ఢిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్.. మూడు రోజుల డెడ్ లైన్ విధించిన న్యాయస్థానం.. అసలు ఏమైందంటే?
నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ-కామర్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మూడు రోజుల్లో స్పందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరి ఇంతకీ ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో తన గుర్తింపు దుర్వినియోగం అవుతోందని ఆయన ఆరోపించారు. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరారు. ఈ మేరకు ఈ-కామర్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మూడు రోజుల్లోగా జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

అసలు ఏం జరిగిందంటే?
జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, చిత్రం, సారూప్యత, తన గుర్తింపు ఇతర లక్షణాలను అనధికారికంగా ఉపయోగించకుండా తన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఈ కేసును విచారించారు. సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్ జూనియర్ ఎన్టీఆర్ తరపున వాదించారు.
అనేక ఈ-కామర్స్, సోషల్ మీడియా సైట్లు తన హక్కులను ఉల్లంఘించే కంటెంట్‌ను హోస్ట్ చేస్తున్నాయని తారక్ తరపున లాయర్ కోర్టుకు తెలియజేశారు. తన సమ్మతి లేకుండా వాణిజ్య లాభం కోసం ఆ కంటెంట్ ను ఉపయోగిస్తున్నారని ఆయన కోర్టులో తెలిపారు.
3 రోజుల్లో
వాదనలు విన్న తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలని కోర్టు ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశించింది. కంపెనీలకు స్పందించడానికి మూడు రోజులు సమయం ఇచ్చింది. డిసెంబర్ 22న కోర్టు ఈ కేసును తిరిగి పరిశీలిస్తుంది. అప్పుడు వివరణాత్మక, అధికారిక ఉత్తర్వు జారీ అవుతుందని భావిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, నాగార్జున, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, చిరంజీవి వంటి ప్రముఖులు తమ గుర్తింపు దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఇలా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
తారక్ రీసెంట్ సినిమాలు
2018లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ లో దర్శకుడు SS రాజమౌళి, సహనటుడు రామ్ చరణ్‌తో కలిసి పనిచేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. దాని 'నాటు నాటు' పాట ఆస్కార్ కూడా గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అదే పాటకి గోల్డెన్ గ్లోబ్ కూడా దక్కింది.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 2024లో కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర: పార్ట్ 1' లో నటించారు. ఈ సంవత్సరం హిందీలో ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2' తో అరంగేట్రం చేశారు. అందులో హృతిక్ రోషన్, కియారా అడ్వాణీ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే చిత్రం 'డ్రాగన్' అనే పేరుతో తెరకెక్కుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.














