చుని సినిమాను ఆస్వాదిస్తారు.

అదే నీవు అదే నేను రివ్యూ-ట్విస్టులతో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అదే నీవు అదే నేను రివ్యూ-ట్విస్టులతో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

అదే నీవు అదే నేను రివ్యూ

అదే నమ్మకంతో శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై కాండ్రేగుల గోవిందు నిర్మించిన చిత్రం 'అదే నీవు అదే నేను'. తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అదే నీవు అదే నేను సినిమాకు డైరెక్టర్ కొండల్ దర్శకత్వం వహించారు. రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఇవాళ (జూలై 31) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి అదే నీవు అదే నేను రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాగర్ (యశ్వంత్ పెండ్యాల), అతని భార్య శ్రీవల్లి (తన్వీ నేగి) నివసిస్తుంటారు. సాగర్ తల్లి సావిత్రి (కల్పలత) కోడలిని సొంత కూతురిలా చూసుకుంటుంది. అంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా సాగర్ తన భార్యకు తగినంత సమయం ఇవ్వలేకపోతాడు.

ఈ క్రమంలోనే వారి ఎదురు ఫ్లాట్‌లోకి కెనడా నుంచి ప్రాజెక్ట్ పని మీద వచ్చిన కార్తీక్ (త్రినాథ్ వర్మ) అడుగుపెడతాడు. చలాకీగా ఉండే కార్తీక్ సరదా మాట తీరు శ్రీవల్లిని ఆకర్షిస్తుంది. తను తప్పు చేస్తున్నానని మనసులో అనుకున్నప్పటికీ అతడిని దూరం పెట్టలేక సతమతమవుతుంది. ఈ క్రమంలోనే భర్త సాగర్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు శ్రీవల్లికి తెలుస్తాయి. ఆ నిజాలేంటి? చివరకు శ్రీవల్లి ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంది? సాగర్ శ్రీవల్లి కార్తీక్ ముగ్గురి జీవితాల్లో ఏం జరిగింది? అనేది వెండితెరపైనే చూడాలి.

విశ్లేషణ:

ఇది ఒక సస్పెన్స్ రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా సినిమా. ఒక కారులో శ్రీవల్లి రెండు మృతదేహాలను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లే సస్పెన్స్ సీన్‌తో సినిమా చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అసలు ఆమె ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే ఆసక్తిని పెంచుతూ కథ గతంలోకి వెళ్తుంది.

ప్రారంభంలోనే రెండు మృతదేహాల సీన్‌తో ప్రేక్షకులలో ఉత్కంఠ పెంచిన దర్శకుడు, ఫస్టాఫ్‌ను గేటెడ్ కమ్యూనిటీ వాతావరణం, ఆఫీస్ కామెడీతో సరదాగా నడిపించారు. రీమిక్స్ రీల్ స్టార్ రవిగా బిత్తిరి సత్తి, మంగళవారంగా సూర్యతేజ చేసే హంగామా థియేటర్లో నవ్వులు పూయిస్తుంది.

మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో స్క్రీన్ ప్లే

ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు సిసలైన థ్రిల్ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఏర్పడిన సందేహాలన్నింటికీ ఊహకందని ట్విస్టులతో సమాధానమిచ్చారు దర్శకుడు కొండల్. సినిమాలో ఒక్క పోలీస్ పాత్ర కూడా లేకుండా ఒక థ్రిల్లర్ కథనాన్ని నడిపించడం కథనంలో కనిపిచే కొత్తదనం.

సమాజంలో జరుగుతున్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను మలచడం విశేషం. ఫస్టాఫ్ అంతా కామెడీ, శ్రీవల్లి-సాగర్ భార్యాభర్తల బంధం, కార్తీక్ ఎఫైర్ ప్రయత్నాలతో సాగితే సెకండాఫ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. క్లైమాక్స్ పర్వాలేదు.

నటీనటుల అభినయం

'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూనే చాక్లెట్ బాయ్ లుక్‌లో త్రినాథ్ వర్మ, కాస్త గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో యశ్వంత్ చక్కటి మెచ్యూరిటీ ప్రదర్శించారు. శ్రీవల్లిగా తన్వీ నేగి నటన కథకు ప్రధాన బలమని చెప్పాలి. అనేక లేయర్లు ఉన్న పాత్రను ఆమె చాలా సహజంగా పండించింది.

సాంకేతిక బలం

రూబీగా సహర్ కృష్ణన్ గ్లామర్ జోడిస్తూనే అభినయంతో ఆకట్టుకుంది. సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. నిమ్మల జయపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. కనిష్క అందించిన 'మనసా మనసా', 'మధురమా' పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమా గ్రాఫ్‌ను పెంచింది. ప్రొడ్యూసర్ కాండ్రేగుల గోవిందు ప్రొడక్షన్ విలువలు క్వాలిటీగా ఉన్నాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే?

"పెళ్లికి ముందు ప్రేమ 'నువ్వు లేకపోతే నేను బతకలేను' అని చెబితే.. పెళ్లి తర్వాత ప్రేమ 'నేను బతికేదే నీకోసం' అని చెబుతుంది" అనే సందేశంతో చిత్రాన్ని ముగించారు. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కోరుకునే ప్రేక్షకులు అదే నీవు అదే నేను సినిమాపై ఓ లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More